Begin typing your search above and press return to search.

సీఎం రేవంత్ సతీమణి ఏ ప్రోగ్రాంలోనూ ఎందుకు కనిపించట్లేదు?

అనూహ్య రీతిలో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన కేజ్రీవాల్ కావొచ్చు. అప్పట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దేవేంద్ర ఫడ్నవీస్ కావొచ్చు.

By:  Tupaki Desk   |   3 Jan 2024 5:23 AM GMT
సీఎం రేవంత్ సతీమణి ఏ ప్రోగ్రాంలోనూ ఎందుకు కనిపించట్లేదు?
X

అనూహ్య రీతిలో ఢిల్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన కేజ్రీవాల్ కావొచ్చు. అప్పట్లో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దేవేంద్ర ఫడ్నవీస్ కావొచ్చు. ఈ ఇద్దరు సీఎంల సతీమణులు తర్వాతి కాలంలో ఫేమస్ కావటమే కాదు.. తమదైన గుర్తింపును సొంతం చేసుకున్నారు. సీఎం సతీమణిగా తమదైన ఇమేజ్ ను పెంచుకున్న పరిస్థితి. అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి వ్యవహరిస్తున్నారు. జాగ్రత్తగా గమనిస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ సతీమణి ఇంటర్వ్యూల కోసం ప్రయత్నించిన మీడియా సంస్థలెన్నో.

అంతేనా.. ఆమెను తమ ప్రోగ్రాంలకు ముఖ్య అతిధిగా హాజరు కావాలంటూ విన్నపాల మీద విన్నపాలు చేస్తున్న వారెందరో. అయినప్పటికీ ఆమె మాత్రం ఎక్కడకు రావటం కనిపించదు. చాలా అరుదుగా మాత్రం భర్త కమ్ సీఎం రేవంత్ తో కలిసి ప్రత్యేక కార్యక్రమాల్లో దర్శనమిస్తున్నారు. అది కూడా ప్రత్యేక సందర్భాల్లో రాజ్ భవన్ లో గవర్నర్ నిర్వహించే కార్యక్రమానికి రావటం.. ఇంటికి వచ్చే ప్రముఖులకు అతిధి మర్యాదలు చేసే విషయంలోనే బయటకు వస్తున్నారు.

అంతకుమించి.. ఎవరు.. ఎంత పెద్ద స్థాయిలోని వారు ఆహ్వానించినప్పటికీ బయటకు రాకుండా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఎందుకిలా? అంటే.. ముఖ్యమంత్రి రేవంతే కారణమని చెబుతున్నారు. అదే సమయంలో రేవంత్ సతీమణి సైతం తనకు సీఎం సతీమణి హోదాతో వచ్చే గౌరవ మర్యాదల విషయంలో ప్రత్యేక ఆసక్తి లేదంటున్నారు.

వీలైనంత వరకు హడావుడికి దూరంగా.. సింఫుల్ గా ఉండాలన్నదే సీఎం రేవంత్ దంపతుల ఆలోచనగా చెబుతున్నారు. ఈ కారణంగానే ఆమెను.. ఎవరు.. ఎలాంటి కార్యక్రమానికి ఆహ్వానించినా.. నో అన్న మాటే వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు.. సీఎం రేవంత్ సైతం ముందుచూపుతో వ్యవహరిస్తూ.. వేలెత్తి చూపే అవకాశాన్ని ఇవ్వట్లేదంటున్నారు. అందుకే.. వీలైనంత జాగ్రత్తగా ఉంటూ.. ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించే కారణంగానే రేవంత్ సతీమణి బయట జరిగే ఏ ప్రోగ్రాంలకు హాజరు కావట్లేదంటున్నారు.