Begin typing your search above and press return to search.

కూల్చుతామంటే.. చీల్చుతాం.. బీఆర్ఎస్ కు రేవంత్ గట్టి సమాధానం

ఎమ్మెల్యే నంబర్ 3.. తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ లోకి మరో శాసనసభ్యుడు జంప్ కాబోతున్నారు

By:  Tupaki Desk   |   19 April 2024 10:05 AM GMT
కూల్చుతామంటే.. చీల్చుతాం.. బీఆర్ఎస్ కు రేవంత్ గట్టి సమాధానం
X

ఎమ్మెల్యే నంబర్ 3.. తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి అధికార కాంగ్రెస్ లోకి మరో శాసనసభ్యుడు జంప్ కాబోతున్నారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లోని ఖైరతాబాద్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి దానం నాగేందర్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే కాక.. ఏకంగా సికింద్రాబాద్ ఎంపీ టికెట్ దక్కించుకుని పోటీ చేస్తున్నారు. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావ్ మొదటినుంచే కాంగ్రెస్ వైపు చూశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడైన ఆయన అనూహ్య పరిస్థితుల్లో ఎన్నికల ముంగిట కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి వెళ్లారు. గెలిచిన అనంతరం తెల్లం ఎప్పుడైనా పార్టీ మారే అవకాశం ఉందనే కథనాలు వచ్చాయి. చివరకు ఇటీవల ఆయన హస్తం గూటికి చేరారు. ఇప్పుడు మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే వంతు వచ్చింది.

టీడీపీ మూలాలతో

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రాజేంద్ర నగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. కాగా, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరనున్న మూడో ఎమ్మెల్యే అయిన ప్రకాష్ గౌడ్.. గతంలో టీడీపీ నుంచి గెలుపొందారు. ఈ నియోజకవర్గం ఏర్పాటు 2009 నుంచి ఈయనే ఎమ్మెల్యేగా నెగ్గుతూ వస్తున్నారు. 2009, 2014లో టీడీపీ, 2018, 2023లో బీఆర్ఎస్ నుంచి నెగ్గారు.

గ్రేటర్ లో రెండో వారు

ఇటీవలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క స్థానమూ దక్కని సంగతి తెలిసిందే. అయితే, ఇప్పుడు దానం, ప్రకాశ్ గౌడ్ వంటి వారి చేరికతో స్కోరు 2కు పెరిగింది. మరికొందరు హైదరాబాద్ ఎమ్మెల్యేలు కూడా ఇదే బాటలో ప్రయాణించే వీలుంది. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వానికి బలం లేదని.. త్వరగానే పడిపోతుందని ప్రతిపక్షాల నేతలు మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేసిన ప్రతిసారీ ఆ పార్టీ ఎమ్మెల్యేలను చీల్చుతుండడం గమనార్హం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంతకాలమే ఉంటుందని కేటీఆర్ మాట్లాడిన సమయంలో తెల్లం, దానంలను హస్తం పార్టీ లాగేసింది. తాజాగా మాజీ సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తాము కూల్చకున్నా.. మోదీ కూలుస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెగ్ కు చెందిన 20 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని ఆయన మాట్లాడిన మరుసటి రోజే ప్రకాశ్ గౌడ్ సీఎం రేవంత్ ను కలిశారు.

పక్కా వ్యూహంతో..

సీఎం రేవంత్ పక్కా ఆలోచనతోనే చేరికలను చేపట్టినట్లు తెలుస్తోంది. తద్వారా ప్రతిపక్ష నేతలను మానసికంగా దెబ్బకొడుతున్నారు. ఎవరైనా తప్పుబడితే ప్రభుత్వాన్ని కూలుస్తామన్న వ్యాఖ్యలను బలమైన సమాధానంగా చూపే చాన్సుంది. కాగా, గత ఎన్నికల్లో 64+1 (సీపీఐ) సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ సాధారణ మెజారిటీకి కేవలం 5 సీట్లే అధికంగా నెగ్గింది. ఇప్పుడు ముగ్గురు ఎమ్మెల్యేల చేరికతో ఆ సంఖ్య 68కి పెరిగింది. ఇది ఎక్కడకు చేరుతుందో చూడాలి..