టీడీపీని ఎందుకు రేవంత్ రెడ్డి పైకి లేపుతున్నట్లు ?
ఆయన తాజాగా చేస్తున్న కామెంట్స్ చూస్తే అదే నిజం అనిపిస్తోంది అని అంటున్నారు. ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి
By: Tupaki Desk | 29 Jun 2024 3:00 AM GMTతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టీడీపీని కోరి పైకి లేపుతున్నారా. ఆయన తాజాగా చేస్తున్న కామెంట్స్ చూస్తే అదే నిజం అనిపిస్తోంది అని అంటున్నారు. ఆయన ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారి తీస్తున్నాయి. తెలంగాణా ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసి ఉంటే వారికి పది శాతం ఓటు షేర్ వచ్చి ఉండేదని రేవంత్ రెడ్డి అనడం తెలంగాణా వాదులకు రుచించడం లేదు అని అంటున్నారు.
టీడీపీ అన్నది తెలంగాణాలో ముగిసిన అధ్యాయం అన్నది తెలంగాణావాదుల భావన. తెలంగాణాలో ఏమి స్టేక్ ఉంది టీడీపీని అని వారు ప్రశ్నిస్తున్నారు. టీడీపీ 2014 నుంచి గ్రాఫ్ పడిపోతూ 2018 నాటికి పూర్తిగా తగ్గిపోయిన నేపధ్యంలో అప్పటి నుంచి గత అయిదేళ్లుగా పెద్దగా యాక్టివిటీ కూడా పొలిటికల్ గా లేని నేపధ్యంలో ఎలా పది శాతం ఓటు షేర్ వస్తుందని ప్రశ్నిస్తున్నారు. అది ఎక్కడ నుంచి వస్తుందని కూడా డౌట్లు వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి ఈ విషయంలో టంగ్ స్లిప్ అయ్యాడని వారు అంటున్నారు. ఎందుకు అంటే కాంగ్రెస్ కి టీడీపీ బద్ధ శత్రువు. అది కూడా జాతీయ స్థాయిలో మరో బద్ధ శత్రువు అయిన బీజేపీతో కలసి ఎన్డీయేలో టీడీపీ ఉంది అని అంటున్నారు. ఈ విషయంలో అన్నీ తెలిసేనా రేవంత్ రెడ్డి టీడీపీ గ్రాఫ్ పెంచే పని చేస్తున్నారు అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
నిజానికి టీడీపీ కాంగ్రెస్ కి ఎదురు నిలిచి ఉంది. 2019 తరువాత అనేక కార్యక్రమాలు ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నిర్వహిస్తే కూడా టీడీపీ ముఖం చాటేసింది అని గుర్తు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి అకస్మాత్తుగా టీడీపీని పొగడడం ఎందుకు అన్న చర్చ ఢిల్లీ స్థాయిలో కూడా కాంగ్రెస్ పెద్దల మధ్య సాగుతోంది అని అంటున్నారు.
అదే విధంగా తెలంగాణా రాజకీయాల్లో ప్రాబల్యం ఉన్న దక్షిణ తెలంగాణా ప్రాంతానికి చెందిన రెడ్లు అంతా ఎందుకు టీడీపీని భుజాల మీద మోయాలి అని అంటున్నారు. వారు ఈ విషయంలో అసంతృప్తినే వ్యక్తం చేస్తున్నారు అని అంటున్నారు. రేవంత్ టీడీపీకి 10 పర్సెంట్ ఓటు షేర్ ఇవ్వడాన్ని సైతం తప్పు పడుతున్నారు.
అసలు తెలంగాణా రాజకీయ ముఖ చిత్రం మీద టీడీపీ ఇపుడు లేదు కదా అని అంటున్నారు. ఎక్కడ నుంచి తెచ్చి పది శాతం ఓట్లు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. టీడీపీ అన్నది తెలంగాణా రాజకీయాల్లో ఉన్న ప్రాంతీయ సమీకరణల వల్ల మనలేదని అనేక ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయని అంటున్నారు. టీడీపీ తానుగా ఎంతగా జాతీయ పార్టీ అని చెప్పుకున్నా అది ఫక్తు ప్రాంతీయ పార్టీ అని అందరికీ తెలుసు.
దాని మూలాలు అన్నీ ఆంధ్రాలోనే ఉన్నాయి. దానికి అక్కడే బేస్ ఉంది. ఒక విధంగా చెప్పాలీ అంటే ఆంధ్రా పార్టీగానే టీడీపీని తెలంగాణాలో చూస్తారు. అలాంటి టీడీపీని మళ్లీ పైకి లేపి తెలంగాణా రాజకీయాల్లో ప్రభావితం అయ్యేలా చేస్తే అది తాజా పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా చతికిలపడిన బీఆర్ఎస్ కి కొత్త ఊపిరులు ఊదినట్లుగా అవుతుందని అంటున్నారు.
యాంటీ ఆంధ్రా స్లోగన్ తో తెలంగాణ మీద ఆంధ్రుల రాజకీయ పెత్తనం అని కేసీఆర్ కొత్త నినాదం తీసుకుని జనాల్లోకి వెళ్ళి బలపడతారు అని అంటున్నారు. అదే సమయంలో తెలంగాణలో టీడీపీ ఎంట్రీ వల్ల కాంగ్రెస్ కి వీసమెత్తు రాజకీయ లాభం కూడా ఉండదని అంటున్నారు.
మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన ఆ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ కే పెద్ద దెబ్బ అవుతుందని విశ్లేషిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలీ అంటే అది రేవంత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తుకు కూడా మంచిది కాదు అని అంటున్నారు. ఆయన పూర్వాశ్రమం టీడీపీ. ఆ ముద్రను ఆయన చెరిపేసుకోవడం వల్లనే కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గా చాన్స్ ఇచ్చింది. సీఎం గా కూడా బ్రహ్మాండమైన అవకాశం అందుకున్నారు. రాజకీయంగా ఆయన యువకుడి కిందనే లెక్క. దాంతో తనకు దక్కిన అవకాశాన్ని పది కాలల పాటు జాగ్రత్తగా వాడుకోకుండా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వల్ల పాత అనుమానాలు ముద్రలు మళ్లీ వెంట తెచ్చుకుని పొలిటికల్ గా టార్గెట్ అవుతారని అంటున్న వారూ ఉన్నారు.