రేవంత్ రెడ్డికి లైన్ క్లియర్... !
తెలంగాణా కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని స్పష్టం అవుతోంది. ఈ మేరకు అనుమానపు మేఘాలు ఒక్కోటిగా తొలగిపోతున్నాయి.
By: Tupaki Desk | 5 Dec 2023 9:08 AM GMTతెలంగాణా కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని స్పష్టం అవుతోంది. ఈ మేరకు అనుమానపు మేఘాలు ఒక్కోటిగా తొలగిపోతున్నాయి. ఢిల్లీకి వచ్చిన మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అలాగే మల్లు భట్టి విక్రమార్కలకు కూడా కాంగ్రెస్ పెద్దలు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారని అంటున్నారు.
ఇక సుదీర్ఘంగా హై కమాండ్ తో చర్చిచి బయటకు వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం ఎవరు అన్న మీడియా ప్రశ్నకు నో కామెంట్ అని బదులిచ్చి వెళ్లిపోయారు. దాంతో పాటుగా ఆయన మరో మాట అన్నారు. అధినాయకత్వం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని. సో అలా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడంతో రేవంత్ రెడ్డికి అవకాశాలు మెరుగు అయ్యాయా అన్న చర్చ వస్తోంది.
అదే విధంగా భట్టి విక్రమార్క విషయంలో కూడా హై కమాండ్ సానుకూలంగా ఉన్నా కూడా రేవంత్ రెడ్డిని ఎందుకు సీఎం గా చేయాలని చూస్తున్నారో కూడా వివరించే ప్రయత్నం చేశారు అని అంటున్నారు. ఇక ఆయనకు కూడా పార్టీలో సముచితమైన స్థానం ఉంటుందని, ప్రభుత్వంలో కీలక భూమిక ఉంటుందని అంటున్నారు.
మొత్తానికి ఇవన్నీ చూస్తూంటే రేవంత్ రెడ్డికి సీఎం పోస్టు కన్ ఫర్మ్ అని దాదాపుగా ఢిల్లీలో రాజకీయ పరిణామాలు గమనిస్తున్న వారికి అందుతున్న సమాచారం. మరో వైపు చూస్తే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ కూడా వచ్చి చాలా సేపు చర్చలలో పాల్గొన్నారు అని అంటున్నారు.
రాహుల్ గాంధీ ఏమి చెప్పారు అన్నది కూడా ఆసక్తికరంగా ఉంది. కాంగ్రెస్ ముందు చాలా టార్గెట్లు ఉన్నాయి. తెలంగాణలో కేసీయార్ ని నిలువరించడంతో పాటు లోక్ సభ ఎన్నికలలోనూ కాంగ్రెస్ ఇదే టెంపోని కొనసాగించాల్సి రావడం అంతే కాదు అనేక రకాలుగా కాంగ్రెస్ కి తెలంగాణా నుంచి భవిష్యత్తులో అవసరాలు ఉన్నాయి.
ఇలా అన్ని కోణాల నుంచి ఆలోచించే సీఎం ఎంపిక జరుగుతుంది అని అంటున్నారు.మొత్తానికి చూస్తే రేవంత్ రెడ్డి పేరునే అధినాయకత్వం ప్రకటిస్తుంది అని అంటున్నారు. మరి మిగిలిన పోస్టులు ఎవరికీ కీలక మంత్రిత్వ శాఖలు ఎవరికీ అన్నది కూడా కొలిక్కి వచ్చాక కీలక ప్రకటన వస్తుంది అని అంటున్నారు.