Begin typing your search above and press return to search.

దటీజ్ రేవంత్ రెడ్డి... నిన్న వారితో నేడు వీరితో !

తెలంగాణా కాంగ్రెస్ సీఎం ని చూస్తే ఒక సామెత గుర్తుకు వస్తుంది పొట్టి వారు గట్టి వారు అని.

By:  Tupaki Desk   |   19 Aug 2024 4:30 AM GMT
దటీజ్ రేవంత్ రెడ్డి... నిన్న వారితో నేడు వీరితో !
X

తెలంగాణా కాంగ్రెస్ సీఎం ని చూస్తే ఒక సామెత గుర్తుకు వస్తుంది పొట్టి వారు గట్టి వారు అని. ఈ దేశాన్ని ఒకనాడు ఏలిన లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా పొట్టివారే. కానీ బహు గట్టి వారు పాలనలో దిట్ట అయిన వారు. అందుకే దేశాన్ని పదిహేడేళ్ల పాటు నిరాటంకంగా పాలించిన తొలి ప్రధాని పండిట్ నెహ్రూ 1964 మే 27న మరణించాక ఆయన వదిలేసిన విశాలమైన కుర్చీని ఎవరు భర్తీ చేస్తారు అన్న ధర్మ సందేహం వచ్చింది. ఆ సమయంలో ఆజానుబాహులు ఎంత మంది ఉన్నా మహా పొడగిరులూ గడసరిలూ మరేంతో మంది ఉన్నా ఆ కుర్చీకి మాత్రం ఆనలేదు, అసలు వారు చాలలేదు.

అలా లాల్ బహూర్ శాస్త్రి నెహ్రూ వదిలి వెళ్ళిన ప్రధాని కుర్చీని అధిరోహించి 1966 జనవరి తొలి వారం దాకా అద్భుతమైన పాలన అందించారు. ఇంతకీ చెప్పేది రేవంత్ రెడ్డి గురించి కాబట్టి ఆయన మీదనే చెప్పుకుంటూ వెళ్తే రేవంత్ రెడ్డిలో ఉన్నది లౌక్యం. లేనిది అహం. ఆయనకు తెలిసినది రాజకీయం నేర్చినది చాతుర్యం. నిండుగా ఉన్నవి పదునైన వ్యూహాలు.

అందుకే కాంగ్రెస్ వంటి మహా సముద్రాన్ని ఆయన ఈదేస్తున్నారు. కాంగ్రెస్ లో పుట్టి పెరిగిన మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి కోట్ల విజయభాస్కరరెడ్డి వంటి వారు ఇంకా వెనక్కి వెళ్తే ఎంతో మంది ఉద్ధండులు సైతం కాంగ్రెస్ లో సీఎంలుగా చేసి అసమ్మతిని ఎదుర్కొన్నారు. పాలన ఒక వైపు చూసుకుంటూ మరో వైపు వర్గ పోరుతోనూ పోరాటం చేసేవారు.

మరి అదేమి మంత్రం వేశారో కానీ రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ లో బాగానే కుదురుకున్నారు. ఆయన కాంగ్రెస్ లో చేరి నిండా పదేళ్ళు కాలేదు. కానీ అచ్చమైన ఖద్దరు మనిషి అయిపోయారు. ఆయన కాంగ్రెస్ జెండాతో వీడని బంధం అయిపోయాడు. ఇక ఏ రోటి కాడ ఆ పాట పాట పాడాలి. ఏ గూటి కాడ ఆ పలుకే వల్లించాలి.

మరి అన్ని తెలిసిన రేవంత్ రెడ్డికి ఇది కూడా తెలియదు అనుకుంటే ఎలా. ఒక వేళ ఎవరికైనా డౌట్లు ఉంటే ఆయన వ్యవహార శైలిని చూస్తే అర్ధం అయిపోతుంది. ఆయన గత నెలలో కమ్మ వారు మహా సభకు హాజరై కమ్మలు అమ్మ వంటి వారు అనేశారు. వారికి సాటీ పోటీలేదని మొత్తం కమ్మ కుల పెద్దలను కీర్చించారు. సీన్ కట్ చేస్తే నేడు రాజుల సమావేశానికి వెళ్ళారు. రాజుల కీర్తి బావుటాను అక్కడ ఎగరేశారు. వారికి పోటీ లేదని కూడా అన్నారు.

ఇదంతా రేవంత్ రెడ్డిని విమర్శించడానికి కాదు. పాలించే వారు అలాగే ఉండాలి. వారికి అన్ని కులాలూ మతాలు సమానం. అయితే వారు ఎక్కడికి వెళ్ళినా అందరినీ తన బిడ్డలు అన్నట్లుగానే చెప్పాలి. తల్లి తన బిడ్డలు అందరూ గొప్పవారే అంటున్నారు. వారిలోని గొప్పతనాన్నే పదే పదే చెబుతుంది. రేవంత్ రెడ్డి కూడా అచ్చం అలాగే చేస్తున్నారు.

అందుకే ఆయనే తెలంగాణాకు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అమ్మ లాంటి వారు. అందుకే ఆయన ఏలికగా దండం పట్టుకున్న మహారాజు లాంటి వారు. మంచి మాటకారి, ఎక్కడ ఏది ఔచిత్యమే తెలిసిన నాయకుడు అయిన రేవంత్ రెడ్డి విజయానికి సూత్రం ఏంటి అని ఎవరూ వెర్రిగా అడగకూడదు, ఆయనను చూసి తెలుసుకుంటే చాలు. అందులో ఏ కొంచెం అలవరచుకున్నా వారూ జీవితంలో సాధించినట్లే. ఎందుకంటే దటీజ్ రేవంత్ రెడ్డి కాబట్టి.