నా కోసం ఢిల్లీ నుండి గొడ్డళ్లు వేసుకుని ..!
పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు ?
By: Tupaki Desk | 5 May 2024 9:33 AM GMT‘‘నేను ముఖ్యమంత్రి అయి 150 రోజులు కూడా కాలేదు అప్పుడే నన్ను దిగిపో అంటున్నారు. కొంత మంది ఢిల్లీ నుండి గొడ్డళ్లు వేసుకొని నాకోసం బయలుదేరారు. పదేళ్లు ప్రధానిగా ఉన్న మోదీ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు ? రేవంత్ రెడ్డిని అరెస్టు చేయడానికి ఢిల్లీ నుంచి పోలీసులను తీసుకువచ్చారు’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ లోక్ సభ పరిధిలోని కొత్తకోట సభలో ఆయన బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణపై తీవ్ర విమర్శలు గుప్పించాడు.
‘‘అరుణమ్మా కాంగ్రెస్ పార్టీ నీకు ఏం అన్యాయం చేసింది ? నిన్ను గద్వాలకు ఎమ్మెల్యేగా చేసినందుకా ? ఉమ్మడి రాష్ట్రంలో నిన్ను మంత్రిగా చేసినందుకా ? అరుణమ్మకు పేరు తెచ్చి పెట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా ? మోడీ చేతిలో కత్తివై కాంగ్రెస్ పార్టీని పొడవాలని చూస్తున్నావా. ఎన్నో గొప్ప అవకాశం ఇచ్చిన కాంగ్రెస్‌ను గెలిపించాలని నేను అడగడం తప్పా ?’’ అని రేవంత్ ప్రశ్నించాడు.
డీకె అరుణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తుంది. వ్యాపారాలు, పదవుల కోసం మాత్రమే డీకె అరుణ ముందుంటారు. మహబూబ్ నగర్ జిల్లా అభ్యన్నతికి ఆమె ఎందుకు కృషి చేయలేదని రేవంత్ ప్రశ్నించాడు. మోడీ, అమిత్ షాల అండతో డీకె అరుణ నా మీద ఢిల్లీలో కేసులు పెట్టించిందని రేవంత్ ఆరోపించాడు. ఉమ్మడి పాలమూరు జిల్లాను ఎడారి చేయాలని చూస్తున్నారని విమర్శించాడు. పాలమూరులో 14 నియోజకవర్గాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని, అందరికీ ఉపాధి కల్పించే బాధ్యత నాది అని రేవంత్ రెడ్డి అన్నాడు.