పదేళ్లు నేనే .. నా కుటుంబంలో ఎవరూ ..?!
రాష్ట్రంలో వచ్చే పదేళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను. ఏ విషయం అయినా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాను
By: Tupaki Desk | 29 April 2024 5:31 AM GMT‘’రాష్ట్రంలో వచ్చే పదేళ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను. ఏ విషయం అయినా పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాను. స్వంత నిర్ణయాలు తీస్కోను. నా కుటుంబంలో ఎవరూ రాజకీయాల్లోకి రారు. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏ బాధ్యతలు ఇచ్చినా చేపడతా’’ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. పవర్ కట్ ల మీద కేసీఆర్ అవాస్తవ ఆరోపణలు చేస్తున్నాడని, బీఆర్ఎస్ సభలకు ప్రజలు రావడం లేదని రేవంత్ అన్నాడు.
కుటుంబపాలన అని పదే పదే విమర్శించిన రేవంత్ తన మీద ఆ ముద్ర పడకూడదని ముందు జాగ్రత్తగా కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి రారని చెప్తున్నారని తెలుస్తుంది. అయితే రేవంత్ ముఖ్యమంత్రి అయిన వెంటనే జరిగిన పరిణామాల మూలంగా రేవంత్ జాగ్రత్తపడ్డాడా ? లేక వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాడా ? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
రేవంత్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి కొడంగల్ లో అధికారిక మీటింగ్ వేదిక మీద కూర్చోవడం విమర్శలకు దారితీసింది. తమ్ముడు కొండల్ రెడ్డి పోలీస్ కాన్వాయ్ తో కామారెడ్డి పర్యటనకు వెళ్లడం కూడా కలకలం రేపింది. ఆయన మల్కాజ్ గిరి నుండి పోటీచేస్తారన్న ప్రచారం జరిగింది.
ఇదే కాకుండా ఐఏఎస్, ఐపీఎస్ లతో పాటు కింది స్థాయి పోలీస్ అధికారుల నియామకం రేవంత్ సోదరుల కనుసన్నలలో నడిచాయన్న ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. అందుకే సోదరుల జోక్యంతో అనవసర వివాదాల్లో ఇరుక్కోకుండా కుటుంబ సభ్యులతో మాట్లాడి రేవంత్ వారి జోక్యాన్ని ఆదిలోని నివారించినట్లు తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్టీలో అనేక మంది మంత్రులు తమ కుటుంబ సభ్యులకు ఎంపీ టికెట్లు కోరినా రేవంత్ కుటుంబం నుండి ఏ డిమాండ్ రాకపోవడమే దీనికి నిదర్శనం అంటున్నారు.