ప్రగతిభవన్ గేట్లు బద్దలు.. ప్రజాదర్బార్ షురూ
ఓవైపు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకుండానే.. ప్రగతిభవన్ ఎదుట ఉన్న గేట్లను బద్ధలు కొట్టించే కార్యక్రమానికి తెర తీశారు.
By: Tupaki Desk | 8 Dec 2023 4:14 AM GMTఅధికారం చేతికి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామంటూ చాలానే మాటలు చెబుతుంటారు. తీరా.. పవర్ చేతికి వచ్చిన తర్వాత మాత్రం ఆ వేగం కనిపించదు. అయితే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణస్వీకారం చేయటానికి ముందు నుంచే మార్పు విషయంలో ఫుల్ క్లారిటీతో ఉండటమే కాదు.. జెట్ స్పీడ్ తో నిర్ణయాల్ని తీసుకుంటున్న వైనం హాట్ టాపిక్ గా మారింది.
ఓవైపు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకుండానే.. ప్రగతిభవన్ ఎదుట ఉన్న గేట్లను బద్ధలు కొట్టించే కార్యక్రమానికి తెర తీశారు. ఎల్ బీ స్టేడియంలో ప్రమాణస్వీకారం చేసే సమయానికి ప్రగతి భవన్ ముందు ఉండే భారీ గేట్లను తొలగించే కార్యక్రమం దాదాపు పూర్తి కావొచ్చింది. ఇదే విషయాన్ని ఆయన తన ప్రమాణస్వీకారం అనంతరం చేసిన ప్రసంగంలోనూ తెలియజేశారు. ఏ విషయంలో అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును ప్రజలు వ్యతిరేకిస్తున్నారో.. ఆగ్రహంతో ఉన్నారో.. సరిగ్గా అదే పాయింట్ల మీద ఫోకస్ చేయటం చూస్తే.. రేవంత్ తెలివి ఇట్టే అర్థమవుతుంది.
ప్రజల్ని కనెక్టు అయ్యే ఎమోషనల్ అంశాల్ని మొదటి గంట నుంచే మొదలుపెడితే వచ్చే స్పందన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇదే సూత్రాన్ని రేవంత్ అమలు చేస్తున్నారు. ఓవైపు ప్రగతి భవన్ గేట్లను తన ప్రమాణస్వీకారానికి ముందే మొదలుపెట్టిన ఆయన.. ప్రమాణస్వీకారం తర్వాత చేసిన ప్రసంగంలో శుక్రవారం నుంచి ప్రగతిభవన్ తలుపులు సామాన్య ప్రజల కోసం తెరిచి ఉంటాయని.. తాను శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రజల్ని కలుసుకునేందుకు సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు.
అంతేకాదు.. తనను కలిసేందుకు తెలంగాణ ప్రజల్ని రావాలంటూ రేవంత్ పిలుపునివ్వటం ఆసక్తికరంగా మారింది. ప్రజల్ని కలుసుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ మాత్రం ఆసక్తి చూపని తీరుకు భిన్నంగా.. తాను అందరికి అందుబాటులో ఉంటానన్న సందేశాన్ని తొలిరోజునే తేల్చేసిన వైనంతో గులాబీ సారుకు.. ఫైర్ బ్రాండ్ రేవంత్ కు మధ్యనున్న తేడా అర్థమవుతుందని చెప్పాలి. తాను తక్కువగా అంచనా వేస్తున్న రేవంత్ విషయంలో పెద్ద సారు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు.