బాబు భేటీలో తెలివి చూపిన రేవంత్
రెండు గంటల పాటు సాగిన భేటీ విషయానికి వస్తే.. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపించింది.
By: Tupaki Desk | 7 July 2024 10:30 AM GMTకీలక సమయాల్లో ఎలా వ్యవహరించాం? ఎలా మాట్లాడాం? లాంటి అంశాలే ఆయా ప్రముఖుల సమర్థతను తెలియజేస్తుంటాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇద్దరు సీఎంల భేటీ ముగిసింది. ఈ భేటీ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి తీరు ఎలా ఉంటుందన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కొందరు ఆయన్ను టార్గెట్ చేసేందుకు వీలుగా.. 'గురు శిష్య' మాటను పదే పదే తీసురావటం.. దీనిపై రేవంత్ సీరియస్ కావటం తెలిసిందే. చివరకు తెలంగాణ మంత్రులు సైతం ఈ పదాన్ని వాడే వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ సందర్భంగా తెలంగాణ ప్రయోజనాలకు భంగం వాటిల్లేలా ఏ నిర్ణయాన్ని వెల్లడించినా ఎదురయ్యే ఇబ్బందుల గురించి రేవంత్ కసరత్తు చేసినట్లుగా కనిపిస్తోంది. అందుకే భేటీ జరిగిన ఎపిసోడ్ లోని ప్రతి అంశంలోనూ ఎంతో జాగ్రత్తతో ఆలోచించి నడుచుకున్నట్లుగా కనిపించింది. ఉదాహరణకు.. ఏపీ ముఖ్యమంత్రి భారీ శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని తీసుకొస్తే.. తెలంగాణ ముఖ్యమంత్రి అందుకు బదులుగా ప్రముఖ తెలంగాణ కవి కాళోజీ రాసిన ''నా గొడవ' పుస్తకాన్ని బహుకరించటం గమనార్హం. సింఫుల్ గా ఉన్న బహుమతిని ఇవ్వటమే కాదు.. తెలంగాణ సెంటిమెంట్ ను పక్కాగా ఫాలో కావటం కనిపించింది.
రెండు గంటల పాటు సాగిన భేటీ విషయానికి వస్తే.. తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపించింది. హైదరాబాద్ లో కొన్ని భవనాలు అవసరమని కోరిన సందర్భంలోనూ.. ఎలాంటి మెహమాటాలకు తావు ఇవ్వకుండా.. భవనాలు ఇచ్చే పరిస్థితి లేదని.. అప్లికేషన్ పెట్టుకుంటే పరిశీలించి స్థలం ఇస్తామని.. ఢిల్లీలో ఏపీ భవన్ మాదిరి భవనాలు నిర్మించుకోవాలని చెప్పటం చూస్తేనే రేవంత్ ఎంత క్లారిటీతో ఈ సమావేశానికి హాజరయ్యారన్న విషయం అర్థమవుతుంది.
సాధారణంగా ఇద్దరు ప్రముఖులు కలిసి.. మాట్లాడుకున్న తర్వాత ఏకాంతంగా కాసేపు మాట్లాడుకోవటం ఉంటుంది. అదే జరిగితే.. చోటు చేసుకునే పరిణామాల మీద అవగాహన ఉన్న సీఎం రేవంత్.. అందుకు అస్సలు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని అర్థం చేసుకున్న చంద్రబాబు సైతం తన పరిమితులను తాను తెలుసుకున్నట్లుగా వ్యవహరించారు. మొత్తంగా చూస్తే.. ఈ భేటీలో చంద్రబాబు కాస్త పైచేయి చూపినట్లుగా కనిపించినా.. వాస్తవానికి అత్యంత తెలివిగా వ్యవహరించిన విషయంలో రేవంత్ రెడ్డికే ఎక్కువ మార్కులు పడతాయని చెప్పక తప్పదు.