జీవన్ రెడ్డి ఎఫెక్ట్: పీసీసీ పదవిపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి.. పార్టీలోకి పలువురిని తీసుకుంటున్నారు. వస్తామన్నవారికి కండువాలు కప్పుతున్నారు
By: Tupaki Desk | 27 Jun 2024 4:34 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రిగా, ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్‌రెడ్డి.. రెండు పడవలను సమాన వేగంతో ముందుకు తీసుకువెళ్తున్నా.. ఈ క్రమంలో ఎదురవుతున్న రాజకీయ చిక్కులు ఆయనకు ఇబ్బందిగా మారుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వాన్ని నడిపించడం.. మరోవైపు.. పార్టీని బలోపేతం చేయ డం.. రెండూ కూడా ఇప్పుడు పార్టీకి చాలా ముఖ్యం. కాంగ్రెస్ పార్టీ పరంగా వెనుకబడితే.. ఆ లోటును భర్తీ చేసేందుకు బీజేపీ కాచుకుని కూర్చుంది.
ఈ నేపథ్యంలో రేవంత్‌రెడ్డి.. పార్టీలోకి పలువురిని తీసుకుంటున్నారు. వస్తామన్నవారికి కండువాలు కప్పుతున్నారు. కానీ, ఇదే పార్టీలో వివాదంగా మారి.. రేవంత్ కేంద్రంగా రాజకీయాలు సాగుతున్నాయి. మరోవైపు.. ప్రభుత్వాన్ని సమర్థంగా నడిపించాల్సిన నేపథ్యంలో రాజకీయంగా పార్టీ నుంచి ఎదురవు తున్న ఇబ్బందులు ఆయనను మానసికంగా వేధిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జగిత్యాల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజీవ్‌ను పార్టీలోకి తీసుకున్నారు.
ఇది పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డికి నచ్చలేదు. దీంతో రేవంత్‌పై అగ్గిమీద గుగ్గిలం మాదిరిగా మండి పడ్డారు. తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తానన్నారు. చివరకు ఇది అధిష్టానం వరకు చేరింది. ఈ పరిణామం రేవంత్‌ను ఇరకాటంలో పడేసింది. దీంతో తాను పీసీసీ పదవిని వదులుకుంటానంటూ.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు.. కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్‌కు అనేక సమస్యలు ఎదురయ్యాయి.
అయినప్పటికీ.. ఆయన వాటిని దాటుకుని ముందుకు సాగారు. పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. ఇక, ఇప్పుడు పాలన పరంగా ఆయన పూర్తి సమయం వెచ్చించాల్సి ఉంది. ఇది కూడా.. పీసీసీ చీఫ్ పదవిని వదులుకునేందుకు సిద్ధం చేసిందనే వాదన ఉంది. వాస్తవానికి పీసీసీ చీఫ్ పదవి మూడేళ్లకు ఒకసారి మారుతుంది. ఈ రకంగా చూసుకున్నా.,. 2021, జూలై 3న రేవంత్ బాధ్యతలు తీసుకున్నారు. దీంతో మూడేళ్లు పూర్తవుతున్నాయి. ఈ పరిణామాల క్రమంలోనే ఆయన తనకు పీసీసీ చీఫ్ పదవి వద్దంటూ.. పార్టీ అధిష్టానానికి తెగేసి చెప్పారు. ఈ నేపథ్యంలో పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.