Begin typing your search above and press return to search.

డ్రగ్స్ పై ఉక్కుపాదం.. హైడ్రా దడ.. ఫుడ్ సేఫ్టీ హడల్.. ఇదీ రేవంత్ ముద్ర

అయితే, ఇప్పుడు రేవంత్ సర్కారు ఒక్కసారిగా రంగంలోకి దిగి దూకుడు చూపుతోంది. అయితే, ప్రభుత్వం అంటే నిరంతర కార్యక్రమం.

By:  Tupaki Desk   |   24 Aug 2024 8:16 AM GMT
డ్రగ్స్ పై ఉక్కుపాదం.. హైడ్రా దడ.. ఫుడ్ సేఫ్టీ హడల్.. ఇదీ రేవంత్ ముద్ర
X

చెరువులను చెరబట్టిన బడాబాబుల గుండెల్లో హైడ్రా దడ.. చిన్నారులను మత్తులో ముంచుతున్న ఉన్మాదుల పై కొరడా.. నాణ్యత పాటించని హోటల్ యజమానులపై ఉక్కుపాదం.. అన్నీ ఏకకాలంలో.. సర్కారు అంటే చురుకు పుట్టేలా తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నలుగురి నోళ్లలో నానుతోంది. పది నెలలు పూర్తిచేసుకుంటున్న కాంగ్రెస్ సర్కారు ఇకమీదట తన ముద్ర చూపే దిశగా అడుగులేస్తోంది. వాస్తవానికి డిసెంబరులోనే అధికారంలోకి వచ్చినా.. మధ్యలో లోక్ సభ ఎన్నికలతో రెండు నెలలు కోడ్ కింద పోయింది. ఆ గ్యాప్ తర్వాత పూర్తిగా ఫోకస్ పెట్టాల్సిన సమయం వచ్చింది. ఇప్పుడు అదే పనిచేస్తోంది రేవంత్ ప్రభుత్వం.

అక్రమార్కులపై పిడుగు హైడ్రా చెరువులు.. నేచర్ అందించిన పెద్ద వనరు. అలాంటివాటి సహజ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తూ నిర్మాణాలు చేపడితే.. వర్షాకాలంలో వరదలు ఊళ్లోకి వస్తుంది. కానీ, ఎవరేం చేస్తారులే అనుకుంటూ.. ఆక్రమణే ధ్యేయంగా పెట్టుకున్న కొందరు బడాబాబులు హైదరాబాద్ లో చెరువులను చెరబట్టారు. హైదరాబాద్ తాగునీటికి ఒకప్పుడు గుండెకాయలాంటి గండిపేట జలాశయం ఫుల్ ట్యాంక్ లెవల్ పరిధిలో ఓ కేంద్ర మాజీ మంత్రి ఏకంగా పది ఎకరాలను కబ్జా చేసేశారు. ఈయన దేశానికి అత్యంత కీలకమైన శాఖను చూసిన మంత్రి కావడం గమనార్హం. అలాంటి ఆయనే చెరువుల 'రక్షణ’ను మరిచారు. గత ఆదివారం గండిపేట, హిమాయత్ సాగర్ జంట జలాశయాల పరిధిలో ఆక్రమణలకు పాల్పడ్డ పది నిర్మాణాలను కూల్చివేశారంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇప్పుడు హైడ్రా ఎక్కడ దాడి చేస్తుందోననే ఆందోళన అక్రమార్కుల్లో నెలకొంది.

ఇక శనివారం సినీ హీరో నాగార్జున సైతం చెరువును ఆక్రమించి నిర్మాణం చేపట్టారనే ఆరోపణలపై చర్యకు దిగింది. అయితే, ఈ నిర్మాణంపై బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ ఆరోపణలు వచ్చాయి. కూల్చివేత ప్రయత్నాలూ జరిగాయి. మళ్లీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలకు దిగింది. కాగా.. ఈ వ్యవహారం కోర్టులో ఉందని.. స్టే ఆర్డర్ ఇచ్చినా చట్ట విరుద్ధంగా కూల్చారని నాగార్జున ప్రకటన విడుదల చేశారు. మరోవైపు హైడ్రాపై కొందరు కోర్టుకు కూడా వెళ్లారంటేనే ఆ సంస్థ దూకుడు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. హైడ్రా.. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ అనేది సీఎం రేంత్ మానస పుత్రిక. దీని అధికారాల పరిధి కూడా ఎక్కువే. హైదరాబాద్ ను విశ్వ నగరంగా నిలిపే ఉద్దేశంలో హైడ్రాను తీసుకొచ్చారు రేవంత్.

