ఇదేనా? కాళేశ్వరం కుంగుబాటుపై విచారణ.. రేవంత్ తొలి సంచలనం!?
ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రేవంత్ తీసుకునే సంచలన నిర్ణయాల్లో కేసీఆర్ సర్కారు లోటుపాట్లు.. అవినీతి వ్యవహారాల మీద ఫోకస్ చేస్తారా? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చగా మారింది.
By: Tupaki Desk | 6 Dec 2023 7:11 AM GMTఓటుకు నోటు కేసులో బుక్ చేసేందుకు ట్రాప్ పన్ని మరీ ఇరికించి.. తలెత్తుకోకుండా చేసిన గులాబీ బాస్ కేసీఆర్ మీద తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కానున్న రేవంత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ప్రతిపక్ష నేతగా.. టీపీసీసీ రథసారధిగా ఇప్పటికే బోలెడన్నిసార్లు జైలుకు పంపుతానని చెప్పిన రేవంత్.. ముఖ్యమంత్రి హోదాలో ఎలాంటి నిర్ణయం తీసుకునే వీలుంది? విపక్షంలో ఉన్నప్పుడు బోలెడన్ని మాటలు చెప్పొచ్చు. కానీ.. అధికారంలోకి వచ్చి.. ముఖ్యమంత్రి లాంటి బాధ్యతాయుతమైన పదవుల్ని చేపట్టిన తర్వాత దూకుడు ప్రదర్శించటం ఎంత వరకు సాధ్యం? అన్నది మరో ప్రశ్న.
ఇదిలా ఉంటే.. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రేవంత్ తీసుకునే సంచలన నిర్ణయాల్లో కేసీఆర్ సర్కారు లోటుపాట్లు.. అవినీతి వ్యవహారాల మీద ఫోకస్ చేస్తారా? అన్నదిప్పుడు ఆసక్తికర చర్చగా మారింది. రేవంత్ వచ్చినంతనే గులాబీ బాస్ సంగతి చూస్తాడన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్న వేళ.. అందరి అంచనాలకు తగ్గట్లుగానే ఆయన తీరు ఉంటుందా? అందుకు భిన్నంగా వ్యవహరిస్తారా? అన్నది మరో చర్చ. మిగిలిన సంగతులు ఎలా ఉన్నా.. వేలాది కోట్లు ఖర్చు చేసి నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు మీద రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువే అన్న అభిప్రాయం వినిపిస్తోంది.
ప్రతీకార ధోరణితో కాకుండా.. ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు విషయంలో ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? దానికి సంబంధించిన నిజానిజాల్ని ప్రజల ముందు పెట్టేందుకు వీలుగా విచారణ కమిటీని ఏర్పాటు చేసేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లుగా చెబుతున్నారు. గత ప్రభుత్వం మీద ప్రతీకార ధోరణితో కాకుండా.. నిజాలు ప్రజలకు తెలియాలన్నట్లుగా వ్యవహరిస్తే అందరి మనసుల్ని దోచుకునే వీలుందంటున్నారు.
అందుకు భిన్నంగా వ్యక్తుల్ని టార్గెట్ చేసినట్లుగా ప్రభుత్వ నిర్ణయం ఉంటే మాత్రం రేవంత్ తొలి అడుగులోనే తప్పటడుగు వేసినట్లు అవుతుందన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. కేసీఆర్ సర్కారు హయాంలో చోటు చేసుకున్నతప్పుల్ని ఎండగడుతూ.. ప్రభుత్వాధినేతగా తనకున్న అవకాశాన్ని వినియోగించుకుంటూ ఒద్దికగా వ్యవహరిస్తే మాత్రం అందరి మనసుల్ని గెలుచుకునే వీలుందని మాత్రం చెప్పకతప్పదు. తన రాజకీయ జీవితంలో డక్కామొక్కీలు తిన్న రేవంత్.. తొందరపాటుతోతప్పులు చేయరన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.