Begin typing your search above and press return to search.

అమాత్య పదవులకు ఆషాడ గండం !

ఇన్‌చార్జి గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్‌డ్డి భేటీ తర్వాత మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.

By:  Tupaki Desk   |   5 July 2024 9:30 AM GMT
అమాత్య పదవులకు ఆషాడ గండం !
X

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఏడునెలలు దాటిపోయింది. లోక్ సభ ఎన్నికల తర్వాత పెండింగ్ లో ఉన్న ఆరు మంత్రి పదవులు భర్తీ చేస్తారని ఆశావాహులు ఎదురు చూస్తూ వస్తున్నారు. సీఎం రేవంత్ ఐదు రోజులు ఢిల్లీలో ఉండి మంతనాలు జరిపినా మంత్రి పదవుల భర్తీ కొలిక్కి రాలేదు. ఇక తాజాగా ఆషాడం వస్తున్న నేపథ్యంలో ఆ భర్తీ మళ్లీ వాయిదా పడింది.

ఆషాఢ మాసానికి ముందే అమాత్య యోగం వస్తుందని ఆశించిన నేతల ఆశలపై కాంగ్రెస్ అధిష్టానం నీళ్లు చల్లింది. ఇన్‌చార్జి గవర్నర్ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్‌డ్డి భేటీ తర్వాత మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు ఊపందుకున్నాయి.

రేవంత్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే విస్తరణ ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే సీనియర్ నేతలు తమ అనుచరులకు, బంధువులకు మంత్రిపదవులు ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో అధిష్టానం విస్తరణ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో విస్తరణ మళ్లీ ఎప్పుడు ఉంటుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.

మంత్రివర్గంలో ఆరు మంత్రి పదవులతోపాటు డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్, పీసీసీ అధ్యక్షుల నియామకం పూర్తి చేసి పాలనపై దృష్టి పెడతారని భావించారు. రేవంత్ రెడ్డి ఒక లిస్టు తయారు చేసి హైకమాండ్ అనుమతి కోసం ఢిల్లీ వెళ్లారు. ఐతే తమ వారికి మంత్రి పదవులు ఇవ్వాలంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ జాబితా ఇవ్వడంతో ఏకాభిప్రాయం కుదరలేదు.

ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డితో సహా క్యాబినెట్ లో 12మంది మంత్రులు ఉన్నారు. ఐతే కొన్ని ఉమ్మడి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం దక్కలేదు. దీంతో ఆయా జిల్లాలకు చెందిన నేతలు మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు గ్రేటర్ హైదరబాద్ లో ఒక్కరు కూడా మంత్రిగా లేరు. అదే విధంగా మైనార్టీలకు ప్రాతినిధ్యం దక్కలేదు.

ఆరు మంత్రి పదవుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రేమ్ సాగర్ రావు, నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి, నల్గొండ జిల్లా నుంచి రాజగోపాల్ రెడ్డి శ్రీహరి ముదిరాజ్‌ మరో ఇద్దరి పేర్లను రేవంత్ ప్రతిపాదించినట్లు సమాచారం. ఇక ప్రేమ్ సాగర్ రావుకు ఇవ్వాలని భట్టి, గడ్డం వివేక్ కు ఇవ్వాలని రేవంత్ ప్రతిపాదించినట్లప తెలుస్తుంది. రాజగోపాల్ రెడ్డికి ఇస్తే తన భార్యకు ఇవ్వాలని ఉత్తమ్, సీనియారిటీ నేపథ్యంలో నిజామాబాద్ సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని ప్రతిపాదన రాగా రాహుల్ కోటా కింద అదే జిల్లా నుండి మన్మోహన్, ఎస్టీ కోటా కింద నల్లగొండ నుండి బాలూ నాయక్ పేర్లు పరిగణనలోకి వచ్చాయి. ఈ వ్యవహారం అంతా గందరగోళంగా ఉండడంతో అధిష్టానం ప్రస్తుతానికి విస్తరణ పక్కన పడేసిందని తెలుస్తుంది.