Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డి ఎక్కువ చేశారా ?

ప్రపంచ కమ్మ మహా సభలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. దానికి ముఖ్య అతిథిగా తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పిలిచారు

By:  Tupaki Desk   |   21 July 2024 5:30 AM GMT
రేవంత్ రెడ్డి ఎక్కువ చేశారా ?
X

ప్రపంచ కమ్మ మహా సభలను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. దానికి ముఖ్య అతిథిగా తెలంగాణా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పిలిచారు. ఇలాంటి సామాజిక వర్గ సమావేశాలు నిర్వహించడమూ తప్పు కాదు అలాగే సీఎంలు వెళ్లడమూ తప్పు కాదు.

అయితే కుల సమావేశాలలో మతపరమైన సమావేశాలలో సీఎం అన్న స్థానంలో ఉన్న వారు ఆచీ తూచీ మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు అందరి వారు, అన్ని వర్గాలకు చెందిన వారు. సమాజంలో భిన్నత్వం లో ఏకత్వం ఉంది. అదే సమాజాన్ని నడిపించే ఒక గొప్ప తత్వం.

ఇక రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంలో అతి ఉంది అని అంటున్నారు. అతిశయం కూడా ఉంది అని అంటున్నారు. కమ్మ వారిని అమ్మ తో పోల్చారు. అలాగే అదేదో సినిమాలో అన్నట్లుగా పైన అమ్మ వారు కిందన కమ్మవారు అని మరో క్యాచీ డైలాగ్ వాడారు. వారు మంచివారు అని సమాజ హితులు అని అన్నారు.

ఇవన్నీ కరెక్టే. కమ్మ వారు ముందు చూపుతో ఉంటారు. ప్రోగ్రెస్సివ్ థాట్స్ తో ఉంటారు. అవకాశాలను అందుకునే నైజంతో ఉంటారు. సమాజాన్ని కలుపుకుని ముందుకు పోయే తత్వం వారి సొంతం. అదే సమయంలో మిగిలిన సామాజిక వర్గాలలోనూ మంచి ఉంది. మొదట అంతా మనుషులే. ఆ తరువాతనే కులాలు ఉన్నాయి.

ఇకపోతే ఒక సామాజికవర్గం సభలకు హాజరు అయితే వారి గురించి మంచి మాటలు చెప్పాలి. అలా చెబుతూ ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి ఎక్కువగానే మాట్లాడేశారు అని అంటున్నారు. ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన ప్రసంగంలా కాకుండా కాస్తా ఓవర్ అయింది అని అంటున్నారు.

ఏ సామాజిక వర్గానికైనా సొంత వారు అంటే ప్రేమ ఉంటుంది. అయితే రేవంత్ రెడ్డి ఈ విధంగా కమ్మ వారిని పొగడ్తలతో ముంచెత్తడం ద్వారా అన్నీ నిజాలు వారి గురించి చెప్పారనుకున్నా సీఎం పోస్ట్ కి తగిన హుందా తనాన్ని ప్రదర్శించలేదనే అంటున్నారు. రేపటి రోజున మరో సామాజిక వర్గం సమావేశంలోనూ ఆయన ఇలాగే మాట్లాడుతారా అన్న చర్చ కూడా మొదలయింది.

ముందే చెప్పుకున్నట్లుగా కుల మతాలు అన్నవి సున్నితమైన అంశాలు. వాటిని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు రాజ్యాంగపరమైన విధులు నిర్వహిస్తున్న వారు ఎంత తక్కువగా టచ్ చేస్తే అంత మంచింది. ఎన్నికల వేళ ఎటూ తప్పదు. ఇక ఒక కులం గొప్పది అని చెబుతూంటే వేరే కులాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి కూడా ఉంటుంది.

అందరినీ బేలెన్స్ చేస్తూ అందరి వారు అనిపించుకోడమే సీఎం సీటుకు ఉన్న గొప్పతనం. మంచి మాటకారి, చతురుడు అయిన రేవంత్ రెడ్డి కమ్మ మహా సభలలో మాత్రం చేసిన ప్రసంగంలో మరీ అంతగా చెప్పాల్సింది లేదు అనే పలువురు అభిప్రాయపడుతున్నారు. అభిమానంతో ఆయన అన్న నాలుగు మంచి మాటలకూ పెడార్ధాలు తీసే పరిస్థితి కూడా ఉండొచ్చు.

అదే విధంగా మరో సామాజికవర్గం మేమేమి తక్కువ అని నొచ్చుకునే పరిస్థితి కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటూ సీఎం స్థాయిలో ఉండేవారు వ్యవహరించాల్సి ఉంటుంది. బట్ రేవంత్ రెడ్డి మనసు విప్పి మాట్లాడారా లేక కాస్తా అతిశయోక్తులు ఆయన ప్రసంగంలో దొర్లాయా తెలియదు కానీ ఎందుకో సీఎం స్థాయిలో చేయాల్సిన ప్రసంగం ఇది కాదేమో అని అంటున్నారు.