ఇన్నాళ్లకు సభలో సైలెన్స్ గా బీఆర్ఎస్.. మాటలతో కూర్చోబెట్టి శిక్ష వేస్తున్నానని చెప్పిన రేవంత్
రేవంత్ మాట్లాడుతున్న సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తామని బెదిరించారు.
By: Tupaki Desk | 17 Dec 2023 6:42 PM GMTతెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రసవత్తరంగా జరగుతున్నాయి. పాలకపక్షమైన కాంగ్రెస్, ప్రతిపక్షమైన బీఆర్ఎస్ హోరా హోరీ మాటల యుద్ధం చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లకు బీఆర్ఎస్ ప్రతిపక్షం హోదాలో కూర్చుంది. దీంతో ఈ సారి అసెంబ్లీ సమావేశాలకు ప్రత్యేక వైబ్ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తన మార్క్ మాటల దాడిని ధీటుగా ప్రారంభించారు. రేవంత్ మాట్లాడుతున్న సమయంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రేవంత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ నుంచి వాకౌట్ చేస్తామని బెదిరించారు. దీంతో సీఎం ఈ ఘటనపై ఆసక్తికరంగా స్పందించారు.
సీఎం మాట్లాడుతూ ‘బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మరో గత్యంతరం లేదు. నేను మాట్లాడటం కొనసాగిస్తాను, వారు వింటూనే ఉండాలి. నా ప్రసంగం పూర్తయ్యే వరకు వారెవరూ బయటకు వెళ్లేందుకు అనుమతించను. వారిని ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్లనీయద్దని స్పీకర్ ను కోరుతున్నాను. వారి పాలనకు సంబంధించి నిజాలను వారికి వివరించి వారిలో పరివర్తన తేవడమే నా ముఖ్యమైన ఉద్దేశ్యం, ఇది వారికి నా శిక్ష కూడా’ అని రేవంత్ అన్నారు.
అయితే, రేవంత్ ప్రసంగాన్ని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేయగా స్పీకర్ కలుగజేసుకొని ‘'కౌశిక్ గారు అసెంబ్లీలో అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. సభా నాయకుడు మాట్లాడుతున్న సమయంలో గౌరవించి వినాలి’ అన్నారు. సీఎం ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తూ బీఆర్ఎస్ ను మాటలతో కుళ్లబొడవడం ప్రారంభించారు. పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పనులు, పథకాలు, అవినీతిని ఆయన సభా ముఖంగా వివరించారు. అయితే ఆయన మాటలను అడ్డుకునే ప్రయత్నం కేటీఆర్, హరీశ్ రావుచేయగా.. వారిని సభ నుంచి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. వెంటనే సీఎం కలుగజేసుకొని వారిని బయటకు పంపించవద్దని వారు చేసిన తప్పులు వారికి తెలియాలని స్పీకర్ ను రిక్వెస్ట్ చేశారు.
కేసీఆర్ పాలనలో జరిగిన పనులు, అందులో జరిగిన అవినీతిని సభా ముఖంగా వారికి వివరిస్తాం.. వారు వినాలి.. ఇదే వారికి శిక్ష అని సీఎం రేవంత్ అన్నారు. సీఎం ప్రసంగిస్తూ ‘వరి వేసుకుంటే ఉరే అన్న సీఎం తన ఫామ్ హౌజ్ లో 150 ఎకరాల్లో వేసి వ్యాపారుల మెడపై కత్తిపెట్టి మద్దతు ధర కంటే అధికంగా చెల్లించి కొనేలా చేశారు. పదేళ్లలో ఆత్మహత్య చేసుకున్న రైతులు 8వేల మందే అంటూ లెక్క చెప్పారు. మేడిగడ్డ బరాజ్ పిల్లర్ కుంగిపోయింది. దీనిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపాస్తాం. ఇక, 24 గంటల విద్యుత్ సరఫరాపై కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు చెప్పినవన్నీ అబద్ధాలే.. ఇంకా.. కోటి ఎకరాలకు సాగునీరు కూడా అబద్ధమే.
రైతుల ఆదాయంపులో దేశంలో తెలంగాణ 25వ స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వ నివేదికలు చెప్తున్నాయి. రైతుల ఆత్మహత్యల్లో 2, 3వ స్థానంలో ఉంది. పంటలకు గిట్టుబాటు ధర లేక రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో మనం చూశాం. ‘రైతు బీమా’లో 2018 నుంచి ఇప్పటి వరకు 1.21 లక్షల మంది లబ్ధి పొందారు. అంటే అంత మంది రైతులు చనిపోయినట్లేగా..’ అంటూ ప్రసంగం కొనసాగించారు. అయితే ఆయన మాటలను కేటీఆర్, హరీశ్ రావు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాటలతో రేవంత్ కుళ్లబొడుస్తుంటే చేసేది లేక కూర్చుండిపోయారు బీఆర్ఎస్ నాయకులు.