కాంగ్రెస్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. ఇప్పటికే ఇదే పెద్ద వికెట్
లోక్ సభ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణలో మళ్లీ రాజకీయాలు ఊపందుకున్నాయి.
By: Tupaki Desk | 21 Jun 2024 6:23 AM GMTలోక్ సభ ఎన్నికలు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణలో మళ్లీ రాజకీయాలు ఊపందుకున్నాయి. జంపింగ్ లకు మరోసారి సమయం ఆసన్నమైందనే భావన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ కు చెందిన 20 మందిపైగా ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే కథనాలు వచ్చాయి. సరే.. ఇందులో సగంమంది వెళ్లిపోయినా అది పెద్ద సంచలనమే. అయితే, కాంగ్రెస్ వైపు చూస్తున్నవారిలో అధికులు జీహెచ్ ఎంసీకి చెందిన ఎమ్మెల్యేలని సమాచారం.
తెలంగాణ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డిని కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. శుక్రవారం సీఎం రేవంత్.. మంత్రి పొంగులేటితో కలిసి పోచారం ఇంటికి వెళ్లారు. ఆయన్ను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ నాయకత్వంపై కొంతకాలంగా పోచారం అసంతృప్తిగా ఉన్నట్లు ఊహాగానాలు వినిపించాయి. ఆయన పార్టీ మారతారని ప్రచారం కూడా జరిగింది. దీనిని పోచారం ఖండించలేదు. ఈ నేపథ్యంలో శుక్రవారం పోచారం ఇంటికి సీఎం రేవంత్ వెళ్లడంతో ఆయన కాంగ్రెస్ లో చేరడం ఖాయమైని తేలిపోయింది.
సీనియర్ ఎమ్మెల్యే..
తెలుగుదేశం ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన ఘనత పోచారం శ్రీనివాస్ రెడ్డి. గత ఎన్నికల్లో బాన్సువాడ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మొత్తమ్మీద ఉప ఎన్నికతో కలిపి ఏడుసార్లు ఇక్కడనుంచి నెగ్గారు. అలాంటి సీనియర్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పనుండడం ఆ పార్టీకి కచ్చితంగా దెబ్బే. మరోవైపు బీఆర్ఎస్ నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ లో చేరినవారిలో దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్రావ్ (భద్రాచలం), కడియం శ్రీహరి (స్టేషన్ ఘనపూర్) ఉన్నారు. వీరిలో శ్రీహరి మాత్రమే పోచారం స్థాయి సీనియర్. చూద్దాం.. ఇంకా ఎంతమంది బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ బాట పడతారో..?