ప్రత్యేక సలహాదారులతో సీఎం రేవంత్ జోరు
అధికారానికి పదేళ్లు అయిన నేపథ్యంలో.. పదవుల మీద బోలెడు మంది నేతలు ఆశలు పెట్టుకున్న వేళ.. పదవుల పందేరానికి తెర తీశారు రేవంత్.
By: Tupaki Desk | 21 Jan 2024 6:31 AM GMTఅంచనాలకు తగ్గట్లే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. రేవంత్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం తెలిసిందే. ముచ్చటగా మూడోసారి అధికారం ఖాయమని నమ్మిన కేసీఆర్ అండ్ కోకు తెలంగాణ ఓటర్ల తీర్పు భారీ షాకిచ్చేలా చేసింది. కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బొటాబొటి బలం మాత్రమే ఉండటంతో మహా అయితే ఆర్నెల్లలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు గులాబీ ముఖ్యనేతలు.
అయితే.. వారి ఆశలు అడియాశలు కావటం ఖాయమని.. వారు అనుకున్నదేదీ జరగదన్న సంకేతాల్ని తన చేతలతో చూపిస్తున్నారు రేవంత్ రెడ్డి. పదేళ్ల అధికారంతో అన్ని వ్యవస్థల్లో పాతుకుపోయిన గులాబీ మూలాల్ని వెలికి తీసేందుకు మొదటి నెల రోజులు వెచ్చించిన ముఖ్యమంత్రి రేవంత్..ఒక క్రమపద్దతిలో అడుగులు వేస్తున్నారు. తాజాగా పాలనా పరంగా మరింత ఫోకస్ చేయటంతో పాటు.. పదవుల పందేరానికి తెర తీశారని చెప్పాలి.
అధికారానికి పదేళ్లు అయిన నేపథ్యంలో.. పదవుల మీద బోలెడు మంది నేతలు ఆశలు పెట్టుకున్న వేళ.. పదవుల పందేరానికి తెర తీశారు రేవంత్. ఇందులో భాగంగా ముగ్గురు సలహాదారులను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి సలహాదారుగా మాజీ ఎమ్మెల్యే వేం నరేంద్రర్ రెడి.. ప్రభుత్వ సలహాదారుగా మాజీ మంత్రి షబ్బీర్ అలీ.. వేణు గోపాల్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అదే సమయంలో ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మాజీ ఎమ్మెల్యే మల్లు రవిని నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.తాజాగా పదవులు కేటాయించిన నలుగురికీ కేబినెట్ హోదాను కల్పిస్తున్నట్లుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. మరికొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తాజాగా తీసుకున్న నిర్ణయం ఆసక్తికరంగా మారింది.