ఇంట్లో అద్దెకు ఉండే వారికి సైతం గృహజ్యోతి
ఇళ్లల్లో అద్దెకు ఉండే వారికి గృహజ్యోతి పథకాన్ని అమలు చేయరంటూ సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ వర్సిటీల్లోనూ జోరుగా తప్పుడు ప్రచారం సాగుతోంది.
By: Tupaki Desk | 7 Feb 2024 3:56 AM GMTతాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారెంటీలను కేవలం వంద రోజుల్లో అమలు చేస్తామని చెప్పినట్లే.. రేవంత్ సర్కారు కొలువు తీరినంతనే ఆ దిశగా ప్రయత్నాలు సాగుతున్న సంగతి తెలిసిందే. అధికారంలోకి వచ్చిన మొదటి వారంలోనే రెండు హామీల్ని అమల్లోకి తెచ్చేసిన రేవంత్.. తాజాగా మరో రెండు హామీల్ని నెరవేర్చేందుకు వీలుగా కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. తమ గ్యారెంటీ హామీల్లో అత్యంత కీలకమైన గృహజ్యోతి పథకానికి సంబంధించిన విధివిధానాలపై భారీగా కసరత్తు జరుగుతోంది.
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని చూస్తే.. గృహజ్యోతి పథకం ద్వారా వీలైనంత ఎక్కువమంది లబ్థిదారులకు ప్రయోజనం చేకూరేలా ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగా అద్దె ఇళ్లల్లో ఉండే వారికి సైతం ఈ పథకంలో లబ్థిదారులుగా నిర్ణయిస్తున్నట్లుగా తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 20వేల లీటర్ల ఉచిత నీరు పథకాన్ని అమలు చేసే విషయంలో చోటు చేసుకున్న కంగాళీ మాదిరి కాకుండా.. ఒక దశలో కేసీఆర్ సర్కారుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తేలా జరిగింది.
అలాంటి తప్పులు గృహజ్యోతి పథకం అమలు వేళ చోటు చేసుకోకుండా పథకాన్ని అమలు చేయాలన్నట్లుగా అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయినట్లుగా తెలుస్తోంది. ఇళ్లల్లో అద్దెకు ఉండే వారికి గృహజ్యోతి పథకాన్ని అమలు చేయరంటూ సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ వర్సిటీల్లోనూ జోరుగా తప్పుడు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో అద్దెకు ఉండే వారికి సైతం 200యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వనున్నట్లుగా స్పష్టం చేశారు.
అయితే.. ఈ పథకం అమలుకుసంబంధించిన స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల కానప్పటికీ.. ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం వీలైనంత ఎక్కువ మందికి ఈ పథకంలో లబ్థిదారుల్ని చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉందంటున్నారు.
గత నెల ఒకటి నాటికి రాష్ట్రంలో 1.31 కోట్ల ఇళ్లకు కరెంటు కనెక్షన్లు ఉంటే.. వీటిల్లో 2022-23మధ్య కాలంలో 200 యూనిట్ల లోపు వినియోగించే ఇళ్లు ఎన్ని ఉన్నాయన్నది డిస్కంలు తమ సిబ్బంది చేత ఇప్పటికే చెక్ చేస్తున్న పరిస్థితి. అంతేకాదు.. గృహజ్యోతి పథకం లబ్దిదారుగా అప్లికేషన్ పెట్టుకోనప్పటికీ.. మీటర్ రీడింగ్ కోసం ఇంటికి వచ్చే కరెంటు ఉద్యోగి వద్ద కూడా వివరాల్ని నమోదు చేసుకునే వీలుందని చెబుతున్నారు.