Begin typing your search above and press return to search.

'లీడర్' మూవీలో రానా మాదిరి రేవంత్ చేయనున్నారా?

అయినప్పటికీ లీడర్ మూవీలో రానా మాదరే.. కీలక అంశాల మీద ఫోకస్ పెట్టటం.. వ్యవస్థల్ని ప్రక్షాళన చేసేలా నడుం బిగించటం లాంటివి చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   15 Aug 2024 3:43 AM GMT
లీడర్ మూవీలో రానా మాదిరి రేవంత్ చేయనున్నారా?
X

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందన్న ప్రశ్న చాలా మంది నోటి నుంచి వస్తోంది ఇటీవల కాలంలో. గత ఏడాది చివర్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించటం.. రేవంత్ ను ముఖ్యమంత్రిని చేయటం లాంటివి చోటు చేసుకున్నాయి. ఆయన పాలనలో కుదురుకునే లోపే సార్వత్రికఎన్నికలు వచ్చాయి. వాటిల్లో బిజీ అయిన ఆయన.. పాలనను పెద్దగా పట్టించుకున్నది లేదు. కాకుంటే.. తాను అనుకున్నట్లే బీఆర్ఎస్ ఒక్క స్థానంలోనూ గెలవకుండా చేయటంలో మాత్రం సక్సెస్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు ఓకే అన్నట్లు ఉన్నప్పటికీ.. పాలనలో ఆయన మార్కు చూపించలేదన్న మాట వినిపిస్తోంది.

అయితే.. రేవంత్ గురించి బాగా తెలిసిన వారు.. ఆయన చేస్తున్న పనులు.. పాలిస్తున్న తీరు.. ఈ సందర్భంగా తీసుకొస్తున్న మార్పుల్ని నిశితంగా గమనిస్తే.. రేవంత్ భారీ యాక్షన్ ప్లాన్ ను తన మనసులో పెట్టుకొని అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. గత ముఖ్యమంత్రి మాదిరి సొంతంగా ఏ నిర్ణయాన్ని తీసుకోలేని ప్రత్యేక పరిస్థితులు ఉండటం.. అలాంటి వాటి విషయాల్లో చూసిచూడనట్లుగా వెళ్లటం.. అందరిని కలుపుకొని వెళ్లటంతో పాటు.. ఎవరికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత విషయంలో వారికి కట్టబెట్టటం లాంటివి చేస్తున్నారు. అయినప్పటికీ.. కొంత ఆశించే విషయంలో మాత్రం ఆయన తగ్గట్లేదన్న మాట వినిపిస్తోంది.

పాలన పరంగా చూస్తే.. హైదరాబాద్ మీద తన మార్కు వేయాలన్న పట్టుదల సీఎం రేవంత్ రెడ్డిలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. ఆయన తీరు చూస్తే.. 2010 ఫిబ్రవరిలో దగ్గుబాటి రానా నటించిన లీడర్ సినిమా గుర్తుకు రాక మానదు. అందులోనూ పలు పరిమితుల మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అర్జున్ ప్రసాద్ క్యారెక్టర్ (రానా నటించింది) ఆసక్తికరంగా ఉంటుంది.

కొంతకాలం అందరిని భరించటం.. ఆ తర్వాత తనదైన టీంను తయారు చేసుకొని సమాజంలో మార్పుల కోసం ప్రయత్నం చేయటం తెలిసిందే. మరీ.. సినిమాలో అంత కాకున్నా.. కొన్ని కీలక మార్పుల దిశగా రేవంత్ అడుగులు వేస్తున్నారని చెప్పాలి. లీడర్ సినిమాలో మంత్రులు తమ అవసరాలను తీర్చాలని.. ఆబ్లిగేషన్లను చూడాలంటూ ఒత్తిడి తేవటం కనిపిస్తుంది. సినిమాలో మాదిరి కాకున్నా.. కొన్ని పరిమితులకు లోబడి రేవంత్ పని చేస్తున్నారు.

అయినప్పటికీ లీడర్ మూవీలో రానా మాదరే.. కీలక అంశాల మీద ఫోకస్ పెట్టటం.. వ్యవస్థల్ని ప్రక్షాళన చేసేలా నడుం బిగించటం లాంటివి చేస్తున్నారు. హైడ్రా పేరుతో హైదరాబాద్ లోని చెరువుల్ని కబ్జా చేసే వారిని.. పార్కులను అక్రమించుకొని భవనాలు కట్టినోళ్లపై కఠినమైన చర్యలు తీసుకోవటం కనిపిస్తుంది. అధికారుల తీరుకు మజ్లిస్ నేతలు మాత్రమే కాదు.. కాంగ్రెస్ పార్టీలోకి ఇటీవల చేరిన దానం నాగేందర్ సైతం ఆగ్రహంతో ఉన్నారు.

చెరువుల్ని కబ్జా పెట్టినోళ్ల విషయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తే.. దశాబ్దాల తరబడి ఎలాంటి పరిస్థితి ఉందో.. ఇప్పుడు అదే పరిస్థితి కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అందుకు భిన్నంగా సొంతోళ్లకు కష్టమైనప్పటికీ.. కాదనకుండా పని చేసుకుంటూ పోతున్న రేవంత్ తీరు చూస్తే.. లీడర్ లో రానా మాదిరి పక్కా ఫ్యూచర్ ప్లాన్ తోనే అడుగులు వేస్తున్నట్లుగా చెప్పక తప్పదు.