'ఓలా' మాదిరి రేవంత్ సర్కారు కొత్త యాప్
వారు లేవనెత్తిన అంశాల్ని పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం పట్టించుకోని ఒక ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. చర్యల కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
By: Tupaki Desk | 24 Dec 2023 5:00 AM GMTవావ్ అనిపించే నిర్ణయాన్ని తీసుకున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇటీవల కాలంలో భారీగా విస్తరించినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోని రంగంవైపు ఫోకస్ పెట్టిలా ఆయన నిర్ణయం ఉంది. ఓలా మాదిరి ఒక యాప్ ను తయారు చేయాలని టీ హబ్ కు ప్రత్యేక టాస్క్ ఇచ్చారు. క్యాబ్ డ్రైవర్లు.. ఫుడ్ డెలివరీ బాయ్ లు.. ఆటో డ్రైవర్లకు రూ.5 లక్షల చొప్పున యాక్సిడెంట్ పాలసీ తీసుకురావటం.. రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామన్నారు. తాజాగా నాంపల్లిలో నిర్వహించిన సమావేశంలో వీరితో నిర్వహించిన సమావేశంలోపాల్గొన్న ఆయన.. వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. వారు లేవనెత్తిన అంశాల్ని పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం పట్టించుకోని ఒక ఉదంతాన్ని ప్రస్తావిస్తూ.. చర్యల కోసం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
కొద్ది నెలల క్రితంఒక డెలివరీ కోసం స్విగ్గీ డెలివరీ బాయ్ వెళ్లగా.. అక్కడ కుక్క తరమటంతో భయపడి భవనం మీద నుంచి దూకిన ఉదంతంలో ఆ వ్యక్తి మరణించటం తెలిసిందే. మరణించిన వ్యక్తి కుటుంబ వివరాల్ని సేకరించి.. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆ కుటుంబానికి రూ.2 లక్షలు అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా క్యాబ్ డ్రైవర్ల కోసం ఓలా మాదిరి టీ హబ్ ఒక యాప్ అందుబాటులోకి తీసుకొస్తామన్న కొత్త హామీ ఆయన నోటి నుంచి వచ్చింది. సామాజిక రంగంలో రక్షణ కల్పించటంలో తెలంగాణ ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందన్నారు.
ఆ మధ్య రాజస్థాన్ లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి వచ్చే బడ్జెట్ సమావేశాల్లో సమర్థవంతమైన చట్టాన్ని ప్రవేశ పెడతామన్న రేవంత్ రెడ్డి.. సంస్థలు కేవలం లాభాపేక్ష మీద మాత్రమే పట్టించుకోకుండా కార్మికులు.. ఉద్యోగుల సంక్షేమంపై ఫోకస్ చేయాలన్నారు. 'గివ్ అండ్ టేక్' పాలసీని పాటించని ఎంత పెద్ద సంస్థ అయినా సరే.. వాటిపై చర్యలు తీసుకోవటానికి వెనుకాడమన్న ఆయన.. నాలుగు నెలల క్రితం స్విగ్గీ డెలివరీ బాయ్ ను కుక్క తరిమితే భవనం మీద నుంచి పడి చనిపోయిన వ్యక్తి కుటుంబం ప్రభుత్వం నుంచి ఏదైనా సాయం అందుతుందా? అని ఎదురుచూశారని.. కానీ అలాంటిదేమీ జరగలేదన్నారు. అందుకే.. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.2లక్షలు ఇవ్వనున్నట్లుగా పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే.. ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున విస్తరిస్తున్న ఒక కొత్త రంగం మీద రేవంత్ ఫోకస్ చేసిన వైనం అందరిని ఆకర్షిస్తోంది.