మోడీతో కేసీఆర్ చేయలేని పని రేవంత్ చేశారు!
అంతకుమించి ప్రధాని మోదీకి కేసీఆర్ పరిపాలనలో ఎలాంటి గౌరవ మర్యాదలు లభించలేదు.
By: Tupaki Desk | 4 March 2024 9:03 AM GMTవచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ వివిధ రాష్ట్రాల్లో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్రధాని తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రధాని మోదీపైన వ్యతిరేకతతో ఆయన రాష్ట్రానికి ఎప్పుడు వచ్చినా గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొనేవారు కాదు. ప్రధానికి విమానాశ్రయంలో స్వాగతం పలకడానికి కూడా వెళ్లేవారు కాదు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఉన్నతాధికారులే విమానాశ్రయానికి వెళ్లేవారు.. అక్కడ ప్రధానిని స్వాగతించేవారు.. మళ్లీ తిరిగి వెళ్లేటప్పుడు వీడ్కోలు పలికేవారు. అంతకుమించి ప్రధాని మోదీకి కేసీఆర్ పరిపాలనలో ఎలాంటి గౌరవ మర్యాదలు లభించలేదు.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొత్తల్లో ఒకటి రెండు సందర్భాల్లో మాత్రమే ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తే స్వాగతించారు. ఆ తర్వాత తెలంగాణలో బీజేపీ బలపడటం, గవర్నర్ గా తమిళి సై సౌందర్ రాజన్ రావడం, ఆమె దూకుడుగా వ్యవహరించడం వంటివాటితో బీజేపీతో కేసీఆర్ కు చెడింది. ఆ కోపాన్ని ఆయన ప్రధాని మోదీపైన చూపించడం మొదలుపెట్టారు.
దేశ ప్రధాని స్వయంగా తెలంగాణకు వస్తున్నప్పుడు స్వాగతించాల్సిన కనీస బాధ్యత, సంప్రదాయం ముఖ్యమంత్రిగా కేసీఆర్ పై ఉన్నాయని.. ప్రధాని పర్యటనలకు వెళ్లకపోవడం మంచి పద్ధతికాదని పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా కేసీఆర్ లక్ష్యపెట్టలేదు. పైగా ప్రధాని పర్యటనలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు లేదని.. ప్రధాని కార్యాలయమే తమను విస్మరిస్తోందని బీఆర్‌ఎస్ నేతలు ఎదురు ఆరోపణలు చేసేవారు.
ప్రధాని పర్యటనలో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి కావాల్సిన నిధులు, అభివృద్ధికి సంబంధించిన అంశాలను ప్రస్తావించే వీలున్నా కేసీఆర్ ప్రధానిని కలిసేవారు కాదు. ప్రధాని వచ్చి వెళ్లగానే బీఆర్‌ఎస్ నేతలు ఆయనపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడేవారు.
అయితే ఇదంతా గతం. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పరిపాలిస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర ప్రయోజనాలే తమకు ప్రధానమని, ప్రధానమంత్రి మోదీ తెలంగాణ పర్యటనలో తాను పాల్గొంటున్నానని ఇంతకుముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కాగానే ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రిని కలిసి కూడా వచ్చారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. తద్వారా రాజకీయాలు, ఎన్నికలు వేరు.. రాష్ట్ర ప్రయోజనాలు వేరు అని రేవంత్ రెడ్డి నిరూపించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నట్టుగానే తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనలో పాల్గొన్నారు. తెలంగాణ పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు చేరుకున్న ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఘనంగా సత్కరించారు. ఆయనకు శాలువా కప్పారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ లో రూ. 7వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. రామగుండం ఎన్టీపీసీలో 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు. దీంతో పాటు రైల్వే అభివృద్ధి పనులు ప్రారంభించారు.
అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తున్న ప్రధాని మోదీకి తెలంగాణ ప్రజల తరపున ధన్యవాదాలు తెలిపారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి తెలంగాణకు వచ్చిన ఆయనకు సాదర స్వాగతం పలుకుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్రం అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకెళ్తామన్నారు.
కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గుజరాత్ లా తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని రేవంత్ ప్రధానిని కోరారు. ప్రధాని మోదీ అంటే తమకు పెద్దన్నలాంటి వారని రేవంత్ అన్నారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలనడం ద్వారా తమ ప్రభుత్వ ఉద్దేశమేంటో రేవంత్ తేటతెల్లం చేశారు. కంటోన్మెంట్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసినందుకు ప్రధాని మోదీకి రేవంత్ కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా ఎన్టీపీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం సహకరిస్తుందని హామీ ఇచ్చారు.
రేవంత్ ఘనస్వాగతం, సత్కారంతో ప్రధాని మోదీ సైతం సంతోషంగా కనిపించారు. గతంలో తెలంగాణకు ఎప్పుడు వచ్చినా బీజేపీ నేతలు తప్ప మరెవరూ ఆయన పర్యటనలో కనిపించేవారు కాదు. అలాంటిది తొలిసారి ఒక ముఖ్యమంత్రి, అందులోనూ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తనకు ఈ స్థాయిలో స్వాగత, సత్కారాలు చేయడం ప్రధాని మోదీని మంత్రముగ్ధుడిని చేసి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అలాగే గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో రేవంత్ ను పోల్చి చూస్తున్నారు. ప్రధాని తెలంగాణకు వచ్చినప్పుడు ఆయన పర్యటనలో పాల్గొని రాష్ట్రాభివృద్ధికి కావాల్సిన వాటిని దక్కించుకునే అవకాశమున్నా కేసీఆర్ ఆ పనిచేయలేదని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. రేవంత్ మాత్రం తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ లక్ష్యంగా ప్రధాని పర్యటనలో పాల్గొన్నారని కితాబిస్తున్నారు. రాజకీయాలకతీతంగా ముఖ్యమంత్రి రేవంత్ పై ప్రశంసలు కురుస్తున్నాయి.