Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి ఆఫర్లు...కాంగ్రెస్ ఆశావహుల సంగతేంటి ?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుని చూసుకుంటున్నారు.

By:  Tupaki Desk   |   29 July 2024 12:30 AM GMT
రేవంత్ రెడ్డి ఆఫర్లు...కాంగ్రెస్ ఆశావహుల సంగతేంటి ?
X

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్తుని చూసుకుంటున్నారు. ఆయన రాజకీయ చదరంగం ఆటలో బాగా ఆరితేరిపోయారనే చెప్పాలి.ఆయన 2017లో టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు. కేవలం ఆరేళ్ల కాలంలో ఆయన సీఎం కుర్చీని అందుకున్నారు. 2023 లో జరిగిన తెలంగాణా ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడానికి అనేక ఫ్యాక్టర్లు ఉన్నాయి. అందులో రేవంత్ రెడ్డి ఫ్యాక్టర్ కూడా ఒకటి.

ఈ విషయంలో ఆయనను ఎవరూ తక్కువ చేసి చూడలేరు. అందుకే కాంగ్రెస్ హై కమాండ్ కూడా రేవంత్ రెడ్డికి సీఎం అయ్యే చాన్స్ ఇచ్చింది. పక్కన ఉన్న కర్ణాటకలో చూస్తే ఏళ్ళకు ఏళ్ళుగా కష్టపడుతూనే ఉన్నా డీకే శివకుమార్ ని డిప్యూటీ సీఎం గానే ఉంచింది. అదే తెలంగాణలో మాత్రం రేవంత్ రెడ్డికి అగ్ర పీఠం దక్కింది.

దానికి బొటాబొటీగా కాంగ్రెస్ కి సీట్లు రావడం కూడా మరో కారణం. ఏదేమైతేనేమి రేవంత్ రెడ్డి తెలంగాణాకు కేసీఆర్ తరువాత రెండవ సీఎం అయ్యారు. ఆయన సీఎం అయిన ఈ ఏడు నెలలలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి ఏకంగా పది మంది ఎమ్మెల్యేలను లాగేశారు. ఇంకా ఆపరేషన్ ఆకర్ష్ అలా సాగుతూనే ఉంది. ఆ నంబర్ ఎక్కడ ఆగుతుందో తెలియదు.

ఇది నిజంగా కాంగ్రెస్ లో పదేళ్లుగా అధికారంలో లేకుండా ఇబ్బంది పడి ఎన్నో పోరాటాలు చేసిన అసలైన కాంగ్రెస్ నేతలకు తీవ్ర అసంతృప్తిగానే ఉన్న వ్యవహారం. అయితే అలా వచ్చిన వారు అధికారంలో పాలు పంచుకుంటూ మొదటి నుంచి పార్టీలో ఉన్న వారిని తొక్కేసి పోతే మాత్రం పార్టీలో అదే అతి పెద్ద ముప్పుని తెచ్చి పెడుతుంది అనడంలో సందేహం అయితే లేదు.

ఇదిలా ఉంటే అధికార సుస్థిరత కోసం రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ ఆపరేషన్ ఆకర్ష్ కి కాంగ్రెస్ హై కమాండ్ ఆశీస్సులు కూడా ఉన్నాయని అంటున్నారు. సో రాజకీయాల్లో ఎవరు అధికారంలో ఉన్నా ఇలాంటివి చేస్తున్నారు కాబట్టి తప్పు పట్టాల్సినది లేకపోయినా అయిన వారికి ఆకులు కాని వారికి కంచాలలలో వడ్డిస్తే మాత్రం కాంగ్రెస్ లో తిప్పలు తప్పవని అంటున్నారు.

