Begin typing your search above and press return to search.

ఊరించే వరాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రేవంత్!

అధికారంలో ఉన్న వారికి హద్దులే ఉండవు. పంతానికి పోయి ఏ వరాన్ని అయినా ఇచ్చే వీలు ఉంటుంది.

By:  Tupaki Desk   |   20 April 2024 7:30 AM GMT
ఊరించే వరాలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రేవంత్!
X

అధికారంలో ఉన్న వారికి హద్దులే ఉండవు. పంతానికి పోయి ఏ వరాన్ని అయినా ఇచ్చే వీలు ఉంటుంది. మహా అయితే.. తామిచ్చిన ఎన్నికల హామీల్ని అమలు చేసే విషయంలో ఇబ్బందులు ఎదురైనా.. నిధుల కొరత ఎదురైనా.. ఏదోలా సర్దే ఛాన్సు ఉంటుంది. విపక్షాలకు కేవలం హామీలు ఇవ్వటం.. ప్రభుత్వం చేసే తప్పుల్ని ఎత్తి చూపటం తప్పించి మరో అవకాశం ఉండదు. అందుకే.. విపక్షాలు విరుచుకుపడే అంశాల్ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ.. అందుకు తగ్గట్లు వ్యూహాల్ని సిద్ధం చేసుకునే అధికారపక్షానికి ఎదురే ఉండదు.

ఇప్పుడీ సూత్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాటిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల వేళ.. ఆయన వరాల జల్లు కురిపించారు. నాలుగు నెలల పాలనలో ఇప్పటికే మెజార్టీ హామీల్ని అమలు చేయటం ద్వారా.. ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ముఖ్యమంత్రిగా గుర్తింపు పొందారు. కొంతకాలంగా ప్రధాన ప్రతిపక్షం తనను రైతుల పేరుతో టార్గెట్ చేయటాన్ని గుర్తించిన రేవంత్.. వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఒక్క సభతోనే తేల్చేయటమే కాదు.. వారికి వరాలు ఇచ్చేందుకు వెనుకాడలేదు.

తాజాగా నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన నోటి నుంచి కీలక ప్రకటన వచ్చింది. ఆగస్టు 15 లోపు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేయటంతో పాటు రూ.500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటామని తేల్చేశారు. దీంతో.. రైతులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న రెండు అంశాలపై కాల పరిమితితో సహా పక్కా హామీ ముఖ్యమంత్రి రేవంత్ నుంచి రావటం ఆ వర్గాల్లో సంబరం వ్యక్తమవుతోంది. దీంతో.. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లబ్థి పొందే పరిస్థితి ఉందని చెబుతున్నారు.

‘‘నా తెలంగాణ రైతు సోదరులకు భద్రాద్రి రాముడి సాక్షిగా.. మంత్రి తుమ్మల సాక్షిగా మాట ఇస్తున్నా. పంద్రాగస్టు లోపు రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేసి రుణం తీర్చుకుంటా. బరాబర్ రూ.500 బోనస్ ఇచ్చి వడ్లు కొంటాం. మా వంద రోజుల పాలన చూడండి. అమలు చేసిన పథకాలు చూసి మమ్మల్ని గెలిపించండి’’అని చెప్పటం ద్వారా రేవంత్ తన రాజకీయ ప్రత్యర్థులను ఉక్కిరిబిక్కిరి అయ్యేలా చేస్తున్నారని చెప్పాలి. నిజానికి పంద్రాగస్టు లోపు రూ.2 లక్షల రుణమాఫీ చేయటం అంత తేలికైన విషయం కాదు.

కానీ.. తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు నుంచి ఖర్చు విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరిస్తున్న రేవంత్.. ఆర్థిక పరిస్థితిని మెరుగుపర్చే పనిలో ఉన్నారు. దీని ఫలితంగానే తాజా ఎన్నికల హామీని అమలు చేయటం అంత కష్టం కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రైతుల రుణమాఫీ.. రూ.500 బోనస్ అంశాలపై రేవంత్ జాగు చేస్తారని.. దాంతో లబ్థి పొందొచ్చన్న విపక్షాల వ్యూహాన్ని ఒక్క సభతో తేల్చేశారు రేవంత్ రెడ్డి. కాల పరిమితితో హామీ ఇవ్వటం ద్వారా విపక్షాల్ని ఆత్మరక్షణలో పడేలా చేశారు. దీంతో.. ఎన్నికల్లో కొత్త అంశాల్ని వెతుక్కోవాల్సిన పరిస్థితిని సీఎం రేవంత్ కల్పించారని చెప్పక తప్పదు.