బిగ్ డౌట్? మోడీతో భేటీ తర్వాత రేవంత్ మౌనం.. భట్టి మాట్లాడటమా?
డిప్యూటీ సీఎంలు మీడియాతో మాట్లాడిన వేళలో.. ముఖ్యమంత్రి రేవంత్ మౌనంగా ఉంటే.. డిప్యూటీ సీఎం భట్టి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది.
By: Tupaki Desk | 27 Dec 2023 4:16 AM GMTఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. మంగళవారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కలు కలిసి ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ కావటం తెలిసిందే. దాదాపు గంటకు పైగా సాగిన ఈ భేటీలో రేవంత్ తో పాటు.. భట్టికి సమానమైన ప్రాధాన్యత లభించింది. అంతేకాదు.. ప్రధాని మోడీతో భేటీ వేళ.. రేవంత్ తో పాటు భట్టి కూడా అక్కడే ఉండటం.. ఇద్దరు కలిసి లోపలకు వెళ్లటం.. కలిసే బయటకు రావటం కనిపించింది.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ప్రధాని మోడీతో భేటీ తర్వాత బయటకు వచ్చి సీఎం.. డిప్యూటీ సీఎంలు మీడియాతో మాట్లాడిన వేళలో.. ముఖ్యమంత్రి రేవంత్ మౌనంగా ఉంటే.. డిప్యూటీ సీఎం భట్టి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వటం ఆసక్తికరంగా మారింది. ఎందుకిలా? ప్రధాని మోడీతో భేటీ సందర్భంగా ఏమేం జరిగిందన్న విషయాల్ని మీడియాకు బ్రీఫ్ చేసే వేళలో.. సీఎం రేవంత్ మౌనంగా ఉన్నారెందుకు? అన్నింటికి భట్టినే సమాధానం ఇవ్వటం వెనుక కారణం ఏమిటి? అన్నది సందేహంగా మారింది.
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. గడిచిన మూడు రోజులుగా రేవంత్ గొంతు ఇన్ఫెక్షన్ తో బాధ పడుతున్నారు. ఆదివారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు సీఎం రేవంత్.. ఇంటికే పరిమితమయ్యారు. వైద్యుల సూచన మేరకు ఎక్కువగా మాట్లాడకుండా.. వీలైనంత ఎక్కువగా విశ్రాంతి తీసుకున్న పరిస్థితి. గట్టిగా మాట్లాడే కార్యక్రమాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెప్పటంతో ఆయన వారి మాటల్ని తూచా తప్పకుండా ఫాలో అవుతున్నట్లుగా చెబుతున్నారు.
ఈ కారణంగానే ఢిల్లీలోని మీడియాతో మాట్లాడే వేళలోనూ రేవంత్ మౌనంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఎక్కువ సమయం గట్టిగా మాట్లాడితే ఆరోగ్య ఇబ్బందులు ఎదురవుతాయని.. నాలుగైదు రోజులు గట్టిగా మాట్లాడకుండా ఉంటే త్వరగా రికవరీ అయ్యే అవకాశం ఉందని చెప్పటంతో.. తాను మాట్లాడినస్థానే డిప్యూటీ సీఎం భట్టిని మాట్లాడాలని కోరినట్లుగా చెబుతున్నారు. పైగా ఢిల్లీ చలికి గొంతు ఇన్ఫెక్షన్ పెరిగే వీలుండటంతో.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రేవంత్ కు చెప్పినట్లుగా చెబుతున్నారు. ప్రధాని మోడీతో భేటీ సందర్భంగా గట్టిగా మాట్లాడాల్సిన అవసరం లేకపోవటం తెలిసిందే. ఏమైనా.. రేవంత్ ఆరోగ్య సమస్యలు భట్టికి వరంగా మారి.. ఆయన ప్రాధాన్యతను మరింత పెంచేలా చేశాయని చెబుతున్నారు.