రేవంత్ వ్యూహం.. ఉమ్మడి నిజామాబాద్ లో కాంగ్రెస్ సై!
ఏ ఉద్దేశంలో తీసుకున్నారో గానీ.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేయాలనుకోవడం రాజకీయంగా సంచలనంగా మారింది.
By: Tupaki Desk | 9 Nov 2023 1:30 AM GMTఏ ఉద్దేశంలో తీసుకున్నారో గానీ.. తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గంలో పోటీ చేయాలనుకోవడం రాజకీయంగా సంచలనంగా మారింది. అసలు కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం రెండు సీట్లు ఒక నాయకుడిని ఇవ్వడమే అరుదు. కానీ, దానిని సాధించి రేవంత్.. ఏకంగా సీఎం కేసీఆర్ నే ఢీకొట్టబోతున్నారు. మరోవైపు చూస్తే.. కామారెడ్డిలో ఆయన పోటీ ఆ నియోజకవర్గం మీదనే కాదు.. ఉమ్మడి నిజామాబాద్ రాజకీయ రూపునూ మార్చివేసిందని చెబుతున్నారు.
వ్యూహాత్మకం.. ఫలించిన వైనం
రేవంత్ రెడ్డి కామారెడ్డి నియోజకవర్గం నుంచి ఈ ఎన్నికల్లో పోటీకి సిద్ధపడడం.. కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా నాయకత్వ లోపాన్ని సరిచేసిందని చెబుతున్నారు. వాస్తవానికి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తెలంగాణ ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ కు పట్టున్న ప్రాంతం. 2001లో ఇక్కడి స్థానిక సంస్థల్లో గెలుపు అనంతరమే బీఆర్ఎస్ (నాటి టీఆర్ఎస్) అంటే ఏమిటో అందరికీ తెలిసింది. నిజామాబాద్ నుంచి కేసీఆర్ కుమార్తె కవిత కూడా ఎంపీగా గెలిచారు. అంతటి ప్రాబల్యం ఉంది కాబట్టే.. కామారెడ్డి నుంచి కేసీఆర్ ఎమ్మెల్యేగా పోటీకి దిగారు. కాగా.. తానూ రంగంలోకి దూకి దీనికి ఊహించని విధంగా రేవంత్ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు.
ఐదారు చోట్ల ప్రభావం
ఉమ్మడి నిజామాబాద్ 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఆదరించింది. 2014లో అయితే సీఎం కేసీఆర్ సొంత జిల్లాల మెదక్ లో బీఆర్ఎస్ పూర్తి పట్టు సాధించలేకపోయింది. కానీ, నిజామాబాద్ లో విజయదుందుభి మోగించింది. అదే పరంపరను గత ఎన్నికల్లోనూ కొనసాగించింది. 2019 ఎంపీ ఎన్నికల్లో కవిత ఓటమి వేరే విషయం. కాగా, ఈ ఎన్నికలకు కూడా బీఆర్ఎస్ అదే ఊపులో ఉంది. ఉమ్మడి నిజామాబాద్ లోని 9 నియోజకవర్గాలకు గాను ఏడెనిమిది స్థానాల్లో ఆ పార్టీ బలంగా ఉన్నట్లు నిన్న మొన్నటివరకు భావించారు. అయితే, రేవంత్ కామారెడ్డిలో పోటీ నిర్ణయంతో పరిస్థితి మారిపోయిందట. అప్పటివరకు ఒక్క సీటులోనే ప్రభావవంతంగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు ఏకంగా నాలుగైదు సీట్లలో బలంగా మారిందట. ఒకవేళ రేవంత్ గనుక నిజామాబాద్ అంతటా ప్రభావం చూపితే కనీసం మూడు-నాలుగు సీట్లయినా వస్తాయట.
అదే జరిగితే కాంగ్రెస్ దే అధికారం?
రేవంత్ గనుక ఉమ్మడి నిజామాబాద్ పై ముద్ర వేయగలిగి.. మూడు నాలుగు సీట్లయినా గెలిపిస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ కు అధికారం దక్కినట్లేనని అంటున్నారు. ఎందుకంటే.. బీఆర్ఎస్ బలంగా ఉన్న ఉత్తర తెలంగాణలోనే ఈ మేరకు ప్రభావం చూపితే.. దక్షిణ తెలంగాణలో పట్టున్న కాంగ్రెస్ మరిన్ని సీట్లు సాధిస్తుందని అంటున్నారు. అందుకే ఈ ఎన్నికల్లో కామారెడ్డిని కీ ఫ్యాక్టర్ గా పేర్కొంటున్నారు.