తెలంగాణలో బిగ్ పొలిటికల్ ట్విస్టు.. బీజేపీ సీనియర్ నేత ఇంటికి రేవంత్!
తెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించింది.
By: Tupaki Desk | 14 March 2024 9:29 AM GMTతెలంగాణలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలపై దృష్టి సారించింది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా.. పదికి పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయమని ఇప్పటికే పలు సర్వేలు ప్రకటించాయి.
ఇప్పటికే ప్రధాన పార్టీలు.. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు ఎన్నికల వేళ తెలంగాణలో బిగ్ పొలిటికల్ ట్విస్టు చోటు చేసుకుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ పరిణామం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.
గతంలో జితేందర్ రెడ్డి బీఆర్‌ఎస్ లో ఉన్నారు. బీఆర్‌ఎస్ లోక్ సభ పక్ష నేతగా కూడా వ్యవహరించారు. అయితే ఆ తర్వాత ఆయనకు సీటు కేటాయించలేదు. దీంతో జితేందర్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికల్లో మహబూబ్ నగర్ సీటును జితేందర్ రెడ్డి ఆశించారు.
అయితే మహబూబ్ నగర్ ఎంపీ స్థానాన్ని బీజేపీ అధిష్టానం తాజాగా ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణకు కేటాయించింది. ఈ నేపథ్యంలో జితేందర్ రెడ్డికి నిరాశ ఎదురైంది. మరోవైపు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మహబూబ్ నగర్ నుంచి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డికి, బీఆర్‌ఎస్ మన్నె శ్రీనివాసరెడ్డికి సీట్లు ప్రకటించాయి. దీంతో మూడు పార్టీల మధ్య సంకుల సమరం జరగనుంది.
ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. బీజేపీ సీనియర్ నేత జితేందర్ రెడ్డికి ఇంటికి వెళ్లారు, ఈ సందర్భంగా ఆయనతో భేటీ అయ్యారు. జితేందర్ రెడ్డికి మహబూబ్ నగర్ సీటను బీజేపీ అధిష్టానం ఇవ్వకపోవడం, ఇదే సమయంలో రేవంత్ ఆయన ఇంటికి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యమంత్రి వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు.
ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ మా ఇంటికి రావడం కొత్తేమీ కాదన్నారు. తన అన్న ఇంటికి వచ్చాడని కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రిది, తనది ఒక్కటే జిల్లా అని గుర్తు చేశారు. తనకు సీటు రాలేదని ఓదార్చడానికే సీఎం రేవంత్ వచ్చాడని తెలిపారు.
తాను ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నానని జితేందర్ రెడ్డి గుర్తు చేశారు. బీజేపీలో సంతోషంగానే ఉన్నానన్నారు. తన సీటు గురించి బీజేపీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీలో టికెట్లు భర్తీ అయిపోయాయని జితేందర్ రెడ్డి గుర్తు చేశారు. మహబూబ్ నగర్ లో వంశీచంద్ రెడ్డి, చేవెళ్లలో పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారన్నారు. పార్టీలోకి సీఎం రేవంత్ తనను ఆహ్వానించలేదన్నారు. తాను కూడా ఏమీ మాట్లాడలేదన్నారు. కేవలం పరామర్శ కోసమే రేవంత్ తన ఇంటికి వచ్చారని వ్యాఖ్యానించారు,
కాగా జితేందర్ రెడ్డి 1999లో బీజేపీ తరఫున మహబూబ్ నగర్ లో గెలుపొందారు. తిరిగి మళ్లీ 2014లో బీఆర్‌ఎస్ తరఫున ఎంపీగా విజయం సాధించారు.