Begin typing your search above and press return to search.

చంద్రబాబు ప్రతిపాదనకు రేవంత్ రెడ్డి నో?

7 మండలాలు, విద్యుత్ బకాయిలు, ఇలా ప్రతి అంశంపై అధికారుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

By:  Tupaki Desk   |   7 July 2024 7:10 AM GMT
చంద్రబాబు ప్రతిపాదనకు రేవంత్ రెడ్డి నో?
X

ఉమ్మడి ఏపీ విభజనానంతర సమస్యల పరిష్కారం కోసం ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈరోజు హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ల మధ్య దాదాపు 2గంటల పాటు చర్చలు జరిగాయి. రాష్ట్ర విభజన తర్వాత సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న అంశాలపై పరిష్కారం కోసం ఈ సమావేశంలో చర్చించినట్లుగా రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

మంచి వాతావరణంలో ఈ ముఖ్యమంత్రుల సమావేశం జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. విభజన అంశాలపై రెండు కమిటీలు వేయాలని నిర్ణయించామని చెప్పారు. ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో మరోసారి కూర్చొని చర్చిస్తారని అన్నారు. 7 మండలాలు, విద్యుత్ బకాయిలు, ఇలా ప్రతి అంశంపై అధికారుల కమిటీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అధికారులతో ఒక కమిటీ, మంత్రులతో మరో కమిటీ వేశామన్నారు. అప్పటికీ సమస్యల పరిష్కారం కాకుంటే కేంద్రం వద్దకు వెళ్తామన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలగకుండా పరిష్కారాలు చూసేలాగా ఈ కమిటీలు ముందుకు సాగుతాయని చెప్పారు.

ఇక, తెలంగాణలో హైదరాబాద్ లో కొన్ని భవనాలను తమకి ఇవ్వాలన్న ఏపీ విజ్ఞప్తిని తెలంగాణ ప్రభుత్వం తోసిపుచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ సమావేశం సందర్భంగా పలు డిమాండ్లను ఏపీ ముందు తెలంగాణ ప్రభుత్వం ఉంచినట్టుగా తెలుస్తోంది. 24 వేల కోట్ల రూపాయలు తమకు చెల్లించాలని ఏపీ కోరగా అందుకు తెలంగాణ నిరాకరించిందని తెలుస్తోంది. 7 మండలాలలను రేవంత్ రెడ్డి కోరినట్టుగా తెలుస్తోంది. దానికి చంద్రబాబు సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది.

విభజన చట్టంలో పేర్కొన్న ఆస్తుల పంపకాలు, విభజన చట్టంలోని పేర్కొనని సంస్థల పంపకాలు, ఏపీ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అంశాలు, పెండింగ్ విద్యుత్ బిల్లులు, ఉమ్మడి ఏపీలో 15 ప్రాజెక్టులు నిర్మించగా అందుకు సంబంధించిన అప్పులపై ఉమ్మడి సంస్థలకు చేసిన ఖర్చులు, చెల్లింపులపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక, ఉద్యోగుల విభజన అంశాలపై కూడా చంద్రబాబు, రేవంత్ రెడ్డి చర్చించినట్లుగా తెలుస్తోంది.