రామోజీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. మల్కాజిగిరి'పై చర్చ.. 'ఈనాడు ఉద్యోగికి టికెట్?!
మీడియా మొఘల్, ఈనాడు అధినేత రామోజీరావుతో తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే
By: Tupaki Desk | 6 March 2024 4:56 AM GMTమీడియా మొఘల్, ఈనాడు అధినేత రామోజీరావుతో తెలంగాణ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ రేవంత్ రెడ్డి భేటీ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ భేటీపై అనేక ఊహాగానాలు, చర్చలు తెరమీదకి వస్తున్నాయి. ఆదిలాబాద్‌లో ప్రధాని మోడీని మచ్చిక చేసుకునేలా మాటల మంత్రాలను కుమ్మరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తర్వాత స్టెప్‌లో మరో సంచలనానికి తెరదీశారు. ఆదిలాబాద్ సభ ముగిసీ ముగియగానే.. ఆయన నేరుగా హైదరాబాద్ శివారులో రామోజీ ఫిలిం సిటీకి చేరుకున్నారు. ఈనాడు అధినేత, రామోజీ గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీరావుతో భేటీ అయ్యారు. ఇది అస్సలు ఎవరూ ఊహించని పరిణామం. ఎందుకంటే.. రేవంత్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి మూడు మాసాలు అయిన దరిమిలా.. ఆయన రామోజీ రావును కలుసుకోవాలని అనుకుంటే ఎప్పుడో కలుసుకునేవారు. కానీ, వ్యూహాలకు ప్రతివ్యూహా లు.. ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో దిట్టగా పేరొందిన రేవంత్ రెడ్డి ప్రధాని పర్యటన నుంచి నేరుగా రామోజీరావు దగ్గరకు రావడం వెనుక చాలా వ్యూహమే ఉందని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి ఇది ఊహించని పరిణామం కావడంతో రాజకీయ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ సాగుతోంది.
భేటీ వెనుక?
రామోజీరావుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ వెనుక చాలా కీలకమైన విషయమే ఉండి ఉంటుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. త్వరలోనే పార్లమెంటు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇలా.. రామోజీ రావును రేవంత్ కలిసి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా మల్కాజిగిరి లోక్‌సభ స్థానంపై సీఎం రేవంత్ రెడ్డి చర్చించారా? అనే దిశగా ఈ చర్చలు సాగుతున్నాయి. ఎందుకంటే.. మల్కాజిగిరి అనేది సీఎం రేవంత్‌కు సిట్టింగ్ స్థానం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత.. కొడంగల్ నుంచి విజయం దక్కించుకున్నా క, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆయన ఈ ఎంపీ సీటుకు రాజీనామా చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో దీనిని తిరిగి నిలబెట్టుకోవడం రేవంత్‌కు ప్రతిష్టాత్మకంగా మారింది.
ఇక, మల్కాజిగిరి సీటు విషయంలో బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని బీసీని చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పేరు చెప్పకపోయినా ఈటల రాజేందర్, బండి సంజయ్‌ల పేర్లు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. అలాంటి ముఖ్యమంత్రి అభ్యర్థిని ఇప్పుడు మల్కాజిగిరి నుంచి ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టారు. ఇక, బీఆర్ ఎస్ పార్టీ కూడా.. ఎమ్మెల్యే మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డికే ఇక్కడ నుంచి టికెట్ ఇవ్వాలని దాదాపు నిర్ణయించు కున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈ టికెట్‌ను ఆశించిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పార్టీకి రాం...రాం.. చెప్పారు. ఈ నేపథ్యంలో తన సొంత నియోజకవర్గం అయిన.. మల్కాజిగిరిలో ఎలా వ్యవహరించాలనే విషయంపై రేవంత్ రెడ్డి కొత్త వ్యూహానికి, సరికొత్త చాణక్యానికి తెరదీసినట్టు తెలుస్తోంది.
