కేసీఆర్ కు పరామర్శ.. రేవంత్ అడుగులు భేష్
ఇప్పటికే కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్ వాకబు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీని యశోద ఆస్పత్రికి పంపి ఎప్పటికప్పుడు వివరాలు తెలపాలని ఆదేశించారు.
By: Tupaki Desk | 10 Dec 2023 6:51 AM GMTవ్యక్తిగత సంబంధాలు వేరు.. రాజకీయాలు వేరు.. ఎన్నికల వరకు హోరాహోరీగా సమరం.. అనంతరం కేవలం డెవలప్ మెంట్ మీదనే ఫోకస్.. రాజకీయాల రీత్యా పరస్పరం ప్రత్యర్థులే కానీ, శత్రువులు కాదు.. ఇదంతా పరిణతి ఉన్న నాయకుడు ఆలోచించే విధానం. గతంలో ఈ విధమైన సంస్కారం ఉండేది.. కానీ, ఈ రోజుల్లో ప్రతీకార రాజకీయాలే లక్ష్యంగా మారాయి. ఇక్కడ అక్కడ అని కాదు.. దేశమంతా.. ఎన్నికల్లో గెలిచాక ప్రత్యర్థిని ముప్పుతిప్పులు పెట్టాలి.. గత ప్రభుత్వాల నిర్ణయాల్లో తప్పులున్నా లేకున్నా.. వాటిని తిరగదోడాలి.
ప్రగతి భవన్ నుంచి ప్రజా భవన్..
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం అధికారిక నివాసమైన ప్రగతి భవన్ పై విమర్శలు చేసిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక దానిని కూల్చకుండా, ప్రస్తుతానికి ప్రజా దర్బార్ కు వేదికగా చేసుకున్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే, ప్రగతి భవన్ ను పడగొట్టమని.. భావి తరాలకు ఉపయోగపడేలా ఇతర అవసరాలకు వాడతామని రేవంత్ ఇప్పటికే స్పష్టం చేశారు. ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ను నాశనం చేయమని.. సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. ఈ నిర్ణయంతోనే ప్రజల్లో సానుకూలత ఏర్పడింది.
సరిగ్గా గత ఆదివారం ప్రగతి భవన్ లో.. నేడు
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం సరిగ్గా గత ఆదివారం వరకు ప్రగతి భవన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ రోజు సాయంత్రం ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కేసీఆర్ నేరుగా ఎర్రవల్లిలోని ఫాం హౌస్ కు వెళ్లిపోయారు. అనంతరం అక్కడకు వచ్చిన ఎమ్మెల్యేలను కలిశారు. స్వగ్రామం చింతమడక ప్రజలు వచ్చి కలిశారు. అయితే, అనూహ్యంగా గురువారం అర్థ రాత్రి ఆయన ఫాం హౌస్ లో జారిపడ్డారు. దీంతో శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేర్చారు. అదే రోజు సాయంత్రం తుంటి మార్పిడి శస్త్రచికిత్స చేశారు. మరోవైపు కేసీఆర్ కు 6 నుంచి 8 వారాల విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. శనివారం ఆయనను అటుఇటు కాస్త నడిపించారు. మరికొద్ది రోజుల్లో డిశ్చార్జి చేస్తామని ప్రకటించారు.
ఆసత్రికి వెళ్లనున్న సీఎం రేవంత్
తెలంగాణ రాజకీయాల్లో ఓ అరుదైన సీన్ కనిపించనుంది. కేసీఆర్ ను యశోద ఆస్పత్రిలో సీఎం రేవంత్ పరామర్శించనున్నారు. ముందుగా తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్.. యశోద ఆస్పత్రికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ యోగ క్షేమాలు తెలుసుకోనున్నారు. ఇప్పటికే కేసీఆర్ ఆరోగ్యం గురించి సీఎం రేవంత్ వాకబు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీని యశోద ఆస్పత్రికి పంపి ఎప్పటికప్పుడు వివరాలు తెలపాలని ఆదేశించారు. ఇప్పుడు నేరుగా సీఎం రేవంత్ ఆస్పత్రికి వెళ్లి కేసీఆర్ ను పరామర్శించనున్నారు. వ్యక్తిగత ఆరోపణలు, దూషణలే రాజకీయాలుగా మారిన ఈ రోజుల్లో ప్రత్యర్థి ఆరోగ్యపరంగా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పరామర్శించడం అంటే నైతికంగా మంచి మార్కులు పడినట్లే.