విశాఖ సభకు రేవంత్.. టార్గెట్ ఎవరు?
దీనికి తెలంగాణ సీఎం, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. మొత్తం మూడు సభల్లో రేవంత్ పాల్గొనే అవకాశం ఉంది. తొలి సభ విశాఖలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయన ఇక్కడకు రానున్నారు.
By: Tupaki Desk | 10 March 2024 5:41 AM GMTఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా వైఎస్ షర్మిల పగ్గాలు చేపట్టిన తర్వాత.. పార్టీలో అనూహ్యమైన మార్పులు చోటు చేసు కున్నాయి. పార్టీలో చేరికల మాట ఎలా ఉన్నా.. అసలు వెంటిలేటర్‌పై ఉందని అనుకున్న కాంగ్రెస్‌ను అంతో ఇంతో లేవదీసే ప్రయత్నాలు చేస్తున్నారు. నేరుగా ప్రజలతో మమేకం అవుతున్నారు. సొంత సోదరుడు వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. దీంతో కాంగ్రెస్‌లో గతానికి ఇప్పటికి కొంత మార్పు అయితే కనిపిస్తోంది.
ఈ క్రమంలో తాజాగా ఎన్నికల ప్రచారానికికూడా షర్మిల శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా తొలి సభను విశాఖలో ఈ నెల 15న నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి తెలంగాణ సీఎం, కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. మొత్తం మూడు సభల్లో రేవంత్ పాల్గొనే అవకాశం ఉంది. తొలి సభ విశాఖలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆయన ఇక్కడకు రానున్నారు. అయితే.. ఆయన రాక వరకు ఓకే.. ఆయన ఏం చెబుతారు? ఎవరిని టార్గెట్ చేస్తారు? అనేది ఆసక్తిగా మారింది.
రేవంత్ ప్రసంగంలో రెండు కోణాలు ఉండే అవకాశం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 1) కాంగ్రెస్ పార్టీని ఏపీలో గెలిపిస్తే.. తెలంగాణ, ఏపీ ల మధ్య ఉన్న విభజన సమస్యలకు పరిష్కారం చూపించే అవకాశం ఉందని రేవంత్ చెప్పే చాన్స్‌కనిపిస్తోంది. ఇప్పటి వరకు అక్కడో పార్టీ.. ఇక్కడో పార్టీ అధికారంలోకి రావడంతో ఈ సమస్యలు పరిష్కారం కాలేదని.. అలా కాకుండా.. తెలంగాణలోనూ.. ఏపీలోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. విభజన సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందనే బలమైన హామీ ఇచ్చే అవకాశం ఉంది.
ఇక, 2) స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, ప్రత్యేకహోదాతో పాటు ఇతర అంశాలపై పోరాటానికి తాము కూడా సహకరిస్తారమనే హామీ ఇచ్చే అవకాశం ఉంది.ఈ వేదికపై నుంచి మేనిఫెస్టో విడుదల చేసే అవకాశం ఉంది. అదేసమయంలో ఆయన జగన్ సర్కారును టార్గెట్ చేసుకునే అవకాశం ఉంది. జగన్ వైఖరి కారణంగానే ఏపీ నుంచి హైదరాబాద్‌కు జనాలు తరలి వస్తున్నారని, ఇక్కడ పరిస్థితి ఏమీ బాగోలేదనే వాదనను కూడా ఆయన వినిపించే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా రాజధాని అమరావతి ఇష్యూను ప్రధానంగా ప్రస్తావించే చాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఏదేమైనా.. ఏపీలోరేవంత్ పర్యటన, ప్రసంగం కూడా ఆసక్తి రేపుతోంది.