కేసీఆర్‌కు రేవంత్ ఆహ్వానం.. వస్తారా?
జూన్ 2న జరిగే అవతరణ వేడుకలకు తప్పకుండా రావాలని కోరారు.
By: Tupaki Desk | 31 May 2024 4:41 PM GMTతెలంగాణ సాధనలో కీలక పాత్రం పోషించిన బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. జూన్ 2న జరిగే రాష్ట్ర అవతరణ వేడుకులకు రావాలంటూ.. సీఎం రేవంత్ రెడ్డి తరఫున సర్కారు ప్రతినిధులు కేసీఆర్‌కు ఆహ్వాన పత్రికను అందిం చారు. హైదరాబాద్‌లోనంది నగర్‌లో ఉన్న కేసీఆర్ నివాసానికి వెళ్లిన ప్రభుత్వం తరఫు ప్రతినిధులు వేణుగోపాల్, అర్విందర్ సింగ్ మాజీ సీఎం కేసీఆర్‌ను ఆహ్వానించారు. పత్రికను అందించి.. సీఎం తరఫున సందేశాన్ని వినిపించారు. జూన్ 2న జరిగే అవతరణ వేడుకలకు తప్పకుండా రావాలని కోరారు.
అనంతరం వేణుగోపాల్, అర్విందర్ సింగ్ లు మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తాము కేసీఆర్ ఇంటికి వచ్చినట్టు తెలిపారు. తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించుకున్న నేపథ్యం లో ఆయనను ముఖ్య అతిధిగా ఆహ్వానించినట్టు చెప్పారు. దీనికి కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించారని వేణుగోపాల్, అర్విందర్ సింగ్ తెలిపారు. ఇక, కేసీఆర్‌కు ఇచ్చిన ఇన్విటేషన్‌లో ఆయనను ప్రధానప్రతిపక్ష నాయకుడిగా పేర్కొన్నారు. అదేసమయంలో `ఉద్యమ భాగస్వామి` పేర్కొన్నారు.
వెళ్తారా?
రేవంత్ రెడ్డి ఆహ్వానించారు సరే.. మరి కేసీఆర్ వెళ్తారా? అంటే డౌటే. ఎందుకంటే.. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి పాల్గొన్న ఏ కార్యక్ర మంలోనూ కేసీఆర్ పాల్గొనలేదు. రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినప్పుడు కూడా వెళ్లలేదు. అదేవిధంగా అసెంబ్లీ జరిగినప్పుడు కూడా.. ఆయన తుంటి మార్పిడి ఆపరేషన్ చేయించుకున్న కారణంతో వెళ్లలేదు. కానీ, ఉద్దేశ పూర్వకంగానే కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొట్టారని కాంగ్రెస్ నేతలు దుయ్యబట్టిన విషయం తెలిసిందే. ఎక్కడో ఉన్న నల్లగొండకు వెళ్లి ప్రాజెక్టులపై యుద్ధం ప్రకటించారని.. పక్కనే ఉన్న అసెంబ్లీకి మాత్రం రాలేరా? అని వారు ప్రశ్నించారు.
అంటే.. రేవంత్ ఉన్నారనే కారణంగానే కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొట్టారని అప్పట్లో చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కూడా కేసీఆర్ హాజరు కాబోరని ఎక్కువ మంది చెబుతున్నారు. ఇదిలావుంటే.. మరోవైపు బీఆర్ ఎస్ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అవతరణ దినోత్సవాలకు ఆ పార్టీ చీఫ్ గా కేసీఆర్ ఇప్పటికే పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ కార్యక్రమాలకే హాజరయ్యే అవకాశం మెండుగా కనిపిస్తోంది.