Begin typing your search above and press return to search.

ఏం చేస్తారు? తొలిరోజున 6 గ్యారెంటీల అగ్నిపరీక్షను రేవంత్ డీల్ చేసేదెలా?

ప్రమాణస్వీకారోత్సం ముగిసిన తర్వాత.. ముఖ్యమంత్రి హోదాలో అశేష ప్రజానీకం చెంతన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయనున్నట్లుగా చెప్పటం తెలిసిందే.

By:  Tupaki Desk   |   7 Dec 2023 3:52 AM GMT
ఏం చేస్తారు? తొలిరోజున 6 గ్యారెంటీల అగ్నిపరీక్షను రేవంత్ డీల్ చేసేదెలా?
X

అరంటే ఆరు గ్యారెంటీలు అంటూ ఊరికి ముందే.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టేసిన కాంగ్రెస్ పార్టీ తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేయటమే కాదు.. అంచనాలకు తగ్గట్లే అధికారాన్ని సొంతం చేసుకుంది. ఆరు గ్యారెంటీలపై పక్కా హామీ ఇవ్వటమే కాదు.. తమ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రమాణస్వీకారోత్సవ రోజునే అమలుపై సంతకం పెట్టేస్తామని చెప్పటం తెలిసిందే. అయితే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో రేవంత్ ఏం చేయనున్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

ముఖ్యమంత్రిగా గురువారం మధ్యాహ్నం ఒంటి గంట వేళలో ప్రమాణస్వీకారం చేయనున్న రేవంత్.. ఆ పని పూర్తి చేసిన తర్వాత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలకు తగ్గట్లే.. ఏం చేస్తారు? ఏ ఫైల్ మీద తొలి సంతకం చేస్తారు? అన్నదిప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రిగా రేవంత్.. మంత్రులుగా పలువురు సీనియర్ నేతలు ప్రమాణ స్వీకారం చేస్తారని చెబుతున్నారు.

ప్రమాణస్వీకారోత్సం ముగిసిన తర్వాత.. ముఖ్యమంత్రి హోదాలో అశేష ప్రజానీకం చెంతన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయనున్నట్లుగా చెప్పటం తెలిసిందే. అయితే.. ఈ ఆరు గ్యారెంటీల విషయంలో రేవంత్ తన చతురతను ప్రదర్శిస్తారా? సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచే తలనొప్పులు మీద వేసుకుంటారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మొత్తం ఆరు గ్యారెంటీల్లో ముఖ్యమైన అంశాల్ని చూస్తే.. గ్యాస్ సిలిండర్ రూ.500లకు ఇవ్వటం.. కరెంటు బిల్లుల్ని 200 యూనిట్ల లోపు వచ్చే వారి నుంచి చిల్లు గవ్వ కూడా కట్టాల్సిన అవసరం లేకపోవటం తెలిసిందే.

వీటితో పాటు..మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఎక్కితే టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం ఆరు గ్యారెంటీ హామీల్లో ఈ మూడింటిని ఒక కొలిక్కి తీసుకురావటం అంత సులువైన విషయం కాదంటున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల హామీలుగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలను తొలి రోజు నుంచే అమల్లోకి తీసుకొచ్చే దూకుడు ప్రదర్శిస్తే మాత్రం రేవంత్ తప్పులో కాలేసినట్లే చెబుతున్నారు. ఆరు గ్యారెంటీల్లో ఒకట్రెండు తప్పించి.. మిగిలిన హామీల అమలుకు మార్చి 31 వరకుసమయం తీసుకోవటం మంచిదంటున్నారు.

అందుకు భిన్నంగా ఇన్ స్టెంట్ గా అన్ని హామీల్ని అమలు చేస్తామని చెప్పటమంటే.. కంపను నెత్తిన వేసుకోవటమే అవుతుంది. తన కంట్లో నలకలా మారాలని భావించిన సీనియర్లను సింఫుల్ గా పక్కన పెట్టేసి.. తాను చేయాల్సిన పనిని చేస్తునన రేవంత్.. ఆరు గ్యారెంటీల అగ్నిపరీక్షను సమర్థంగా ఎదుర్కొంటారా? లేదా? అన్నది ముఖ్యమంత్రి హోదాలో చేసే ప్రసంగంలో ఒక స్పష్టత వస్తుందంటున్నారు. వేలాది కోట్లు అవసరమైన ఆరు గ్యారెంటీల విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.