‘తగ్గేదేలే’ అంటున్న రేవంత్... భగవద్గీత స్పూర్తితోనే కూల్చివేతలు!
హైదరాబాద్ ప్రాంతంలోని చెరువులను ఆక్రమించి నిర్మితమైన అక్రమ కట్టడాలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 25 Aug 2024 11:00 AM GMTహైదరాబాద్ ప్రాంతంలోని చెరువులను ఆక్రమించి నిర్మితమైన అక్రమ కట్టడాలపై తెలంగాణ సర్కార్ ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. రేవంత్ సర్కార్ ఏర్పాటు చేసిన హైడ్రా ప్రస్తుతం ఈ పనుల్లో బిజీగా ఉందని అంటున్నారు. దీంతో... పలు వర్గాల ప్రజల నుంచి ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురుస్తుండగా.. పలువురు మాత్రం ప్రభుత్వం తీరును వ్యతిరేకిస్తున్నారని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అంశంపై స్పందించారు. ఈ సందర్భంగా చెరువులను ఆక్రమించిన వారిని ఎవర్నీ వదలబోమని మరోసారి క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ ను వందేళ్ల క్రితమే లేక్ సిటీగా నిర్మించారని తెలిపారు. హరేకృష్ణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన అనంత శేష స్థాపన ఉత్సవంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా స్పందించిన రేవంత్ రెడ్డి... హైదరాబాద్ చుట్టూ ఉన్న ఈ చెరువుల సంరక్షణ కీలకమైనదని అన్నారు. 1908లో హైదరాబాద్ వచ్చిన వరదలు, ముఖ్యంగా 115 సంవత్సరాల క్రితం ఈ నగరం మీద వరదలు ఉప్పెనై కమ్మేసి, వేలాది మంది ప్రాణాలను బలికొందని తెలిపారు. ఆ సమయంలో నిజాం సర్కార్ చలించిపోయారని.. ఈ సమస్య నుంచి గట్టేక్కడానికి ఎంతోమంది సలహాలు తీసుకున్నారని అన్నారు.
ఈ నేపథ్యంలోనే మోక్షగుండం విశ్వేశరయ్య ని నియమించారని తెలిపారు. ఆయన ఈ నగరాన్ని క్షుణ్ణంగా పరిశీలించి.. వరదలు నగరంపై పోటెత్తకుండా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లను నిర్మించి.. మూసా, ఈసా నదుల ద్వారా వచ్చే నీటిని నియంత్రించి.. ఆ నీళ్లను నగరానికి తాగునీటిగా మార్చి.. ఈ ప్రాంతంలో గొలుసుకట్టు చెరువులను నిర్మించి.. హైదరాబాద్ ను లేక్ సిటీ గా తీర్చిదిద్దారని అన్నారు.
ఇలా లక్షల మంది ప్రజల దాహార్తిని తీర్చడానికి ఏర్పాటు చేసిన చెరువులను కొంతమంది శ్రీమంతులుగా, గొప్ప వ్యక్తులుగా ఉన్నవాళ్లు వాటిపక్కనే ఫాం హౌస్ ల పేరున నిర్మాణాలు చేపట్టి.. వాటి డ్రైనేజ్ కాలువను తీసుకెళ్లి గండిపేటలో కలుపుతున్నారని తెలుపారు. అలాంటి నిర్మాణాలను వదిలేస్తే... తాను సరైన ప్రజాప్రతినిధి అవుతానా అని అక్కడున్న భక్తులను రేవంత్ ప్రశ్నించారు.
అందువల్లే తనపై ఒత్తిడి వచ్చినా, కొంతమంది మిత్రులకు ఫాం హౌస్ లు ఉన్నా హైడ్రా అనే సంస్థను ఏర్పాటు చేసి చెరువులను చెరపట్టి అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాళ్లు ఎవరినీ వదిలిపెట్టకుండా ఉక్కుపాదంతో అణిచివేయాలనే ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే... దీనికి స్పూర్తి భగవద్గీత అని తెలంగాణ ముఖ్యమంత్రి వెల్లడించారు.
ఇందులో భాగంగా... కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసిన బోధ ను స్పూర్తిగా తీసుకునే చెరువులను కాపాడుతున్నట్లు చెప్పారు. ధర్మం గెలవాలి, అధర్మం ఓడాలి.. అధర్మం ఓడాలంటే యుద్ధం తప్పదన్న శ్రీకృష్ణుడి మాటలే స్పూర్తిగా తీసుకుని, తనపై ఎంత ఒత్తిడి వస్తున్నా వెనక్కి తగ్గకుండా అక్రమనిర్మాణాలు కూల్చివేస్తున్నామని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
దీంతో... హైడ్రాను మరింత బలోపేతం చేసి, చెరువులను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాల కూల్చివేతల విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా రేవంత్ సర్కార్ ముందుకు వెళ్లేలానే ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.