Begin typing your search above and press return to search.

రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఆ ముగ్గురూ డుమ్మా... కారణాలపై కొత్త చర్చ!

అవును... రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, బీఆరెస్స్ చీఫ్ కేసీఆర్ లు హాజరుకాలేదు.

By:  Tupaki Desk   |   7 Dec 2023 8:07 AM GMT
రేవంత్  ప్రమాణ స్వీకారానికి ఆ ముగ్గురూ డుమ్మా... కారణాలపై కొత్త చర్చ!
X

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి హైదరాబాద్ ఎల్బీ స్డేడియంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు ఉపముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్కతో పాటు 11 మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు బీఆరెస్స్ అధినేత కేసీఆర్ కు ఆహ్వానాలు పంపారని తెలుస్తుంది. అయితే వీరేవరూ ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు!

అవును... రేవంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, బీఆరెస్స్ చీఫ్ కేసీఆర్ లు హాజరుకాలేదు. ఇదే సమయంలో రేవంత్ కు అత్యంత సన్నిహితులు అని చెప్పే టీడీపీ అధినేత చంద్రబాబు కూడా హాజరుకాకలేదు. దీంతో వీరి గైర్హాజరుకు కారణాలు ఏమై ఉంటాయనే చర్చ బలంగా నడుస్తుంది. కావాలనే హాజరుకాలేదా.. లేక, నిజంగానే బలమైన కారణాలున్నాయా అనేది ఆసక్తిగా మారింది.

ఈ రోజు ఈ కార్యక్రమానికి వైఎస్ జగన్ హాజరుకాకపోవడానికి కీలక కారణాలున్నాయని తెలుస్తుంది. వైఎస్ జగన్ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అభివృద్ధి పనుల శంఖుస్ధాపన చేసే కార్యక్రమంలో బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఇంద్రకీలాద్రిపై రూ. 216 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది.

మరోపక్క టీడీపీ అధినేతకు కూడా రేవంత్ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం అందినట్లు చెబుతున్నారు. ఆయన కూడా ఈ కార్యక్రమానికి హాజరు రాలేదు. ఈ సమయంలో చంద్రబాబు ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు. అయితే ఇదొక్కటే అసలు కారణం కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. కారణం... రేవంత్ ప్రమాణస్వీకారానికి వెళ్తే బీజేపీ పెద్దలకు కోపం వస్తుందేమోనని ఆందోళన చెందుతున్నారని అంటున్నారు.

అయితే తెలంగాణలో పోటీనుంచి తప్పుకుని ఇప్పటికే కాంగ్రెస్ గెలుపుకు పరోక్షంగా సహకరించారని చెబుతున్న వేళ... ఆ ఆరోపణలకు బలం చేకూరినట్లు అవుతుందని బలంగా నమ్ముతున్నారని తెలుస్తుంది. దీంతో సరిగ్గా ఈ రోజు హస్తిన పర్యటన షెడ్యూల్ చేసుకున్నారని అంటున్నారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారనికి వెళ్తే రాబోయే ఏపీ ఎన్నికల్లో ఇబ్బదులు తప్పవని బాబు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారని తెలుస్తుంది.

ఇక ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించినప్పటికీ... బీఆరెస్స్ అధినేత కేసీఆర్ వెళ్లకపోవడానికి గల కారణాలు ప్రత్యేకంగా చర్చించాల్సిన అవసరం లేదు. సుమారు 10ఏళ్లుగా బీఆరెస్స్ తో కాంగ్రెస్ పార్టీ.. సుమారు గత రెండేళ్లుగా కేసీఆర్ తో రేవంత్ తీవ్రంగా పోరాడుతున్నారు. ఇక మాటల తూటాలు కోటలు దాటిన సంగతీ తెలిసింది. దీంతో... ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కేసీఆర్ డుమ్మా కొట్టారని అంటున్నారు.