సీఎం రేవంత్ యూఎస్ ట్రిప్ ముగిసింది.. ఏం సాధించారు?
లోటు తాజా అమెరికా ట్రిప్ తో తీరిందన్న మాట వినిపిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు.. ఉద్యోగ అవకాశాలే లక్ష్యంగా చేపట్టిన ఫారిన్ టూర్ సక్సెస్ ఫుల్ గా సాగినట్లుగా చెబుతున్నారు.
By: Tupaki Desk | 12 Aug 2024 4:38 AM GMTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను సీఎం అయ్యాక చేపట్టిన రెండో విదేశీ ప్రయాణంలో ఒక అంకం పూర్తైంది. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ముగిసినంతనే విదేశీ పర్యటన పెట్టుకున్న ఆయన.. తొలుత అమెరికాకు వెళ్లటం తెలిసిందే. ప్రతి నిత్యం బిజీగా ఉంటూ.. పలువురు ప్రముఖులతో భేటీ కావటం.. తెలంగాణకు తీపికబుర్లు వరుస పెట్టి చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ తన విదేశీ పర్యటనలో అమెరికా ట్రిప్ ను పూర్తి చేశారు. ప్రస్తుతం ఆయన దక్షిణ కొరియా (సౌత్ కొరియా)కు బయలుదేరారు. సీఎం హోదాలో రేవంత్ తొలి విదేశీ పర్యటనగా దావోస్ నిలిచింది. ఆయన అక్కడ తన ముద్రను పెద్దగా వేయలేకపోయారన్న భావన వ్యక్తమైంది.
ఆ లోటు తాజా అమెరికా ట్రిప్ తో తీరిందన్న మాట వినిపిస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు.. ఉద్యోగ అవకాశాలే లక్ష్యంగా చేపట్టిన ఫారిన్ టూర్ సక్సెస్ ఫుల్ గా సాగినట్లుగా చెబుతున్నారు. ఆగస్టు మూన అమెరికాకు సీఎం రేవంత్ వెళ్లగా.. ఆయన వెంట భారీ టీం వెళ్లారు. ఈసారి పర్యటనలో కొన్ని రంగాలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ.. ఆ రంగాలకు చెందిన ప్రముఖుల్ని.. కంపెనీలకు చెందిన ముఖ్యులతో భేటీ అయ్యారు. పలు ఒప్పందాలు చేసుకున్నారు. అమెరికాలో ఉన్న స్వల్ప వ్యవధిలోనే సీఎం రేవంత్ యాభైకు పైగా వ్యాపారవేత్తలతో భేటీ కావటంతో పాటు.. కీలక ఒప్పందాల విషయంలో పడిన ముందడుగు తెలంగాణకు మేలు చేస్తుందంటున్నారు.
అంచనాలకు మించిన పెట్టుబడుల హామీలు ఒక ఎత్తు అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్ని ఉద్యోగాలకు అవకాశం ఉందన్న అంశంలో రేవంత్ అండ్ కో సక్సెస్ అయ్యారంటున్నారు. అమెరికాలో తన టూర్ ముగిసే నాటికి 19 అంతర్జాతీయ సంస్థలు తెలంగాణ పెట్టుబడుల కోసం ఒప్పందాలు చేసుకోవటంతో పాటు.. 30,750 కొత్త ఉద్యోగాల కల్పలనకు సంబంధించిన ఒప్పందాలు జరిగినట్లుగా చెబుతున్నారు.
అమెరికాలో ఇప్పటివరకు తెలంగాణకు ఉన్న ఇమేజ్ స్థానంలో.. సరికొత్త తెలంగాణను అక్కడి వారికి పరిచయం చేసినట్లుగా మంత్రి శ్రీధర్ బాబు చెబుతున్నారు. 19 కంపెనీలతో రూ.31,532 కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోవటంతో పాటు 30వేలకు పైగా ఉద్యోగాలకు అవకాశం లభించిందంటున్నారు. అన్నింటికి మించి హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్న ఫ్యూచర్ సిటీ మీద అవగాహనతో పాటు.. రేవంత్ సర్కారుకున్న కమిట్ మెంట్ ఎంతన్న విషయాన్ని తెలియజేసే విషయంలో విజయం సాధించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఫ్యూచర్ సిటీ మీద తన విజన్ ను చెప్పుకునే విషయంలో సీఎం రేవంత్ చురుగ్గా వ్యవహరించటమే కాదు.. కొత్త ఉత్సాహాన్ని క్రియేట్ చేశారంటున్నారు. అంతేకాదు.. ఈ ప్యూచర్ సిటీలో సిల్క్ వర్సిటీ ఏర్పాటు.. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నిర్మాణానికి సంబంధించి.. తమ ప్రభుత్వానికి ఉన్న ఆలోచనల్ని సీఎం రేవంత్ షేర్ చేయగా.. అమెరికా పారిశ్రామికవేత్తల నుంచి పెద్ద ఎత్తున సానుకూలత వ్యక్తమైనట్లుగా చెబుతున్నారు. కాగ్నిజెంట్.. చార్లెస్ స్క్రాబ్.. ఆర్సీసీఎం కార్నింగ్.. అమెజాన్.. జొయిటిస్.. హెచ్ సీఏ హెల్త్ కేర్.. వివింట్ ఫార్మా.. థర్మో ఫిసర్.. అరమ్ ఈక్విటీ.. ట్రైజిన్ టెక్నాలజీస్.. మోనార్క్ ట్రాక్టర్ కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు.. విస్తరణ ప్లాన్లతో సానుకూలంగా స్పందించటం రేవంత్ అమెరికా టూర్ ను విజయవంతంగా మార్చిందన్న మాట వినిపిస్తోంది.