2036 ఒలింపిక్స్ @ హైదరాబాద్... రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్.ఎం.డీ.సీ. హైదరాబాద్ మారథాన్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
By: Tupaki Desk | 26 Aug 2024 4:23 AM GMTఇటీవల పారిస్ ఒలింపిక్స్ ముగిసిన సంగతి తెలిసిందే. ఈ విశ్వ క్రీడల్లో భారత్ కు కొన్ని తీపి జ్ఞాపకాలు, మరికొన్ని చేదు జ్ఞాపకాలు మిగిలిన సంగతి తెలిసిందే! ఆ సంగతి అలా ఊంటే... 2036 ఒలింపిక్స్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వాలనుకుంటుందంటున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్.ఎం.డీ.సీ. హైదరాబాద్ మారథాన్ ముగింపు కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. గచ్చిబౌలి స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మైకందుకున్న ముఖ్యమంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.
అవును... తాజాగా గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆఫ్రో ఏషియన్, మిలటరీ గేమ్స్ వంటి అనేక క్రీడాపోటీలకు గచ్చిబౌలి ప్రాంతం ఒకప్పుడు వేదికగా నిలిచిందని అన్నారు. అయితే గత ప్రభుత్వాలు క్రీడలపై సరైన దృష్టి సరించకపోవడం వల్ల హైదరాబాద్ సిటీ ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకోలేకపోయిందని తెలిపారు.
అయితే... కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచిన తర్వాత క్రీడలను ప్రొత్సహించాలన్న ఆలోచనతో ముందడుగు వేస్తున్నామని.. పాతిక సంవత్సరాల క్రితం నిర్మించిన గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ విలేజ్ ను పూర్తిగా క్రీడా కార్యక్రమాలకు వినియోగించేందుకు కసరత్తు చేస్తున్నట్లు వివరించారు. ఈ నేపథ్యంలోనే ఒలింపిక్స్ ప్రస్థావన తెచ్చారు రేవంత్.
ఇందులో భాగంగా... ఇటీవల జరిగిన పారిస్ ఒలింపిక్స్ లో మనం అంత గొప్పగా రాణించలేకపోయామని చెప్పిన రేవంత్... 2028లో జరిగే ఒలింపిక్స్ లో తెలంగాణ నంచి అత్యధిక పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. దీనికోసం యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ క్రమంలోనే 2036 ఒలింపిక్స్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వాలనుకుంటున్న నేపథ్యంలో హైదరాబాద్ లోనే పోటీలు నిర్వహించేలా క్రీడా వసతులను అభివృద్ధి చేస్తామని.. దేశంలో ఏ క్రీడా పోటీలైనా హైదరాబాద్ వేదికగా నిర్వహించేందుకు వీలుగా ఇక్కడున్న క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. దీంతో.. ఈ విషయం చర్చనీయాంశం అవుతుంది.