కేసీఆర్ ను ప్రత్యేకంగా సన్మానించనున్న రేవంత్ రెడ్డి?
అవును... తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకోబోతుందని అంతున్నారు
By: Tupaki Desk | 24 May 2024 8:01 AM GMTతెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు తెరపైకి రాబోతున్నాయి. ప్రధానంగా ఇతర రాజకీయ నాయకులకంటే భిన్నంగా వెళ్లాలని, తనకంటూ ప్రత్యేకతను ఏర్పరచుకోవాలని ప్రయత్నిస్తున్నారనే పేరు సంపాదించుకున్న తెలంగాణ సీఎం కి సంబంధించిన ఒక ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది! ఇందులో భాగంగా ఆయన కేసీఆర్ ని సన్మానించబోతున్నారని అంటున్నారు.
అవును... తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకోబోతుందని అంతున్నారు. వాస్తవానికి రాజకీయంగా కేసీఆర్ - రేవంత్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందనే సంగతి తెలిసిందే. ఆ విషయంలో వీరిద్దరి మధ్య శతృత్వం పీక్స్ అనే చెప్పాలి. అయితే... కేసీఅర్ కి ప్రమాదం జరిగి ఆస్పత్రిలో ఉన్నప్పుడు మాత్రం ఆయనకు ఇవ్వాల్సిన గౌరవాన్ని రేవంత్ ఇచ్చారు.
ఫలితంగా... రాజకీయాలకు, వ్యక్తిగత సంబంధాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఇప్పటికే నిరూపించుకున్నట్లయ్యింది. ఈ క్రమంలో... జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటారు. ఇదే క్రమంలో... రాష్ట్రం ఏర్పడి పదేళ్లు పూర్తయిన పండగ కూడా ఘనంగా జరపనున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది చిరస్మరణీయంగా ఉండాలని రేవంత్ కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్రం ఏర్పడి పదేళ్లైన సందర్భాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని రేవంత్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా... ఈ ఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా నిర్వహించనున్నారని, ఈ కార్యక్రమానికి ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీని కూడా ఆహ్వానించనున్నారని తెలుస్తుంది.
ఆమె దార్శనికత వల్లనే ప్రత్యేక తెలంగాణ సాకారమైందనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నేతలు గట్టిగా చెబుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆ రోజు ఆమెను ప్రత్యేకంగా, ఘనంగా సన్మానించనున్నారని అంటున్నారు. ఇదే సమయంలో... తెలంగాణ విప్లవకారులందరికీ ప్రత్యేక ఆహ్వానాలు పంపాలని రేవంత్ అధికారులను ఆదేశించారని తెలుస్తుంది.
ఇదే క్రమంలో... బీఆరెస్స్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును కూడా ఈ సంబరాలకు ప్రత్యేకంగా ఆహ్వానించాలని రేవంత్ & కో భావించారని అంటున్నారు. ఈ క్రమంలోనే... ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటాన్ని గుర్తుచేస్తూ ఘనంగా సన్మానించాల్సిన అవసరం ఉందని రేవంత్ భావిస్తున్నారని అంటున్నారు.