రేవంత్ గాడిదగుడ్డు కలకలం
'గాడిద గుడ్డు' అని ఎక్స్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ చేసిన ట్వీట్ కలకలం రేపుతున్నది.
By: Tupaki Desk | 1 May 2024 10:15 AM GMT'తెలంగాణ అడిగింది... పాలమూరు - రంగారెడ్డికి జాతీయ హోదా, బీజేపీ ఇచ్చింది... 'గాడిద గుడ్డు'
తెలంగాణ అడిగింది... రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బీజేపీ ఇచ్చింది... 'గాడిద గుడ్డు'
తెలంగాణ అడిగింది... బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ... బీజేపీ ఇచ్చింది... 'గాడిద గుడ్డు'
తెలంగాణ అడిగింది... కృష్ణా, గోదావరిలో వాటాల పంపకం, బీజేపీ ఇచ్చింది... 'గాడిద గుడ్డు'
తెలంగాణ అడిగింది... మేడారం జాతరకు జాతీయహోదా, బీజేపీ ఇచ్చింది... 'గాడిద గుడ్డు'
తెలంగాణ అభివృద్ధికి బీజేపీనే అడ్డు... పదేండ్ల మోడీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద 'గాడిద గుడ్డు' అని ఎక్స్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ చేసిన ట్వీట్ కలకలం రేపుతున్నది.
రిజర్వేషన్లపై తాను ప్రశ్నించినందుకే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా తనపై పగబట్టి ఢిల్లీలో కేసు పెట్టారని, ఈడీ, సీబీఐ, ఐటీతో పాటు, ఢిల్లీ పోలీసులతో తనను భయపెట్టాలని చూస్తున్నారని, కానీ నేను భయపడే వ్యక్తిని కాదని రేవంత్ అంటున్నారు.
కేసీఆర్ నన్ను చర్లపల్లి జైలుకు పంపిస్తే కొట్లాడానని, మోదీ దగ్గర సీబీఐ, ఈడీ, పోలీసులు ఉండవచ్చు, కానీ తన వెంట 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఉన్నారన్నారు. రేవంత్ జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన జనజాతర సభలో స్పష్టంచేశారు.
తెలంగాణలో ప్రజల అండతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని,రిజర్వేషన్లను రద్దు చేయాలని బీజేపీ, ఆరెస్సెస్ కుట్ర చేస్తున్నాయని రేవంత్ ఆరోపించారు.
ఈ ఎన్నికల్లో 400 సీట్లలో గెలిచి దేశాన్ని అమ్మేయాలని బీజేపీ చూస్తుందని, రిజర్వేషన్లను రద్దు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎటు వెళ్లాలి? అని రేవంత్ ప్రశ్నించారు. ఆ విషయంలోనే నేనుప్రశ్నించినందుకు పోలీసులతో నోటీసులు ఇచ్చారని రేవంత్ అన్నారు.