Begin typing your search above and press return to search.

రేవంత్ రెడ్డికి కేసీఆర్ భయపడుతున్నారా...!?

కేసీఆర్ తెలంగాణాను కొట్లాడి తెచ్చిన నాయకుడు. ఉద్యమ నేత. పదేళ్ల పాటు తెలంగాణాను పాలించిన ముఖ్యమంత్రి వ్యూహకర్త.

By:  Tupaki Desk   |   26 Dec 2023 1:30 PM GMT
రేవంత్ రెడ్డికి కేసీఆర్ భయపడుతున్నారా...!?
X

కేసీఆర్ తెలంగాణాను కొట్లాడి తెచ్చిన నాయకుడు. ఉద్యమ నేత. పదేళ్ల పాటు తెలంగాణాను పాలించిన ముఖ్యమంత్రి వ్యూహకర్త. రాజకీయ చాణక్యుడు. ఇలా చాలా విశేషణాలు ఆయన పేరు పక్కన చేర్చవచ్చు. కానీ ఒకే ఒక్క ఓటమి మాత్రం కేసీఆర్ పేరు పక్కన మాజీ సీఎం అని ట్యాగ్ తగిలించింది. రాజకీయాల్లో ఉన్న వారికి పదవులు అనుభవించిన వారికీ మాజీ అనిపించుకోవడం కంటే బాధ మరోటి ఉండదు.

కానీ తప్పదు, రాజకీయాల్లో జయాపజయాలు తప్పనిసరి. అల ఓడ్లు బళ్లు అవుతాయి. ప్రస్తుతం బీఆర్ఎస్ కి అలాంటి వాతావరణమే కళ్ల ముందు ఉంది. రేవంత్ రెడ్డి డ్యాం ష్యూర్ గా తాను సీఎం అవుతాను అని చెప్పారు. అనుకున్నట్లుగా అయిపోయారు. దాంతో పాటు ఆయన దూకుడుగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రిగా పనిచేసిన అనుభవం లేని రేవంత్ సీఎం గా గొప్పగానే రాణిస్తున్నారు అని ఆయన ఇరవై రోజుల పరిపాలన తీరుతెన్నులు చాటి చెబుతున్నాయి.

ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి ఇరవై రోజుల పాలన మీద అటు బ్యూరోక్రసీలోనూ చర్చ సాగుతోంది. ఆయన బాగానే చేస్తున్నారు అన్న భావన సర్వత్రా ఉంది. ఇటు ప్రజలలోనూ కూడా అలాంటి అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండింటిని రేవంత్ రెడ్డి అపుడే అమలులో పెట్టేశారు. అదే విధంగా ప్రభుత్వం లో అందరినీ కలుపుకుని పోతూ సమిష్టిగా ముందుకు సాగుతున్నారు.

కాంగ్రెస్ స్టైల్ కి భిన్నంగా వివాదాలు ఏవీ లేకుండా గత ఇరవై రోజుల పాలన సాగుతోంది అంటే రేవంత్ రెడ్డి పొలిటికల్ మెచ్యూరిటీ ఏ లెవెల్ లో ఉందో అర్ధం అవుతోంది అంటున్నారు. సరిగ్గా అదే ఇపుడు బీఆర్ఎస్ లో కలవరాన్ని రేకెత్తిస్తోంది అంటున్నారు. దీంతో కనీసం ఒక ప్రభుత్వానికి ఇచ్చే మూడు నుంచి ఆరు నెలల హానీమూన్ పీరియడ్ ని కూడా ఇవ్వదలుకోలేదు బీఆర్ఎస్ అని అంటున్నారు.

రేవంత్ రెడ్డి మీద అపుడే ఎటాక్ కి బీఆర్ ఎస్ నేతలు రెడీ అవుతున్నారు అంటే ఆయన ఇంపాక్ట్ ఏ విధంగా తెలంగాణా రాజకీయాల మీద పడుతోందో అర్ధం చేసుకోవచ్చు అని అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి చురుకైన రాజకీయం కూడా బీఆర్ఎస్ కి ఎక్కడో అగ్గి రాజేస్తోంది అని అంటున్నారు.

