బుల్లెట్ ఫ్రూప్ జాకెట్ వేసుకొచ్చా..అదిరేలా రేవంత్ పంచ్
బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి
By: Tupaki Desk | 31 July 2024 11:48 AM GMTబడ్జెట్ సమావేశాల్లో భాగంగా సాగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. విమర్శలు.. ప్రతివిమర్శలతో పాటు మధ్య మధ్యన పంచ్ లతో దద్దరిల్లుతోంది. ఇవన్నీ సరిపోనట్లు సవాళ్ల వర్షం కురుస్తోంది. అధికారపక్షం వర్సెస్ విపక్షం మధ్య నడుస్తున్న సంవాదంలో రేవంత్ ఎప్పటికప్పుడు తన అధిక్యతను ప్రదర్శిస్తున్నారు. బడ్జెట్ ప్రవేశ పెట్టిన వేళ.. సభకు హాజరైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాను అసెంబ్లీకి వస్తానని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతానని చెప్పటం తెలిసిందే.
కట్ చేస్తే.. ఆ తర్వాతి రోజు నుంచి కేసీఆర్ మళ్లీ వచ్చింది లేదు. కేసీఆర్ సభకు రావాలంటూ ప్రతి రోజు కోరే ముఖ్యమంత్రి రేవంత్ మరోసారి అదే విన్నపాన్ని వినిపించారు. కేసీఆర్ సభకు రావాలని.. పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపిన కేసీఆర్.. తమకు సలహాలు.. సూచనలు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంలోనే ఆసక్తికర వ్యాఖ్య చేశారు. కేసీఆర్ సభలో చీల్చి చెండాడుతానన్నారని.. అందుకే తాను బుల్లెట్ ఫ్రూప్ జాకెట్ వేసుకొని వచ్చానని.. కానీ.. కేసీఆర్ రాలేదంటూ వేసిన పంచ్ విపక్షాన్ని సూటిగా తాకింది.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెండు పిట్ట కథల్ని చెప్పటం విశేషం. ఒక అడవిలో గుంట నక్క ఒకటి ప్రమాణస్వీకారం చేసిందట. ఇక ముందు ఎప్పుడూ నేను మిమ్మల్ని మోసగించనని. గుంటనక్కను ఎవరైనా నమ్ముతారా అధ్యక్షా? పది సంవత్సరాలు ఏలి.. ఈ రోజున వారు అక్కడ కూర్చొని.. ఈ ప్రభుత్వం ఏమీ చేయట్లేదు.. తెలంగాణ సమాజం మోసం చేసినట్లుగా మాట్లాడితే.. నమ్మటానికి ఎవరూ సిద్ధంగా లేరు. తారాక రామారావుకు సూచన ఒక్కటే. పెద్దలు సభకు వస్తారని అనుకున్నాం. వారు వస్తే.. వారి అనుభవంతో కొన్ని సూచనలు చేస్తారనుకున్నాం. చీల్చి చెండాడుతానంటే.. ఎందుకైనా మంచిదని బుల్లెట్ ఫ్రూప్ జాకెట్ కూడా తొడుక్కొని వచ్చాను అధ్యక్షా. మా వెంకట్ రెడ్డి గారైతే.. పది గంటలకు అసెంబ్లీ అయితే తొమ్మిదిన్నరకే అసెంబ్లీకి వచ్చి కూర్చున్నారు అధ్యక్షా అదేందో చూద్దామని. ఒక సినిమాలో ఊరి బయట ఉన్న కొండ ఎత్తుతానంటూ ఒక పహిల్వాన్ సవాలు విసురుతాడు. ఊరంతా వచ్చింది ఎలా ఎత్తుతాడని. ఆ పహిల్వాన్ కూడా వచ్చాడు. జబ్బలు చరిచి.. తొడలు కొట్టి.. మీరంతా ఎత్తి నా మీద పెట్టండి. నేను మోసి చూపిస్తానని. అలానే ఉంది అధ్యక్షా వారు చీల్చి చెండాడే తీరు కూడా. ఈ ప్రభుత్వం విధానపరైమన నిర్ణయాలు తీసుకుంటుంది. మీ విలువైన సలహాలు.. సూచనలు ఇవ్వాలి. ఈ ప్రభుత్వం పాలసీలు తీసుకొస్తుంది. మీరు సలహాలు, సూచనలు ఇవ్వండి. ధరణి మీద కూడా పాలసీలు తీసుకొస్తున్నాం. మా మంత్రిగారు చెబుతారు. వాళ్లు ఏదైనా.. సలహాలు, సూచనలు ఇవ్వమనండి. సరిగ్గా రెండు గంటలు తీసుకున్నారు అధ్యక్షా. రెండు గంటల్లో ప్రతి విషయం రాజకీయ కోణంలో విషం చిమ్ముడు తప్ప.. ఏమైనా సూచనలు చేశారా? ఇలా ఉంటే ప్రజలు అక్కడ కూడా ఉండనివ్వరు అధ్యక్షా?’’ అంటూ విపక్షంపై విరుచుకుపడ్డారు.