వాస్తవానికి మల్కాజిగిరి స్థానం నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున మధు యాష్కీ గౌడ్, మైనంపల్లి హనుమంతరావు, నిర్మాత బండ్ల గణేష్, బీఆర్ ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ప్రముఖంగా బరిలో ఉన్నారని ప్రముఖంగా చర్చకు వస్తోంది. వీరిలో మైనంపల్లి హనుమంతరావు.. మెదక్ సీటుపై ప్రధానంగా దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఎందుకంటే.. గత ఏడాది జరిగిన అసెంబ్లీ పోరులో మల్కాజిగిరి నుంచి పోటీ చేసి ఘోర ఓటమిని చవి చూశారు. దీంతో మల్కాజిగిరి పార్లమెంటు స్థానంలో ఇతర నియోజకవర్గాల్లోనూ ఆయనకు పట్టు లేదనే భావన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో మైనంపల్లి నియోజకవర్గం మార్పు కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇక, మధు యాష్కీని తీసుకుంటే.. ఆయన ఎల్బీ నగర్ నియోజకవర్గంలో ఓడిపోవడంతో ఆయనకు కూడా సానుకూల పరిస్థితి కనిపించడం లేదు. దీనికితోడు.. మధు యాష్కీ.. మల్కాజిగిరిలో అడుగు పెడితే.. ఇక్కడే తిష్ఠ వేస్తారన్న వాదన కూడా ఉంది. బీఆర్ఎస్ నేత మర్రి జనార్దన్‌రెడ్డికి వ్యతిరేకత తీవ్రంగా ఉంది. ఈయనను తీసుకోవద్దంటూ.. కాంగ్రెస్‌లో అసంతృప్తులు పెల్లుబికిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు కూడా మల్కాజిగిరి స్థానం దక్కడం కష్టమేనని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక, బండ్ల గణేష్ విషయాన్ని తీసుకుంటే.. ఆయనకు మల్కాజిగిరి సీటు ఇస్తే.. అది పెద్ద మైనస్‌తో పాటు.. హాస్యాస్పదంగా కూడా ఉంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. గణేష్‌కు వ్యక్తిగతంగా ఫాలోయర్లు ఉన్నప్పటికీ.. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు.. నలుగురిలోనూ కలివిడితనం లేకపోవడం.. పట్టుమని ఓ పది వేల మందిని తన వెంట తిప్పుకొనే రాజకీయ చతురత లేక పోవడం వంటివి మైనస్‌లుగా కనిపిస్తున్నాయి. దీంతో గణేష్‌కు టికెట్ ఇవ్వడం అనేది కేవలం మాటలకే పరిమితం అవుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇదిలావుంటే, సీఎం రేవంత్ రెడ్డి సొంత స్థానం కావడంతో ఇక్కడ ఎవరు నిలబడినా వ్యక్తిగతంగా ఆయన పోటీ చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఇక, మరోవైపు.. మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత కేటీఆర్ సైతం.. మల్కాజిగిరిలో నువ్వో-నేనో తేల్చుకుందాం.. అంటూ రువ్విన సవాళ్లు కూడా రాజకీయంగా రేవంత్‌కు ప్రాధాన్యం పెంచాయి. దీంతో ఈ నియోజకవర్గాన్ని ఆయన ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో రేవంత్ కొత్త వ్యూహాన్ని పన్నుతున్నారనే చర్చ సాగుతోంది.
కొత్త అభ్యర్థికి అగ్రతాంబూలం!
