Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌ను రేవంత్ త‌క్కువ‌గా అంచ‌నా వేస్తున్నారా..?

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి

By:  Tupaki Desk   |   10 July 2024 5:48 AM GMT
జ‌గ‌న్‌ను రేవంత్ త‌క్కువ‌గా అంచ‌నా వేస్తున్నారా..?
X

ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. రాష్ట్రంలో ప్రతిపక్షం లేదని, ప్రతిపక్షం జీరో అయిందని, పోరాడాల్సింది షర్మిల మాత్రమేనని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతిని పురస్కరించుకుని మంగళగిరిలో నిర్వహించిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ప్రశ్నించేలా, ఆయ‌న‌ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పనితీరును ప్రశ్నార్ధకం చేసేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజ‌యం పాలయింది. అయినప్పటికీ 40 శాతం ఓటు బ్యాంకును దక్కించుకున్న విషయం తెలిసిందే. మరి ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా పక్కన పెట్టారా? లేక జగన్మోహన్ రెడ్డిని మరింత డ్యామేజీ చేయాల‌ని నిర్ణయించుకున్న ఉద్దేశంతోనే ఆయన రాష్ట్రంలో ప్రతిపక్షం లేదు అని చెప్పారా? అనేది ప్ర‌శ్న‌. జగన్మోహన్ రెడ్డికి మున్ముందు భవిష్యత్తు తీవ్రంగా ఉంటుంద‌ని, కేసులు చుట్టుముడుతున్నాయ‌నే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారా.? అనేది ఆసక్తిగా మారింది.

సహ‌జంగా గెలుపు వాటములు ఏ పార్టీకైనా కామనే. గతంలోనూ తెలంగాణ ఇచ్చామని చెప్పుకున్న కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. తర్వాత పార్టీ పుంజుకుని 66 స్థానాల్లో విజయం సాధించి అధికారం చేపట్టింది. దీన్నిబట్టి ఏ పార్టీకైనా గెలుపు ఓటములు సహజంగా జరిగే ప్రక్రియ. కానీ జగన్మోహన్ రెడ్డి విషయానికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేదంటూ షర్మిల కి బాధ్యత ఎక్కువగా ఉందని షర్మిలే ప్రజా సమస్యలను ప్రస్తావిస్తారని తాము అన్ని విధాల అండగా ఉంటామని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని తీసిపారేసినట్టుగా కనిపిస్తున్నాయి.

ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తుందని తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు పెరుగుతాయని రేవంత్ రెడ్డి ఆశించి ఉండొచ్చు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరని అన్నట్టుగా వైసీపీ విషయంలోనూ అదే జరుగుతుందని ఆయన భావించి ఉంటారు. అయితే అసలు ప్రతిపక్షమే లేదు అని చెప్పడం ద్వారా పూర్తిగా డామేజ్ చేయాలన్నటువంటి భావన అయితే స్పష్టంగా కనిపిస్తోంది. దీనిని జగన్ సీరియస్‌గా తీసుకుంటే తప్ప రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తిప్పికొడితే తప్ప రాష్ట్రంలో వైసిపి పరిస్థితి మెరుగుపడే అవకాశాలు కనిపించడం లేదు.

ఏదో వచ్చారులే ఏదో అన్నారులే అవన్నీ పట్టించుకుంటారా అని జగన్మోహన్ రెడ్డి భావిస్తే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మునుముందు మరింత ఇబ్బందుల్లో పడే పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటికైనా మేల్కొని క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు నిజమేనా? లేక రాజకీయంగా ఆయన టార్గెట్ చేశారా? అనే విషయాలపై దృష్టి పెట్టి పార్టీని బలోపేతం చేసేదిగా అడుగులు వేయాలని పరిశీలకులు సూచిస్తున్నారు.