Begin typing your search above and press return to search.

రేవంత్ సర్కార్ హనీమూన్ ఓవర్.. గట్టి నిలదీత మొదలైంది

మన దేశంలో కేంద్రంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా కొత్తగా ప్రభుత్వాలు ఏర్పడిన ఆరు నెలల కాలాన్ని హనీ మూన్ కాలంగా పిలుస్తారు.

By:  Tupaki Desk   |   24 May 2024 1:30 AM GMT
రేవంత్ సర్కార్ హనీమూన్ ఓవర్.. గట్టి నిలదీత మొదలైంది
X

మన దేశంలో కేంద్రంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా కొత్తగా ప్రభుత్వాలు ఏర్పడిన ఆరు నెలల కాలాన్ని హనీ మూన్ కాలంగా పిలుస్తారు. ఇలానే వ్యవహరించాలనే నిబంధన ఏమీ లేకున్నా.. ఇదొక అన్ రికార్డెడ్ సంప్రదాయంగా వస్తోంది. గత ప్రభుత్వాలు చేసిన పొరపాట్లు, తప్పులను సరిదిద్దడం, తమదైన పాలనా విధానాలను అనుసరించేందుకు కొంత సమయం ఇవ్వడం దీని వెనుక ఉన్న ఉద్దేశం. ఆరు నెలల పీరియడ్ లో ప్రతిపక్షాలు, వ్యతిరేక మీడియా కూడా కొత్త ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించే పనిచేయవు. ఏదైనా సీరియస్ అంశం అయితే తప్ప చాలావరకు సౌమ్యంగానే వ్యవహరిస్తాయి. ఆ తర్వాత నుంచి నిలదీతలు మొదలుపెడతాయి.

జూన్ 7తో హనీమూన్ ముగుస్తోంది..

తెలంగాణలో దాదాపు పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు తెరదించుతూ గత ఏడాది డిసెంబరులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. సీఎంగా రేవంత్ రెడ్డికి బాధ్యతలు అప్పజెప్పారు. ఈ జూన్ 7వ తేదీతో రేవంత్ సర్కారుకు ఆరు నెలల హనీమూన్ పిరియడ్ ముగియనుంది. కాగా, తొలి వంద రోజుల పాలన అనంతరం తెలంగాణలో లోక్ సభ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వచ్చింది. ఈ కోడ్ జూన్ 4 వరకు కొనసాగనుంది. మరోవైపు ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి.

ప్రశ్నలు మొదలయ్యాయి..

రేవంత్ సర్కారు హనీమూన్ కాలం ముగియడంతోనే విపక్షం నుంచి నిలదీత మొదలైంది. మొన్నటివరకు రైతు రుణమాఫీపై ప్రతిపక్ష బీఆర్ఎస్ గట్టి సవాళ్లు విసిరింది. దీంతో ఆగస్టు 15లోగా రుణ మాఫీ చేస్తానని సీఎం పదేపదే ప్రమాణం చేస్తున్నారు. ఇక తాజాగా వడ్లకు రూ.500 బోనస్ వ్యవహారం తెరపైకి వచ్చింది. సన్న బియ్యానికే రూ.500 బోనస్ ఇస్తామనే తరహాలో ప్రభుత్వం నుంచి సంకేతాలు రావడంతో బీఆర్ఎస్ నిరసనలకు దిగింది. దీంతో రేవంత్ ప్రభుత్వం తగిన వివరణ ఇచ్చింది. దొడ్డు బియ్యానికీ మద్దతు ధర ఇస్తామని స్పష్టం చేసింది. కాగా, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన డయాగ్నస్టిక్ హబ్ లు చాలా జిల్లాల్లో పనిచేయడం లేదు. దీనిపై ఆరోగ్య శాఖ మాజీ మంత్రి హరీశ్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు.

నియామకాలపైనా..

రేవంత్ ప్రభుత్వం తాము 30 వేల ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు గట్టిగా చెప్పుకొంటోంది. అయితే, ఇవన్నీ తమ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించిన నియమాకాలు అని బీఆర్ఎస్ చెబుతోంది. అసలు కాంగ్రెస్ సర్కారు నోటిఫికేషన్లు ఇచ్చిందే లేదని.. మరి నియామకాలు ఎలా చేపడుతుందని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశిస్తున్నారు. మొత్తానికి రేవంత్ సర్కారు హనీమూన్ పీరియడ్ ముగింపునకు వస్తున్నకొద్దీ విపక్ష గళం గట్టిగా వినిపిస్తోంది.