మరో వైపు చూస్తే పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ తో భుజం భుజం కలిపి పనిచేసిన మజ్లీస్ పార్టీ ఇపుడు కాంగ్రెస్ కి మిత్రపక్షంగా మారింది. ఆ పార్టీ అయితే కాంగ్రెస్ కి బొటాబొటీ మెజారిటీ ఉంది కాబట్టే తాను అండగా ఉంటానని ముందుకు వచ్చింది. అలా కాంగ్రెస్ కి వచ్చిన 64 సీట్లు మజ్లిస్ కి ఉన్న ఏడు సీట్లు కలిస్తే 71 అవుతాయి. పవర్ ఫుల్ మెజారిటీ ఉన్నట్లే. కానీ బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలను లాగేస్తూ రేవంత్ రెడ్డి మరింత బలోపేతం అవాలని చూస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇపుడు మజ్లీస్ ని కూడా కాంగ్రెస్ లోకి చేరమని ఆయన కోరుతున్నారు. ఈ మేరకు నిండు అసెంబ్లీలోనే భారీ ఆఫర్ ఇచ్చారు. మజ్లిస్ శాసనసభా పక్ష నేత అక్బరుద్ధీన్ ఒవైసీ ని కాంగ్రెస్ లో చేరమని కొడంగల్ నుంచి పోటీ చేస్తే తానే చీఫ్ ఎలెక్షన్ ఏజెంట్ గా ఉంటానని బంపర్ మెజారిటీతో గెలిపించుకుని వస్తానని రేవంత్ రెడ్డి సూపర్ ఆఫర్ ఇచ్చారు.

అంతే కాదు ఆయనకు డిప్యూటీ సీఎం పదవి కూడా ఇస్తామని కూడా సభాముఖంగా ప్రకటించారు. అయితే దానికి అక్బరుద్దీన్ సున్నితంగా తిరస్కరిస్తూ తాము ఎక్కడికీ చేరేది లేదని తేల్చేశారు. ఇది ఒక విధంగా సరదా సన్నివేశంగా తీసుకున్నా కూడా కాంగ్రెస్ లో అయితే దీని మీద చర్చ సాగుతోంది అని అంటున్నారు. సొంత పార్టీలో పదేళ్ళుగా కష్టపడుతూ అధికారం కోసం ఎంతో పోరాటం చేసిన వారు ఉన్నారు.

ఇంకా కాంగ్రెస్ కి కేబినెట్ లో ఆరు మంత్రి పదవులు కూడా ఉన్నాయి. వాటిని ఎపుడు భర్తీ చేస్తారో తెలియదు. మరో వైపు చూస్తే ఏకైక ఉప ముఖ్యమంత్రిగా ఇస్తేనే ఉంటానని చెప్పి భట్టి విక్రమార్క కోరడంతోనే ఆ ఒక్క పోస్ట్ ని క్రియేట్ చేసి ఇచ్చారు. సీఎం రేసులో ఒక దశలో పోటీ పడిన భట్టి ఇపుడు డిప్యూటీగా సర్దుకున్నారు. ఇదీ కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితి.

మరి ఆయనతో పాటుగా మరొకరికి ఉప ముఖ్యమంత్రి ఇస్తామని అంటున్నారు రేవంత్ రెడ్డి. అది కూడా మజ్లిస్ నుంచి వస్తే ఇస్తామని అంటున్నారు. ఇది సొంత పార్టీ వారికి బాధ కలిగించే అంశంగానే చెబుతున్నారు. కాంగ్రెస్ లో ఉన్న వారికి అధికారంలోకి వచ్చిన తరువాత న్యాయం చేయడం తొలి కర్తవ్యం కావాలని వారు కోరుతున్నారు.

అలా కాకుండా బయట నుంచి వచ్చిన వారికే పెద్ద పీట వేస్తామని రేవంత్ రెడ్డి చెప్పినట్లుగా ఉందని అంటున్నారు. ముందు ఆరు ఖాళీలను భర్తీ చేస్తే చాలా మంది ఆశావహులకు చోటు దక్కుతుంది కదా ఆ దిశగా వేగంగా ఆలోచనలు చేయాలని సూచనలు వెలువడుతున్నాయి. కాంగ్రెస్ లో తానుగా మరింత బలపడే విధంగా రేవంత్ రెడ్డి వ్యూహాలు ఉన్నాయని అయితే కాంగ్రెస్ అంటేనే లక్షలాది మంది కార్యకర్తలు నేతల సమూహమని వారి ఆకాంక్షలను సీఎం తీర్చాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అంతే కాదు కాంగ్రెస్ కి జనాలు 64 సీట్లు ఇచ్చి అధికారంలో కూర్చోబెట్టారు.

అలాంటిది ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో ఇతర పార్టీల నుంచి నేతలను తెచ్చి వారికి పదవులు ఇస్తామని ఓపెన్ ఆఫర్ ఇవ్వాల్సిన అవసరం ఉందా అన్న చర్చ అయితే పార్టీలో సాగుతోందని అంటున్నారు. ఏది ఏమైనా కాంగ్రెస్ లో అసలైన నేతలకు న్యాయం చేయాలని అంతా కోరుతున్నారు.