డ్రగ్స్, గంజాయిపై ఉక్కుపాదం ఎవరు ఔనన్నా.. కాదన్నా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలోనూ గంజాయి, డ్రగ్స్ ఇప్పుడు పెద్ద సమస్యగా మారాయి. ఒకప్పుడు మత్తు పదార్థాలు అంటే ఎక్కడో అత్యంత రహస్య ప్రదేశంలో అమ్మేవారు. ఇప్పుడు సాధారణ దుకాణాల్లోకీ వచ్చేశాయి. ఇక హైదరాబాద్ పబ్ లలో డ్రగ్స్ గురించి ఎన్నెన్నో కథనాలు. అయితే, డ్రగ్స్, గంజాయి అనే మాటే వినపడేందుకు వీల్లేదన్న సీఎం రేవంత్ ఆదేశాల మేరకు పోలీసులు, టీఎస్ న్యాబ్ అధికారులు రంగంలోకి దిగారు. ఇప్పటికే హైదరాబాద్ పబ్ లపై వరుసగా దాడులు చేస్తున్నారు. కీలకంగా వ్యవహరిస్తున్న డీజే (డిస్క జాకీ)లనూ పట్టుకుని లోపలేశారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తూ పోలీసులు తనిఖీలు, దాడులు చేస్తున్నారు.

ఆహార భద్రతకు అహరహం హైదరాబాద్ అంటేనే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్. అలాంటి బిర్యానీలను విక్రయించే రెస్టారెంట్లు ప్రమాణాలు పాటించడం లేదు. అన్నీ రెస్టారెంట్లు, హోటళ్లు కాకున్నా.. పేరున్న కొన్ని నాసిరకం నూనెలు, ఫ్రిజ్ లో ఉంచిన చికెన్, మటన్ వినియోగిస్తున్నట్లు తేలింది. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. హైదరాబాద్ లోనే కాక రాష్ట్రవ్యాప్తంగానూ దాడులు చేస్తూ.. ఆహార ప్రమాణాలపై రాజీ లేదని చాటుతున్నారు. ఇందులో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పాత్ర కూడా చాలా కీలకం అనే చెప్పాలి. ఉమ్మడి ఏపీకి డిప్యూటీ సీఎంగా పనిచేసిన సమయంలో కంటే ఆయన ఇప్పుడు పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు.

ఇది ఆగొద్దు.. ఏపొద్దు ఆపొద్దు తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం ఇప్పటివరకు పెద్దగా ప్రజలను ఆకట్టుకునే కార్యక్రమాలు చేయలేదనేది వాస్తవం. రైతు రుణ మాఫీ, ఉచిత బస్సు ప్రయాణం అమలు తదితర సూపర్ సిక్స్ హామీలు తప్ప కీలకమైన చర్యలు తీసుకోలేదనే వాదన ఉంది. ఉదాహరణకు మొక్కలు నాటే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిన సమయంలో సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో ఉన్నారు. దీంతో అది ఓ మొక్కుబడి కార్యక్రమంగా సాగింది. అయితే, ఇప్పుడు రేవంత్ సర్కారు ఒక్కసారిగా రంగంలోకి దిగి దూకుడు చూపుతోంది. అయితే, ప్రభుత్వం అంటే నిరంతర కార్యక్రమం. తలపెట్టిన కార్యక్రమాలను నిరంతరం ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. ఎక్కడా స్తబ్ధత రాకూడదు. ఎక్కడైనా నిశ్చలం అయితే అప్పటివరకు చేసినదంతా వేస్ట్ అవుతుంది. దీనిని మనసులో పెట్టుకుని రేవంత్ సర్కారు ప్రయత్నాలు చేస్తే ప్రజల్లో మంచి పేరు రావడం ఖాయం.