మల్కాజిగిరిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన రేవంత్ రెడ్డి.. ఇక్కడ కమ్మ ఓటు బ్యాంకును సొంతం చేసుకునేం దుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. పైగా దేశంలో అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం కావడం, 33 లక్షల పైచిలుకు ఓటర్లు ఉండడం.. గత ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి ఆరు లక్షల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం దక్కించుకోవడంతో అంతే బలమైన వ్యక్తిని ఇక్కడ రంగంలోకి దింపాలనే రాజకీయ చతురతతో సీఎం రేవంత్ ముందుకు సాగుతున్నారనేది ప్రధాన విషయం. ఇక, రెండో స్థానంలో నిలిచిన మర్రి రాజేశఖర్‌రెడ్డి 5 లక్షల 93 వేల ఓట్లు వచ్చాయి. దీంతో ఈ స్థానాన్ని సీఎం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని తెలుస్తోంది. ఇక, ఈ పార్లమెంటు స్థానంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను తీసుకుంటే.. మల్కాజిగిరి, ఉప్పల్, ఎల్‌బీ నగర్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, కంటోన్మెంట్, కూకట్‌పల్లి స్థానాల్లో బీఆర్ ఎస్ అభ్యర్థులే విజయం దక్కించుకున్నారు. సో.. ఇది ఒక రకంగా రేవంత్‌రెడ్డికి సవాల్ లాంటిదే. అయితే.. ఇప్పుడున్న పరిణామాలు, పరిస్థితిని గమనిస్తే.. బీజేపీ తరఫున బరిలో దిగనున్న ఈటల రాజేందర్ బలమైన అభ్యర్థిగానే ఉండనున్నారు. అయినప్పటికీ.. ఈ సీటు తనకు ప్రతిష్టాత్మకం కావడంతో సీఎం రేవంత్ ఆదిశగానే అడుగులు వేస్తున్నారు. పైగా ఇది తన సిట్టింగ్ స్థానం కావడంతో కోల్పోతే.. సొంత సీటునే కాపాడుకోలేక పోయారనే అపప్రద మూటగట్టు కోవాల్సి వస్తుంది. దీనికితోడు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా సొంత పార్టీలోనే అసమ్మతిని పెరిగే అవకాశం కూడా పొంచి ఉంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే ఈనాడు అధిపతి రామోజీరావుతో భేటీ అయినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతుండడం గమనార్హం. ఈ క్రమంలో.. మల్కాజిగిరి స్థానం నుంచి ఎవరూ ఊహించని విధంగా ఒక కొత్త అభ్యర్థిని రంగంలోకి దింపాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సన్నిహితులు, ముఖ్యమంత్రి కర్యాలయ వర్గాల నుంచి కూడా దీనికి సంబంధించిన సంకేతాలు వస్తున్నాయి.
ఈనాడు పాత్రికేయుడికేనా?
మల్కాజిగిరి స్థానం నుంచి కొత్త అభ్యర్థి వైపు దృష్టి సారిస్తున్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో రేవంత్ చూపు.. ఈనాడు సీనియర్ పాత్రికేయుడిపై పడినట్టు తెలుస్తోంది. మల్కాజిగిరి నియోజకవర్గానికి చెందిన పాత్రికేయుడే కావడం, హైదరాబాద్ నేపథ్యం ఉండడం, పైగా బీసీలలో అత్యంత వెనుక బడిన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, పైగా ఈయన సామాజిక వర్గానికి మల్కాజిగిరిలోనే 3 లక్షల పైచిలుకు ఓట్లు ఉండడం వంటివి రేవంత్‌ను ఆకర్షిస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. ఈ పాత్రికేయుడి సామాజిక వర్గానికి ఇంత వరకు రాజకీయంగా ప్రాతినిధ్యం వహించే అవకాశం లభించకపోవడం కూడా.. ప్లస్‌గా మారినట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఈ సామాజిక వర్గం నుంచిఇప్పటి వరకు ఎవరూ ఏ పార్టీ తరఫున కూడా ఎంపీలు, ఎమ్మెల్యేలుగా అవకాశం దక్కించుకోలేక పోవడం కూడా రేవంత్ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఈనేపథ్యంలోనే ఆదిలాబాద్ సమావేశం ముగిసీ ముగియగానే ఆయన హుటాహుటిన రామోజీ ఫిలింసిటీకి వెళ్లి రామోజీరావుతో భేటీ అయినట్టు సమాచారం. అంతేకాదు.. ఇంత హఠాత్తుగా రామోజీతో భేటీ కావడం వెనుక ఇదే కారణమనే బలమైన వాదన కూడా వినిపిస్తోంది. మరోవైపు.. మల్కాజిగిరిలో ఈనాడు పాత్రికేయుడి సామాజికవర్గం ఓట్లు పక్కన పెడితే.. కీలకమైన కమ్మ సామాజిక వర్గం ఓట్లు 3 నుంచి 4 లక్షల వరకు ఉంటాయి. అంటే.. అటు బీసీ పాత్రికేయుడి సామాజిక వర్గం+ కమ్మ వర్గం రెండూ కలిస్తే.. ఎలాంటి నేతలపైనైనా.. కాంగ్రెస్ విజయం దక్కించుకోవడం సునాయాస మన్నది రేవంత్ ఆలోచనగా ఉందని తెలుస్తోంది. అందుకే ఆయన ఇంత హఠాత్తుగా రామోజీతో భేటీ అయ్యారని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. ఆయన మద్దతు కోసమే రేవంత్ వెళ్లారని అంటున్నారు.
