Begin typing your search above and press return to search.

మొదటిసారి రేవంత్ కు మోడీ దెబ్బ తగిలిందా?

అలాంటి టాలెంట్ ఉన్న టాప్ 10 మంది తెలుగు ముఖ్యనేతల్లో రేవంత్ మొదటి ముగ్గురిలో ఒకరిగా చెప్పాలి.

By:  Tupaki Desk   |   2 Jun 2024 4:57 AM GMT
మొదటిసారి రేవంత్ కు మోడీ దెబ్బ తగిలిందా?
X

తాను నమ్మింది.. అంతే నమ్మకంగా ప్రజలకు చెప్పటం అందరు నేతలకు సాధ్యం కాదు. అలాంటి వారు తక్కువ మందే ఉంటారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. తాము చెప్పాలనుకున్న విషయాన్ని అందరికి అర్థమయ్యేలా చెప్పటం.. జనరంజకంగా చెప్పటం.. తమను వ్యతిరేకించే వారు సైతం తమ మాటలకు ఫిదా అయ్యేలా చేసే టాలెంట్ కొందరు నేతలకు మాత్రమే ఉందని చెప్పాలి. అలాంటి టాలెంట్ ఉన్న టాప్ 10 మంది తెలుగు ముఖ్యనేతల్లో రేవంత్ మొదటి ముగ్గురిలో ఒకరిగా చెప్పాలి.

అలాంటి ఆయన సార్వత్రిక ఎన్నికల వేళ.. ప్రధాని మోడీ గురించి.. ఆయన పాలన గురించి.. ఆయన చెప్పే మాటల గురించి విమర్శలు గుప్పించటమే కాదు.. కాంగ్రెస్ గురించి.. రాహుల్ నాయకత్వం గురించి ఎంతగానో చెప్పే ప్రయత్నం చేశారు. దేశంలో మరే కాంగ్రెస్ ముఖ్యనేత చేయని రీతిలో ఆయన ఎన్నికల ప్రచారాన్నిచేపట్టారు. పాలనను పక్కన పెట్టేసి.. పూర్తిగా ఎన్నికల రాజకీయం మీదనే ఫోకస్ చేశారని చెప్పాలి. ఇదే విషయాన్ని ఆ తర్వాత తనను ఇంటర్వ్యూ చేసే వారితోనూ చెప్పారు.

మోడీ మీద రేవంత్ రెడ్డి చేసిన ఘాటు విమర్శలు శ్రుతిమించాయన్న వాదన కూడా ఉంది.అయితే.. అదంతా ఎన్నికల వేళలో మామూలే అన్న విషయాన్ని రేవంత్ చెప్పటం కనిపించింది. ఏతావాతా రేవంత్ ఎంత కష్టపడినా.. ఆయన ఎంతటి పదునైన వాదనను వినిపించినా.. తెలంగాణ ప్రజలు మాత్రం లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేయలేదు. మూడు.. నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమను గెలిపించిన తెలంగాణ ప్రజలు సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం బీజేపీకే ఓటు వేశారన్న విషయాన్ని తాజాగా వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.

ఎన్నికల వేళలోనూ.. ఆ తర్వాత కూడా మొత్తం 17 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 11 వరకు సీట్లుసొంతం చేసుకుంటాయని చెప్పటం తెలిసిందే. అయితే.. అత్యధిక ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఎంపీ స్థానాల్ని బీజేపీ గెలుచుకుంటుందన్న అంచనాల్ని వెల్లడించారు. ఇదంతా చూస్తే.. మోడీ దెబ్బ ఎంతలా ఉంటుందన్న విషయాన్ని మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి రుచి చూశారన్న మాట వినిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ కు తగ్గట్లే రియల్ ఫలితాలు కూడా ఉంటే.. మోడీ విషయంలో తన గేమ్ ప్లాన్ ఎంతలా మార్చాలన్న విషయం రేవంత్ కు అర్థమవుతుందని చెబుతున్నారు.