Begin typing your search above and press return to search.

హాట్ టాపిక్ గా మారిన రేవంత్ ‘ఎంపికలు’

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి తనదైన టీంను సెట్ చేసుకోవటం కనిపిస్తోంది.

By:  Tupaki Desk   |   13 Dec 2023 4:48 AM GMT
హాట్ టాపిక్ గా మారిన రేవంత్ ‘ఎంపికలు’
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి తనదైన టీంను సెట్ చేసుకోవటం కనిపిస్తోంది. అయితే.. ఆసక్తికకరమైన అంశం ఏమంటే.. ఆయన చేస్తున్న ఎంపికలు. అంచనాలకు మించిన రీతిలో ఆయన ఎంపికలు ఉంటున్నాయి. ఈ ఎంపికలు రాజకీయ.. పారిశ్రామిక వర్గాలతో పాటు.. జర్నలిస్టు సర్కిల్స్ లోనూ హాట్ టాపిక్ గా ఉండటం గమనార్హం.కారణం.. ఆయన ఇప్పటివరకు ఎంపిక చేసిన వారికి సంబంధించి ఏ ఒక్కరిని వేలెత్తి చూపించే విధంగా లేకపోవటమే దీనికి కారణం.

ఇప్పటివరకు రేవంత్ ఎంపిక చేసిన వారిని చూస్తే.. ముక్కుసూటిగా వ్యవహరించే వారు.. వర్కు మీదనే తప్పించి.. ఒత్తిళ్లకు లొంగే వారు కాకపోవటం కనిపిస్తుంది. తన సొంత టీం విషయంలోనూ ఆయన ఇదే జాగ్రత్తలు తీసుకున్నారు. కొత్త ముఖాల్ని తెర మీదకు తీసుకురావటంతో పాటు.. వారంతా క్లీన్ చిట్ తో ఉండటం మరో ఆసక్తికర పరిణామంగా చెప్పాలి. తాజాగా సీఎం పీఆర్వోలుగా ఎంపిక చేసిన అయోధ్య రెడ్డి (పూర్వ రంగంలో ప్రజాశక్తిలో పని చేశారు) విషయానికే వస్తే.. ఆయన్ను ఎవరు వేలెత్తి చూపే అవకాశం లేదు. ఇక.. ఢిల్లీలో సీఎం రేవంత్ ప్రజాసంబంధ వ్యవహారాల్ని చూసేందుకు తక్షణమే విధుల్లోకి చేరేలా విజయ్ (ఈనాడు లో పని చేశారు) అనే యువ జర్నలిస్టుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

కీలక స్థానాలకు ఎంపిక చేస్తున్న ఐఏఎస్.. ఐపీఎస్ ల విషయానికి వస్తే.. వారంతా కూడా ముక్కుసూటిగా.. ఎలాంటి మచ్చలేని వారు.. రాజకీయ ఒత్తిళ్లకుఅస్సలు లొంగే వారు కాకపోవటం గమనార్హం. హైదరాబాద్ మహానగరంలోని మూడు కమిషనరేట్ల (హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ)కు నియమించిన ముగ్గురు కమిషనర్లు కూడా ఇదే తీరుతో ఉండే వారిగా పేరుంది. ముఖ్యంగా హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు అయితే ఎలాంటి వారికి లొంగే రకం కాదని.. రూల్ బుక్ ను మాత్రమే ఫాలో అవుతారని చెబుతారు. ఇలా.. తన టీంను ఎంపిక చేసుకోవటంలో రేవంత్ అనుసరిస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది.

ఇంతకాలం అప్రాధాన్య పోస్టుల్లోనూ.. నిరాదరణకు గురైనఎంతోమంది సమర్థులకు అవకాశం ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. చూస్తుంటే.. తన ఎంపిక ద్వారా ప్రభుత్వ ప్రాధాన్యతలు ఏమిటన్న విషయాన్ని రేవంత్ చేతలతో చూపిస్తున్నట్లుగా చెబుతున్నారు. మార్పు మంచిదే అన్నట్లుగా ఆయన తీరు ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.