చంద్రబాబుతో పోటీ.. రేవంత్ వ్యూహం ఇలా ఉందా...?
అంతేకాదు.. ఏ చిన్న అజాగ్రత్తగా ఉన్నా.. తెలంగాణ వెనుకబడి పోతుందని రేవంత్ చెప్పారు. ఈ నేపథ్యంలో తాను కూడా.. రోజుకు 18 గంటలు పనిచేసేందుకు మానసికంగా సిద్ధమైనట్టు రేవంత్ రెడ్డి చెప్పారు.
By: Tupaki Desk | 24 Jun 2024 5:30 AM GMTతెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు రోజుకు 12 గంటలు కష్టపడుతు న్నానని తెలిపారు. తద్వారా రాష్ట్రాన్ని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పారు. అయితే.. ఏపీలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన దరిమిలా.. అక్కడ చంద్రబాబు రోజుకు 18 గంటల పాటు కష్టపడుతున్నారని.. దీంతో ఏపీ అభివృద్ధిలో దూసు కుపోవడం ఖాయమని చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీతో తెలంగాణ కూడా పోటీ పడాల్సిన అవసరం ఉందన్నారు.
అంతేకాదు.. ఏ చిన్న అజాగ్రత్తగా ఉన్నా.. తెలంగాణ వెనుకబడి పోతుందని రేవంత్ చెప్పారు. ఈ నేపథ్యంలో తాను కూడా.. రోజుకు 18 గంటలు పనిచేసేందుకు మానసికంగా సిద్ధమైనట్టు రేవంత్ రెడ్డి చెప్పారు. ఆ విధంగా అధికారులు.. మంత్రి వర్గ సహచరులు కూడా.. రోజుకు 18 గంటలపాటు కష్టపడేలా సిద్ధం కావాలని ఆయన సూచించారు. ఏపీతో పోటీ పడాల్సిన అవసరం ఇప్పుడు వచ్చిందని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రం పెట్టుబడుల సమీకరణ.. ఇతర ప్రాజెక్టుల నిర్మాణం వంటివి తీసుకున్నప్పుడు.. ఏపీతో గత ఐదేళ్లలో పెద్దగా పోటీ పడే అవకాశం రాలేదని.. కానీ, ఇప్పుడు అక్కడ చంద్రబాబు వచ్చిన తర్వాత.. పోటీ పడాల్సిన అవసరం వచ్చిందని రేవంత్ చెప్పారు.
కాగా, ఈ నెల 12న ఏపీ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. ఆ వెంటనే ఆయన పోలవరం సందర్శనకు వెళ్లారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అక్కడే ఉండి.. పోలవరం ప్రాజెక్టు తీరుతెన్నులను పరిశీలించారు. ఆ తర్వాత.. అమరావతి పర్యటనకు వెళ్లారు. అప్పుడు కూడా ఉదయం 10 గంటలకు పర్యటన ప్రారంభించి సాయంత్రం 5 గంటల వరకు అమరావతిలోనే ఉన్నారు. ఆ తర్వాత.. మంత్రి వర్గ శాఖలు కేటాయించడం, స్పీకర్ ఎన్నిక, సభల నిర్వహణ, పార్టీ పరంగా కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడం.. ఇలా నిత్యం బిజీబిజీగా గడిపిన విషయం తెలిసిందే. ఇక, త్వరలోనే చంద్రబాబు జిల్లాల పర్యటనను ప్రారంభించనున్నారు.
వ్యూహం ఏంటి?
రేవంత్ రెడ్డి ఇలా తాను 18 గంటలు కష్టపడతానని.. చంద్రబాబుతో పోటీ పడతానని చెప్పడం వెనుక చాలా పెద్ద వ్యూహమే ఉందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. అమరావతి డెవలప్మెంట్‌పై బాబు దృష్టి పెట్టిన తర్వాత..ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతినే అవకాశం ఉంది. అదేసమయంలో పెట్టుబడులపైనా ప్రభావం పడుతుంది. ఇక, వలసలు కూడా పెరుగాయి. వీటిని ముందుగానే అంచనా వేసుకున్న రేవంత్.. చాలా వ్యూహాత్మకంగా.. మీరు ఎవరూ వెళ్లొద్దు.. అక్కడ ఉన్నట్టుగానే ఇక్కడ కూడా.. పాలనా వ్యవస్థను తీసుకువస్తాం.. అని చెప్పకనే చెబుతున్నారు. మరి ఈ వ్యూహం ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.