రేవంత్ మాస్కర్ స్ట్రోక్?
మల్కాజిగిరి నియోజకవర్గాన్ని నిలబెట్టుకుని తన సత్తా చూపించాలని భావిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కనుక ఈ ప్రయోగానికి (కొత్త ముఖం+ఈనాడు బ్యాక్‌గ్రౌండ్+బీసీ ఓటర్లు+కమ్మ ఓటర్లు) తెరదీస్తే.. ఇది అతి పెద్ద మాస్టర్ స్ట్రోక్ అవుతుందని అంటున్నారు పరిశీలకులు. అంతేకాదు.. రేవంత్ చాణక్యానికి తోడు రామోజీ అండదండలు తోడైతే.. టీడీపీ సానుభూతి పరుల ఓటు బ్యాంకు కూడా ఇక్కడ అభ్యర్థికి తోడవుతుందనేది ప్రధాన వ్యూహంగా కనిపిస్తోంది. ఇక, రేవంత్ సామాజిక వర్గం ఓటు కామన్‌గానే ఆయన వెంట ఉంటుంది కాబట్టి.. మొత్తంగా భారీ ఆధిక్యంతో విజయాన్ని దక్కించుకోవడం ఖాయమని రేవంత్‌రెడ్డి అంచనాకు వచ్చినట్టు సమాచారం.
ఇక, బీజేపీ ప్రకటించిన ఈటల రాజేందర్ విషయాన్ని తీసుకుంటే.. ఆయనకు సిటీ బ్యాక్ గ్రౌండ్ లేక పోవడం భారీ మైనస్. ఆయన కేవలం రూరల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న నాయకుడు మాత్రమే. దీంతో మల్కాజిగిరి నియోజకవర్గంలో సహజంగానే ఆయనకు పెద్దగా ఫాలోయింగ్ ఉండే అవకాశం లేదు. పైగా ఇక్కడ సీమాంధ్రులు, ఉన్నత విద్యావంతులు కూడా ఎక్కువగా ఉండడంతో రేవంత్ వ్యూహం పక్కాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఇక, మల్లారెడ్డి ఫ్యామిలీని తీసుకుంటే.. ఇప్పటికే ఆయన, ఆయన అల్లుడు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఇప్పుడు ఆయన కుమారుడుకు కూడా సీటు అంటే.. ఒకే కుటుంబంలో మూడు సీట్లా అనే వ్యతిరేకత పొంచి ఉంది. ముఖ్యంగా బీఆర్ ఎస్ నుంచి బయటకు వచ్చిన వారు కూడా ఈ విషయాన్ని ఫోకస్ చేస్తున్నారు. మరోవైపు సాధారణ ప్రజలు కూడా.. ఇదే విషయంపై దృష్టి పెట్టే అవకాశం కనిపిస్తోంది. ఒకే కుటుంబం నుంచి ముగ్గురు, నలుగురికి టికెట్లా? ఇది ప్రజాస్వామ్యమేనా? లేక రాచరికమా? అనే చర్చ తెరమీదికి వచ్చే అవకాశం ఉంది. ఇది అంతిమంగా కాంగ్రెస్‌కు మేలు చేసే అవకాశం ఉంది. పైగా.. బీసీల్లో అత్యంత వెనుక బడిన సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి, జర్నలిస్టుకు టికెట్ ఇవ్వడం ద్వారా.. రేవంత్ వ్యూహం సక్సెస్ కావడం తథ్యమనే చర్చ సాగుతోంది. ఈ నేపథ్యంలోనే రేవంత్ రెడ్డి రామోజీని కలిసి ఆయన మద్దతు కోరినట్టు సమాచారం. పైగా.. కొత్తముఖానికి, అందునా బీసీల్లో వెనుకబడిన వర్గానికి టికెట్ ఇచ్చుకుని గెలిపించడం ద్వారా కాంగ్రెస్ పార్టీలో రేవంత్‌రెడ్డి హవాకు తిరుగు ఉండదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
ఎవరీ జర్నలిస్టు..