గత ఇరవై రోజులలో రేవంత్ రెడ్డి చేసిన పని ఏంటి అంటే వరసగా ప్రతీ రంగంలోనూ శ్వేత పత్రాలు రిలీజ్ చేయడం. తద్వారా తెలంగాణాలో గత పదేళ్ల పాలన డొల్లతనాన్ని అప్పుల పాలు అయిన ఉదంతాన్ని కళ్ళకు కట్టినట్లుగా ప్రజల ముందు ఉంచేశారు అని అంటున్నారు.

దాంతో బీఆర్ఎస్ నేతలు అలెర్ట్ అవుతున్నారని అంటున్నారు. ఇదే కాంగ్రెస్ కి మరికొంత టైం ఇస్తే చాలు ఇక ప్రజల వద్ద బీఆర్ఎస్ ని పూర్తి స్థాయిలో విలన్ గా చేస్తుంది అన్న కలవరం కూడా రేగుతోందిట. పెద్ద ఎత్తున ఆరున్నర లక్షల నుంచి ఏడు లక్షల కోట్ల దాకా తెలంగాణాలో గత పదేళ్ళలో అప్పులు చేశారు అని సీఎం హోదాలో రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో శ్వేత పత్రం రిలీజ్ చేసి సంచలనం రేకెత్తించారు.

దీంతో ఇపుడు తెలంగాణా సమాజం యావత్తు దీని మీద దృష్టి సారించింది. ఉమ్మడి ఏపీ విడిపోయాక తెలంగాణాకు హైదరాబాద్ వంటి రాజధాని తోడు ఉంది. సంపన్న రాష్ట్రంగా తెలంగాణా బీఆర్ ఎస్ చేతుల్లోకి వచ్చింది. మరి బీఆర్ఎస్ దిగిపోయేనాటికి ఇన్ని లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేశారు అన్న ప్రశ్న సహజంగా సగటు తెలంగాణా ప్రజానీకంలో వస్తోంది.

అదే ఇపుడు కాంగ్రెస్ కి ప్లస్ అవుతోంది. ఆ ఆలోచనలో జనంలో రేకెత్తించడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులను బయట పెట్టడం ద్వారా ఇప్పటికే రేవంత్ రెడ్డి జనంలో మంచి మార్కులు కొట్టేశారు అని అంటున్నారు.

ఇదే లెక్కన కాంగ్రెస్ దూకుడు సాగితే ఇబ్బందులు తీవ్ర స్థాయిలో తప్పవని బీఆర్ స్ లో ఒక చర్చ సాగుతోంది అని అంటున్నారు. దాంతో కౌంటర్ చేయడానికే స్వేద పత్రాలు అంటూ బీఆర్ ఎస్ రిలీజ్ చేస్తోంది. అయితే దాని మీద కూడా కాంగ్రెస్ నుంచి కౌంటర్లు పడుతున్నాయి. చెమట ఓడ్చి ప్రజలు పన్నులు కడితే వచ్చిన సొమ్మును అప్పుల పాలు చేసింది చాలక ఇపుడు స్వేద పత్రాలు ఏంటి అంటూ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు.

మొత్తం మీద చూస్తే సీఎం రేవంత్ రెడ్డి టీం నిదానంగానే ఉంటూ బీఆర్ఎస్ గత పాలన మీద జనంలో చర్చకు పెడుతోంది. ఇది చివరికి బీఆర్ఎస్ కి రాజకీయంగా ట్రబుల్ ఇచ్చేలా ఉందని అంటున్నారు. ఈ రకమైన పరిణామాలతో బీఆర్ఎస్ అయితే ఉలిక్కి పడుతోందిట. మరి రేవంత్ రెడ్డికి అట్టే టైం ఇవ్వకుండా ఎటాక్ కి రెడీ అయిపోవడంలోని ఆంతర్యం అదే అని అంటున్నారు.