రేవంత్ చరిష్మా వాడుకోవాలంటే టీడీపీకి చేయాల్సింది అదే...?
ఇక పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇష్టుడు అయిన రేవంత్ రెడ్డి ఏపీలో అగ్రెసివ్ గా ప్రచారం చేసి పెడతారు. అండగా ఉంటారు.
By: Tupaki Desk | 10 Dec 2023 3:44 AM GMTతెలంగాణాలో కాంగ్రెస్ గెలిచింది. ఆరు నెలల క్రితం వరకూ పెద్దగా ఆశలు లేని పార్టీని ఫోర్ ఫ్రంట్ లో పెట్టి బలమైన బీఆర్ఎస్ ని వెనక్కి నెట్టిన ఘనత మాత్రం అచ్చంగా రేవంత్ రెడ్డిదే అని చెప్పాలి. రేవంత్ రెడ్డి చరిష్మాటిక్
లీడర్ అని వేరేగా చెప్పాల్సింది లేదు. ఆయన మాస్ ఇమేజ్ కాంగ్రెస్ కి బాగా కలసివచ్చింది. అది కాంగ్రెస్ ని అధికారంలో కూర్చోబెట్టింది. తెలంగాణా ఇచ్చిన సోనియమ్మ కళ్లలో ఆనందం కూడా తెచ్చింది.
మరి ఏపీ సంగతి ఏంటి. తెలంగాణా విజయం ఏపీలో ఎలా రిఫ్లెక్ట్ అవుతుద్ని అన్నది ఒక ఎడతెగని చర్చ. ఎందుకంటే ఏపీలో చూస్తే కాంగ్రెస్ ఏమీ లేదు. ఆ పార్టీ సోదిలో కూదా లేని పరిస్థితి. ఈ రోజుకీ ఏపీలో కాంగ్రెస్ లేచి కూర్చునే పరిస్థితి లేదు. అయితే కాంగ్రెస్ కి బలం చేకూరాలన్నా తెలంగాణా గాలి ఏపీకి పాకాలన్నా కూడా చాలా చేయాలి.
ఏపీలో కాంగ్రెస్ అక్కడ ఉన్న పార్టీలతో పొత్తులు పెట్టుకోవాలి. ఏపీలో చూస్తే అధికార వైసీపీ ఉంది. ఆ పార్టీ కాంగ్రెస్ ని లేకుండా చేసి ఆ పునాదుల మీద ఎదిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ తో పొత్తు అంటే కాంగ్రెస్ విలీనం అవుతుంది తప్ప వచ్చే లాభం ఏమీ ఉండదు. పైగా కాంగ్రెస్ జాతీయ నాయకత్వం ఏపీలో వైసీపీతో పొత్తుకు నో చెబుతుంది.
అదే విధంగా వైసీపీ కూడా కాంగ్రెస్ కి బహు దూరంగా ఉంటుంది. ఇక మిగిలినవి తెలుగుదేశం కమ్యూనిస్టులు జనసేన లాంటి పార్టీలు. ఇక ఏపీలో టీడీపీ జనసేన పొత్తులలో ఉన్నాయి. ఈ రెండు పార్టీలూ మరిన్ని పార్టీలను చేర్చుకోవాలని చూస్తున్నాయి. బీజేపీని కూటమిలోకి లాగాలని పవన్ చూస్తూంటే చంద్రబాబు ఆలోచనలు వేరేగా ఉన్నాయని అంటున్నారు.
బీజేపీకి ఏపీలో పెద్దగా బలం లేదు. నాయకులు కూడా గట్టిగా ఉన్న వారు తక్కువ. ఏపీ వ్యాప్తంగా బీజేపీకి ఓటు బ్యాంక్ కూడా పెద్దగా లేదు. అదే కాంగ్రెస్ అయితే ప్రతీ పోలింగ్ బూత్ లో ఎన్నో కొన్ని ఓట్లు ఉన్నాయి. అలాగే ఈ రోజుకు కాంగ్రెస్ ని నమ్ముకున్న నాయకులు చాలా మంది ఉన్నారు. దాంతో పాటు బలమైన పొత్తులు ఉంటే కాంగ్రెస్ లేచి కూర్చుంటుంది. పైగా కాంగ్రెస్ ఎంత బలంగా లేచి నిలబడితే అంతలా వైసీపీ ఓట్లు చీలుతాయి.
ఇక తెలంగాణాలో కాంగ్రెస్ కి వీచిన అనుకూల గాలి కూడా ఏపీలో వీస్తుంది. విజయమూ దక్కవచ్చు. ఇపుడు తెలుగుదేశంలో ఈ రకమైన చర్చలు సాగుతున్నాయని అంటున్నారు. కాంగ్రెస్ తో పొత్తు అంటే మైనారిటీలు ఎస్సీ ఎస్టీలు కూడా దగ్గరకు వస్తారు. లౌకికవాదానికి బలం చేకూరుతుంది. వైసీపీ ఓటు బ్యాంక్ ని అలా కొల్లగొట్టవచ్చు. ఇక పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇష్టుడు అయిన రేవంత్ రెడ్డి ఏపీలో అగ్రెసివ్ గా ప్రచారం చేసి పెడతారు. అండగా ఉంటారు.
మాస్ ఇమేజ్ ఉన్న రేవంత్ రెడ్డిని ఏపీలో దింపితే ఆ దూకుడే వేరుగా ఉంటుంది. బలమైన రెడ్డి సామాజికవర్గం మద్దతు కూడా దక్కుతుంది. ఇవన్నీ టీడీపీలో కొత్త ఆలోచనలు కలుగ చేస్తున్నాయని అంటున్నారు. ఇక జాతీయ స్థాయిలో చూస్తే ఇండియా కూటమి కాంగ్రెస్ నాయకత్వానికి రేపటి రోజున కేంద్రంలో అధికారం దక్కే సూచనలు ఉంటే అది ఏపీకి అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది అన్నది కూడా ఉంది.
మొత్తానికి చూస్తే కాంగ్రెస్ ప్లస్ కమ్యూనిస్టులు ప్లస్ జనసేన ఇదీ టీడీపీ కొత్త కూటమిగా కనిపిస్తోంది. అటు పవన్ కళ్యాణ్ ఇటు రేవంత్ రెడ్డిలతో కలసి మల్టీస్టారర్ పాలిటిక్స్ తో ఏపీలో బరిలోకి దిగితే తిరుగులేని విజయం సిద్ధిస్తుంది అని టీడీపీ భావిసోంది అని అంటున్నారు. మరి ఇది ఊహ కాదు ఆలోచన. నిజం అయ్యే సూచనలు కూడా ఉన్నాయని అంటున్నారు.
తెలంగాణాలో టీడీపీ పోటీలో వద్దు అని అనుకూల మీడియా సూచించింది. దాన్ని టీడీపీ హై కమాండ్ పాటించింది. ఇపుడు ఏపీలో కొత్త పొత్తులకు అనుకూల మీడియా దిశా నిర్దేశం చేస్తోంది. దాన్ని కూడా టీడీపీ పాటిస్తుందా అంటే కాలం తొందరలోనే జవాబు చెబుతుంది అని అంటున్నారు.