ఈనాడు దినపత్రికలో కంట్రిబ్యూటర్‌గా ప్రస్థానం ప్రారంభించిన ఆయన తొలి రోజు నుంచి హైదరాబాద్ లోనే పనిచేశారు. తర్వాత.. స్టాఫ్ రిపోరుగా ఉన్నత స్థాయికి చేరుకున్నాక కూడా హైదరాబాద్ కేంద్రంగానే వృత్తిలో కొనసాగారు. సుమారు 20 ఏళ్ల అనుభవం ఈయన సొంతం. పైగా.. సెలబ్రిటీలు సహా.. ఉన్నత స్థాయి వర్గాలతోనూ ఈయనకు అవినాభావ సంబంధాలు ఉన్నాయి. సుదీర్ఘకాలంగా పాత్రికేయ వృత్తిలో ఉండడంతో ఆయనకు నగరం సహా చుట్టుపక్కల ప్రాంతాలపై మంచి పట్టు పెరిగింది. ఇక, ఆర్థికంగా బలంగా ఉండడం, సామాజిక వర్గం పరంగా బీసీల్లో వెనుకబడిన వర్గం కావడం వంటివి కలిసివస్తున్న పరిణామాలు. వీటికి తోడు రామోజీ రావు మద్దతును కూడగడితే.. మల్కాజిగిరిలో రేవంత్ ఠీవీ మరోసారి రెపరెపలాడుతుందనే వాదన వినిపిస్తోంది.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు!
ఈనాడు జర్నలిస్టును రంగంలోకి దింపాలని సీఎం రేవంత్ రెడ్డి భావించడం వెనుక రెండు ప్రధాన వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు పరిశీలకులు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చేవెళ్ల, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో 10 లక్షలకుపైగా కమ్మ ఓట్లు ఉన్నాయి. వీటిని గంపగుత్తగా తనవైపు తిప్పుకొనేందుకు.. అవకాశం ఉంటుందన్నది ప్రధాన ఎత్తుగడ. మరోవైపు.. మల్కాజిగిరి నుంచి బరిలోకి దిగే ఈటల రాజేందర్, చేవెళ్ల నుంచి పోటీ చేసే కొండా విశ్వేశ్వరరెడ్డిలను బలంగా ఢీ కొట్టేందుకు రామోజీ సాయం ఉంటే.. తేలిక అవుతుందన్నది మరో వ్యూహం. వీటితోపాటు.. బీఆర్ ఎస్, బీజేపీల వ్యూహాన్ని తలదన్నే రాజకీయ నేతగా తను నిలబడవచ్చనే వ్యూహం కూడా దీనిలో ఇమిడి ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ పరిణామాలతోనే రేవంత్ ఈనాడు జర్నలిస్టులకు అవకాశం ఇవ్వాలని.. తద్వారా రామోజీరావు ఆశీస్సులను కైవసం చేసుకోవాలని భావిస్తున్నట్టు పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
ఈనాడు పాత్రికేయులకు మేలిమలుపు!!
సహజంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈనాడు పత్రికలో పనిచేసిన వారు.. రాజకీయంగా ఎదిగిన పరిస్థితి ఉంది. దీనిని కూడా సీఎం రేవంత్ రెడ్డి అంచనావేసుకుని ఉంటారని అంటున్నారు. ఏపీలో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు విజయం దక్కించుకున్న వైసీపీ ఎమ్మెల్యే(గతంలో ప్రజారాజ్యం), మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఈనాడు నుంచి వచ్చిన వ్యక్తే కావడం దీనికి ఉదాహరణ. టీడీపీ నేత కాల్వ శ్రీనివాసులు కూడా బీసీ సామాజికవర్గమే. ఆయన కూడా ఈనాడు జర్నలిస్టుగా ఉంటూ తొలిసారి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తర్వాత రాయదుర్గం నుంచి విజయం దక్కించుకుని టీడీపీ హయాంలో మంత్రి కూడా అయ్యారు. అదేవిధంగా తెలంగాణలోనూ ఒకరిద్దరు ఈనాడు పాత్రికేయులు రాజకీయంగా ఎదిగిన విషయం తెలిసిందే.