Begin typing your search above and press return to search.

ఆ రెండింటితో ఇమేజ్ బిల్డింగ్ షురూ చేసిన రేవంత్

ఆ మాత్రం సామర్థ్యం లేకుంటే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పరిమితం చేసి.. తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగలరా?

By:  Tupaki Desk   |   2 Aug 2024 6:30 AM GMT
ఆ రెండింటితో ఇమేజ్ బిల్డింగ్ షురూ చేసిన రేవంత్
X

మన డప్పు ఎవరూ వాయించనప్పుడు.. ఎవరి డప్పు వారే వాయించుకోవాల్సిందే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అదే పని చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధిక్యతను సాధించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి సిద్ధమైన వేళలో.. తనను సీఎంను చేసేందుకు అవసరమైన సరంజామాను జాగ్రత్తగా సిద్ధం చేసుకున్న రేవంత్ ఎంతటి చక్కటి వ్యూహకర్త అన్న విషయం ఇట్టే అర్థమవుతుంది. ఆ మాత్రం సామర్థ్యం లేకుంటే.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఫామ్ హౌస్ కు పరిమితం చేసి.. తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగలరా?

ఈ ఒక్క ఉదంతం చాలు.. రేవంత్ శక్తిసామర్థ్యాలు ఏమిటో తెలుసుకోవటానికి. కొందరు రాజకీయ ప్రత్యర్థులు.. అందునా మాజీ మంత్రి కేటీఆర్.. హరీశ్ లు లాంటి వారు రేవంత్ లక్కీ ఫెలో అని.. ‘పేమెంట్’ కోటాలో ముఖ్యమంత్రి అయ్యారని ఎద్దేవా చేసినా.. నిజంగా అలాంటి అవకాశమే ఉంటే.. రేవంత్ కంటే శక్తి సామర్థ్యాలు ఉన్న తోపు నేతలు తెలంగాణ కాంగ్రెస్ లో చాలా మందే ఉన్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ తీరే వేరుగా ఉంటుంది. నాయకులు తమకు అక్కర్లేదని.. నాయకుల్ని తామే తయారు చేస్తామన్న ధీమా ఇప్పటికి ఆ పార్టీలో సడల్లేదు.

ఈ లెక్కన చూసినప్పుడు రేవంత్ ను పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయ్యారన్న విమర్శలో అర్థం లేదనే చెప్పాలి. సీఎం కుర్చీలో కూర్చున్న నాటి నుంచి ఐదేళ్ల తర్వాత జరిగే అసెంబ్లీ ఎన్నికల మీదనే ఫోకస్ పెట్టిన వైనం..ఆయన్ను... ఆయన మాటల్ని జాగ్రత్తగా ట్రాక్ చేసే వారికి ఇట్టే అర్థమవుతుంది. కాకుంటే.. ఆయన ఎంపిక చేసుకున్న ప్రాధామ్యాలు సరైనవా? కావా? అన్నది కాలమే తేల్చాల్సి ఉంటుంది.

ముఖ్యమంత్రి హోదాలో తన కలల ప్రాజెక్టులుగా మూడింటిని చెప్పిన ఆయన.. రెండింటి మీద అదే పనిగా ఫోకస్ చేస్తున్నారు. అందులో మొదటిది మూసీ రూపురేఖల్ని మార్చటం.. ఇందుకు రూ.లక్ష కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెబుతున్నారు. రెండోది.. నగరం మొత్తం మెట్రోను విస్తరించేలా ఫేజ్ 2, ఫేజ్ 3 మీద ఫోకస్ పెట్టటం.. దాన్ని పూర్తి చేయటం... మూడోది హైదరాబాద్ మహానగరానికి నాలుగో నగరాన్ని నిర్మించటం. ఈ మూడింటి గురించి పదే పదే ప్రస్తావిస్తున్న రేవంత్ ను తెలివితక్కువ వాడిగా.. అనవసరంగా భారీ ప్రాజెక్టులను తల మీదకు ఎత్తుకున్న అధినేతగా చూస్తున్నారు.

కానీ.. జాగ్రత్తగా చూస్తే.. ఇవే ఆయన ఫ్యూచర్ అస్త్రాలుగా చెప్పాలి. తాను ఎంచుకున్న మూడు ముఖ్యమైన అంశాల విషయంలో ఒక మోస్తారు పురోగతి సాధించినా.. ఆ సానుకూలతకు మరోసారి అధికారాన్ని కట్టబెట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకుంటే.. ఒక నగరాన్ని నిర్మిస్తున్న వేళ.. ఆ దిశగా అడుగులు పడి.. రేవంత్ చెప్పినట్లే పనులు జరుగుతున్నప్పుడు.. హైదరాబాద్ మహానగర అడుగులు మరోలా మారతాయి. అలాంటప్పుడు మరో ప్రభుత్వాన్ని తీసుకురావాలని తెలంగాణప్రజలు కోరుకోరు. కనీసం మరోసారి అధికారాన్ని అప్పజెప్పాలనుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.

అంతేకాదు.. రేవంత్ చెప్పినట్లుగా పనుల్ని పూర్తి చేస్తే.. చరిత్రలో ఆయన మిగిలిపోతారు. హైదరాబాద్ మహానగరానికి తలమానికంగా ఉండే రెండు ఐకానిక్ ప్రాజెక్టులను పూర్తిచేయటం.. మెట్రోను విస్తరిస్తే.. ఆ క్రెడిట్ ఆయన ఖాతాలో పడుతుంది. ఇదంతా చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. రేవంత్ ఇప్పుడు పదే పదే ప్రస్తావిస్తున్న అంశాలన్ని కూడా ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల ఎజెండాగా చెప్పాలి. ఈ ఐదేళ్లలో తాను ప్రస్తావిస్తున్న మూడు ప్రాజెక్టులను ఒక స్థాయికి తీసుకొచ్చినా.. రేవంత్ వ్యూహం అమలైనట్లే. ప్లాన్ బాగుంటే సరిపోదు. కాలం ఎంత కలిసి వస్తుందో చూడాలి.