Begin typing your search above and press return to search.

కూల్చివేతలే కాదు.. ఖర్చులు వారివే.. షాకివ్వనున్న హైడ్రా?

ఇప్పుడు ఏ నోట విన్నా హైడ్రానే. హైదరాబాద్ పేరును ‘హైడ్రా’ రాబాద్ గా మార్చేశారంటూ సోషల్ మీడియా పోస్టుల గురించి తెలిసిందే.

By:  Tupaki Desk   |   27 Aug 2024 4:26 AM GMT
కూల్చివేతలే కాదు.. ఖర్చులు వారివే.. షాకివ్వనున్న హైడ్రా?
X

ఇప్పుడు ఏ నోట విన్నా హైడ్రానే. హైదరాబాద్ పేరును ‘హైడ్రా’ రాబాద్ గా మార్చేశారంటూ సోషల్ మీడియా పోస్టుల గురించి తెలిసిందే. సాధారణంగా ఏదైనా నిర్ణయాన్ని తీసుకున్నప్పుడు ముందు సామాన్యుల మీద చూపించే అధికార వ్యవస్థలకు భిన్నంగా హైడ్రా తన తొలి అడుగులోనే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు.. బడా బాబుల ఆస్తుల మీదనే ఫోకస్ చేసింది. దీంతో.. ఈ వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. మీడియాలోనూ.. సోషల్ మీడియాలోనూ ఇదే చర్చ నడుస్తోంది. ఏ రోజు ఎవరికి సంబంధించిన ఆస్తుల మీద కూల్చివేతలు చేపడుతుందన్నది చర్చగా మారింది.

సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన నేతలు.. వారికి సంబంధించిన ఆస్తుల మీద చర్యలు తీసుకోవటానికి కాస్త ముందు వెనుకా ఉంటుంది. అందుకు భిన్నంగా కాంగ్రెస్ నేతలకు సంబంధించిన వాటిపైనా హైడ్రా కొరడా ఝుళిపించింది. ఈ క్రమంలో ఇప్పటివరకు 18 చోట్ల 166 నిర్మాణాల్ని నేలమట్టం చేశారు. కట్టడాలు కూల్చిన నేపథ్యంలో నిర్మాణ వ్యర్థాలు భారీగా పోగుపడుతున్న పరిస్థితి. వీటిని తరలించేందుకు కోట్లాది రూపాయిల ఖర్చు కానుంది. మరి.. వీటిని ఎవరు భరిస్తారు? అన్నది ప్రశ్న.

కూల్చివేతల వేళ.. అవసరమైన యంత్రాల ఏర్పాటు లాంటి వాటికి సంబంధించిన ఖర్చును హైడ్రానే భరించేది. కానీ.. నిర్మాణ వ్యర్థాల విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. తాజాగా.. ఈ విషయంపై హైడ్రా కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. నిర్మాణ వ్యర్థాల్ని తరలించేందుకు సదరు నిర్మాణాన్ని చేపట్టిన వారి నుంచే వసూలు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

నిర్మాణ వ్యర్థాల తొలగింపు అంత తేలికైన ప్రక్రియ కాదు. ఇందుకోసం కోట్లాది రూపాయిల ఖర్చు అవుతుంది. అందుకే.. కూల్చివేతలకు సంబంధించిన నిర్మాణ వ్యర్థాల్ని తొలగించేందుకు అవసరమైన ఖర్చును భరించేలానిర్ణయం తీసుకున్నారు. మరి.. దీనిపై సదరు నిర్మాణదారులు ఎలా స్పందిస్తారన్నది ప్రశ్న. ఇప్పటికే ఆస్తుల డ్యామేజ్ విషయంలో హైడ్రా తీసుకున్న నిర్ణయాలపై గుర్రుగా ఉన్న వారు.. తాము కూల్చేసిన నిర్మాణ వ్యర్థాల తరలింపు ఖర్చును భరించాలన్న దానిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.