ప్రజలకు పథకాలు-నేతలకు పదవులు.. పార్లమెంటుపై రేవంత్ పక్కా స్కెచ్
సీనియర్ నాయకులకు వివిధ కార్పొరేషన్లలో ఉన్న నామినేటెడ్ పదవులు ఇచ్చే ప్రక్రియను సిఎం రేవంత్ మొదలు పెట్టారు.
By: Tupaki Desk | 26 Jan 2024 10:30 AM GMTతెలంగాణలో రాష్ట్రం ఆవిర్భవించిన పదేళ్ల తర్వాత.. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ప్రస్తు త సీఎం రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలపై దృష్టి పెట్టారు. మొత్తం 17 లోక్‌సభ సీట్లలో కనీసం 12-15 స్థానాల్లో విజయం దక్కించుకునే వ్యూహంతో ఆయన అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో తొలి అడుగుగా.. పార్టీలో సీనియర్ల అసంతృప్తులను తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన సీనియర్లకు .. పదవులు ఇచ్చి, వచ్చే ఎన్నికల్లో మరోసారి వారిని వాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
సీనియర్ నాయకులకు వివిధ కార్పొరేషన్లలో ఉన్న నామినేటెడ్ పదవులు ఇచ్చే ప్రక్రియను సిఎం రేవంత్ మొదలు పెట్టారు. దీనికి సంబంధించి ఇప్పటికే పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఒక్కో నియోజక వర్గం నుంచి సుమారుగా నాలుగు నుంచి ఐదు పేర్లను తెప్పించుకున్నట్టుగా తెలిసింది. అందులో భాగంగా ముందస్తుగా 18 నుంచి 20 మందికి నామినేటెడ్ పోస్టులను కేటాయించాలని సిఎం నిర్ణయించారని పార్టీ వర్గాల్ల ఓ చర్చ సాగుతోంది.
త్వరలోనే వీటికి సంబంధించి ఉత్తర్వులు వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. సిఎం కూడా వారి పేర్లకు ఆమోదముద్ర వేయడంతో పాటు ఆ జాబితాను ఢిల్లీ అధిష్టానానికి పంపించి వాయువేగంతో అనుమతి తెప్పించుకుని.. నియామకాలు చేస్తారని తెలిసింది తద్వారా.. పార్లమెంటు ఎన్నికల సమయా నికి పార్టీలో అసంతృప్తులు ఎవరూ ఉండరాదనే కాన్సెప్టుతో రేవంత్ ఉన్నారని స్పష్టమవుతోంది.
ఇప్పటికే ముఖ్య నేతలు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, మల్లు రవి, హర్కర వేణుగోపాల్ రెడ్డిలకు క్యాబినెట్ ర్యాంక్‌ను కల్పి స్తూ అడ్వైయిజర్ పోస్టులు ఇచ్చారు. వీరిని పార్లమెంటు ఎన్నికల్లో కీలక బాధ్యతలకు వినియోగించనున్నారు.ఈ క్రమంలోనే త్వరలో మరో 18 నుంచి 20 మంది కీలక నేతలకు నామినేటెడ్ పదవులు ఇవ్వాలని సిఎం భావిస్తున్నట్టుగా తెలిసింది. మొత్తానికి ఇటు పథకాలతో ప్రజలను.. అటు పదవులతో నేతలను మెప్పించి.. పార్లమెంటు ఎన్నికల్లో పక్కా విజయం దక్కించుకునే లక్ష్యంతో రేవంత్ దూకుడు ప్రదర్శిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.