Begin typing your search above and press return to search.

లౌక్యంతోనే సౌఖ్యం..రేవంత్ వ్యూహం !

రేవంత్ రెడ్డి గత కాలం ముఖ్యమంత్రి కేసీఆర్ కి పూర్తి భిన్న పోకడలను అనుసరిస్తున్నారు.

By:  Tupaki Desk   |   5 March 2024 3:46 AM GMT
లౌక్యంతోనే సౌఖ్యం..రేవంత్ వ్యూహం !
X

తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డిలో రాజకీయ పరిపక్వత చాలా హెచ్చు అన్నది గడచిన మూడు నెలల ఆయన పాలనలో తెలిసిపోయింది. ఆయన ముఖ్యమంత్రి అయ్యాక చాలా హుందాగా వ్యవహరిస్తున్నారు. చాలా సందర్భాలలో ప్రత్యర్ధులు సైతం మెచ్చుకునేలా ఆయన తీరు ఉంది. రేవంత్ రెడ్డి గత కాలం ముఖ్యమంత్రి కేసీఆర్ కి పూర్తి భిన్న పోకడలను అనుసరిస్తున్నారు.

కేసీఆర్ ఎక్కడ చెడ్డారో అది చూసి మరీ తన కొత్త దారి వేసుకుంటున్నారు. జనాలు అన్నీ గమనిస్తారు. వారు ప్రతీ రోజూ పాలకుల పరీక్షా పత్రం దిద్దుతారు. అయిదేళ్లకు ఒకసారి మార్కులు వేస్తారు. అయిదేళ్లలో చివరి రోజులలో వారి వద్దకు వెళ్ళి బుజ్జగింపు కబుర్లు చెబితే వారు మార్కులు ఏమీ పెంచరు. అదంతా గతం. ఇది సోషల్ మీడియా యుగం. ప్రతీదీ ఇక్కడ రికార్డే.

అందుకే రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణాకు ఈసారి వచ్చినపుడు ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రోటోకాల్ పాటించి మరీ రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఘన స్వాగతం పలికిన తీరు నాలుగు కోట్ల మంది తెలంగాణా జనం మన్ననలు అందుకునేదే.

వారికి రాజకీయాలు పార్టీ పట్టింపులు ఉండవు. ఒక దేశ ప్రధాని రాష్ట్రానికి వచ్చినపుడు రాష్ట్ర పెద్దగా సీఎం ఎలా వ్యవహరించారు అన్నదే చూస్తారు. ఆ విధంగా చూస్తే కనుక రేవంత్ రెడ్డి ప్రజల మనసులు గెలుచుకున్నారు. గతంలో అంటే కేసీఆర్ ఏలుబడిలో మోడీ అనేకసార్లు తెలంగాణాకు వచ్చారు. కానీ మొదట్లో కొన్నాళ్ళ పాటు స్వాగతం పలికిన కేసీఆర్ ఆ తరువాత ముఖం చాటేశారు.

ఇది తెలంగాణ పౌర సమాజం చాలా నిశితంగా గమనించింది. గత ఎన్నికల్లో ఆ ప్రభావం కూడా తీర్పులో కనిపించింది అని అంటారు. ఇక కేసీఆర్ ఏ కారణం చేత వెళ్లకపోయినా అహంభావంతోనే అని జనాలు అనుకున్నారు. రేవంత్ రెడ్డిలో అది ఎక్కడా కనిపించలేదు. ఆయన దేశ ప్రధానిని పెద్దన్నగా సంభోధించారు. రాజ్యాంగం ప్రకారం సమాఖ్య సూత్రం ప్రకారం దేశానికి పెద్దన్నగానే కేంద్ర ప్రభుత్వం ఉంటుంది అదే రేవంత్ రెడ్డి చెప్పారు.

అంతే కాదు ఆయన ఏ భేషజాలూ లేకుండా ప్రధాని నాయకత్వంలో దేశం అభివృద్ధి సాధిస్తోంది అని కూడా పొగిడారు. మంచిని మంచిగా చెప్పాలి. ఏ పార్టీలో ఉన్నా. అదే రాజకీయ నీతిని రేవంత్ రెడ్డి పాటించారు అని అంటున్నారు. ఇక రేవంత్ రెడ్డి ప్రధానిని సన్మానించారు. ఆయన పక్కన కూర్చుని మాట్లాడారు. ఒక విధంగా తెలంగాణా జనాలలో ఇవన్నీ చర్చకు వచ్చాయి.

కేంద్రం నుంచి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అయినా నిధులు రావాలి. అవి హక్కు అని అనుకున్నా కేంద్ర పెద్దల దయ ఉంటే వాటిని చాలా సులువుగా ఎక్కువగా సాధించుకోవచ్చు. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అదే చేస్తున్నారు. అంత మాత్రం చేత ఆయన బీజేపీ మనిషి కారు. రేవంత్ కూడా అదే బాటలో వెళ్తున్నారు.

ఇక రేవంత్ రెడ్డి సీఎం గా ఉంటూ గత మూడు నెలలో అనేక సభలలో పాలు పంచుకున్నారు. తాజాగా తమిళనాడు మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు రాసిన ఒక పుస్తకావిష్కరణ సభలో పాల్గొని ఆయన అన్న మాటలు చాలా ఆలోచింపచేసేవే. తెలుగు వారికి జాతీయ స్థాయిలో రాజకీయల్లో స్థానం ఉండాలని, వారి గొంతుక వినిపించాలని ఆయన కోరుకోవడం కూడా రాజకీయాలకు అతీతంగా అంతా ఒప్పుకునే మాట.

ఇవే కాదు చాలా సందర్భాలలో ఆయన అంటున్న మాటలు చేస్తున్న ప్రకటనలు చర్యలు కూడా ఆయనలోని రాజకీయ పరిపక్వతను చాటి చెబుతున్నాయి. ఎన్నికలపుడే రాజకీయాలు, మిగిలిన సమయం అభివృద్ధి కోసం అంటూ రేవంత్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఆహ్వానించదగినవే.

యాభై అయిదేళ్ళ వయసులో తెలంగాణాకు సీఎం అయిన రేవంత్ రెడ్డీకి ఇంకా మరో రెండు దశాబ్దాల పాటు రాజకీయ భవిష్యత్తు ఉంది. అందుకే ఆయన లౌఖ్యంగా సౌఖ్యంగా ఉండాలనుకుంటున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ తప్పు పట్టవచ్చు. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటి అని ప్రచారం చేయవచ్చు. కానీ ప్రజలు మాత్రం రేవంత్ రెడ్డి రూట్ రైట్ అంటున్నారు. అందుకే ఆయన తెలంగాణా రాజకీయ యవనిక మీద తనదైన ముద్ర బలంగా వేస్తూ సుదీర్ఘ కాలం పాటు కొనసాగే గట్టి నేతగా కనిపిస్తున్నారు.